కాళేశ్వరం కింద 97,170 ఎకరాలకు సాగునీరు 

6 Aug, 2023 00:46 IST|Sakshi

ప్రాజెక్టుల కింద 13,16,557 ఎకరాల ఆరుతడి.. 

23,64,530 ఎకరాల వరికి నీటి సరఫరా 

సాగునీటి ప్రణాళిక కమిటీ నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: ప్రస్తుత వానాకాలంలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కింద 97,170 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ సి.మురళీధర్‌ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి సాగునీటి విడుదల ప్రణాళిక కమిటీ సమావేశమై వానాకాలంలో వివిధ ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు నీటి విడుదలపై నిర్ణయం తీసుకుంది. గోదావరి పరీవాహక ప్రాంతంలోని జలాశయాలన్నీ నిండి ఉన్న నేపథ్యంలో వాటి కింద పూర్తి స్థాయి ఆయకట్టుకు సాగునీరు అందించాలని నిర్ణయించింది.

కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులు ఇంకా నిండకపోవడంతో ఎగువ నుంచి వస్తున్న వరదలను పరిగణనలోకి తీసుకుని ఆయకట్టుకు సాగునీరు విడుదల చేయనున్నారు. రాష్ట్రంలోని భారీ ప్రాజెక్టుల కింద 36.81లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించనున్నారు. రాష్ట్రంలో 13,16,557 ఎకరాల ఆరుతడి, 23,64,530 ఎకరాల వరి పంటకు కలిపి మొత్తం 342.43 టీఎంసీలు సరఫరా చేయనున్నారు. కాళేశ్వరం కింద 71600 ఎకరాల వరి, 25570 ఎకరాల ఆరుతడి పంటలు కలిపి మొత్తం 97,170 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలని కమిటీ ప్రతిపాదించింది.  

మరిన్ని వార్తలు