పాతపంట.. కొత్త సంబురం 

14 Jan, 2021 02:25 IST|Sakshi

నేడు సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌లో ప్రారంభం

అంతరించిపోతున్న పాతపంటల పరిరక్షణకు కృషి 

జహీరాబాద్‌: అంతరించిపోతున్న పాతపంటల పరిరక్షణకు ఏటా మాదిరిగానే ఈసారీ పస్తాపూర్‌లోని డీడీఎస్‌ (డెక్కన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ) ఆధ్వర్యంలో పాత పంటల జాతరను నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. సంక్రాంతి పర్వదినమైన జనవరి 14న ఎడ్లబండ్లలో పాత పంటల ధాన్యంతో జాతరను సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌ మండలంలోని శంశల్లాపూర్‌ గ్రామంలో ప్రారంభిస్తారు. నెల తరువాత ఫిబ్రవరి 15న ఝరాసంగం మండలం మాచ్‌నూరులో నిర్వహించే కార్యక్రమంతో జాతర ముగుస్తుంది. పాతపంటల ప్రాధాన్యత గురించి వివరిస్తూ అంతరించిపోతున్న పంటలను పరిరక్షించుకుని పల్లె వ్యవసాయాన్ని కాపాడుకునే విధానంపై ప్రచారం నిర్వహిస్తారు. జాతరలో అందంగా అలంకరించిన 16 ఎడ్లబండ్లలో పాతపంటల ధాన్యాన్ని ప్రదర్శిస్తారు.  

వానాకాలం, యాసంగి కోసం విత్తనాల నిల్వలు
జహీరాబాద్‌ ప్రాంత రైతాంగానికి ప్రభుత్వం సరఫరా చేసే విత్తనాల కోసం ఎదురు చూడకుండా అవసరమైన విత్తనాలను ముందే నిల్వ చేసి ఉంచుతారు. రైతులు తాము పండించిన పంట చేతికందగానే పంటలోని నాణ్యమైన ధాన్యాన్ని విత్తనం కోసం సేకరించి పెడతారు. ఆ విత్తనాన్ని ఈత ఆకులతో చేసిన బుట్టల్లో పోసి పైభాగంలో మట్టి, పేడ కలిపి మూసివేస్తారు. విత్తనం ధాన్యంలో వేపాకు, బూడిద, పురుగు పట్టకుం డా మందు కలుపుతారు. విత్తనాలు నాటే సమయం రాగానే వాటిని బయటకు తీస్తారు. నియోజకవర్గంలోని దాదాపు 68 గ్రామాల్లో మహిళ లు విత్తన బ్యాంకులను ఏర్పాటు చేసుకున్నారు. డీడీఎస్‌ ఆధ్వర్యంలో విత్తన బ్యాంకులను నిర్వహిస్తున్నారు. ఈ విత్తనాలు సుమారు 10 వేల ఎకరాలకుపైగా సాగు చేసేందుకు ఉపయోగపడు తాయి. రైతులు 20 నుంచి 30 రకాల విత్తనాలను అందుబాటులో పెట్టుకుంటారు.

మరిన్ని వార్తలు