టార్గెట్‌.. సెప్టెంబర్‌! 

7 Sep, 2020 02:34 IST|Sakshi

ఈ నెలాఖరులోగా ఉపకార వేతనాల దరఖాస్తులన్నీ పరిశీలించాలని సంక్షేమ శాఖల నిర్ణయం 

అక్టోబర్‌లో 2020–21 విద్యా సంవత్సరం దరఖాస్తులు ప్రారంభించే అవకాశం 

ఆలోపు 2019–20 విద్యా సంవత్సరం వరకు అన్నింటికీ అర్హత నిర్ధారణ

సాక్షి, హైదరాబాద్‌: పోస్టుమెట్రిక్‌ కోర్సులు చదివే విద్యార్థుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాలను వేగవంతం చేసే దిశగా సంక్షేమ శాఖలు చర్యలు చేపట్టాయి. కోవిడ్‌–19 ప్రభావంతో 2019–20 విద్యా సంవత్సరానికి సంబంధించిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియలో తీవ్ర జాప్యం నెలకొంది. వాస్తవానికి ఈ పథకాలకు సంబంధించిన దరఖాస్తులను ఏప్రిల్‌ నెలాఖరుకల్లా పూర్తి చేసి అర్హతను నిర్ధారించాల్సి ఉండగా, లాక్‌డౌన్‌తో ఈ ప్రక్రియకు బ్రేక్‌ పడింది. అనంతరం క్రమంగా కార్యాలయాలు తెరిచినా.. విద్యా సంస్థలు మాత్రం తెరవలేదు. దీంతో ఇప్పుడు ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు సంక్షేమ శాఖలు ప్రత్యేకంగా లక్ష్యాన్ని నిర్ధేశించాయి. ఈనెలాఖరు కల్లా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిశీలన చేసి అర్హతను నిర్ధారించాలని క్షేత్రస్థాయి యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశాయి. 

అర్హత తేలితేనే అంచనాలు... 
ప్రస్తుతం పోస్టుమెట్రిక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఎంట్రెన్‌ ్స టెస్టులు జరుగుతున్నాయి. ఇది కాగానే కాలేజీల్లో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తికానుంది. దీంతో వచ్చేనెలలో నూతన దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కంటే ముందే పెండింగ్‌లో ఉన్నవి పరిశీలించి అర్హత నిర్ధారించాలని సంక్షేమ శాఖలు భావిస్తున్నాయి. ఈ నెలాఖరులోగా పరిశీలన పూర్తయితే అందులో అర్హత ఉన్నవేవో ఖరారు చేయొచ్చు. అప్పుడు 2019–20 విద్యా సంవత్సరానికి ఉపకారవేతనా లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాలకు ఎంత నిధులు కావాలో తెలుస్తుంది.  

12.73 లక్షల దరఖాస్తులు... 
ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం కింద రాష్ట్రంలో ప్రతి సంవత్సరం గరిష్టంగా 13 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తులు సమర్పిస్తున్నారు. ఇందులో భాగంగా 2019–20లో 12.73 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో రెన్యూవల్‌ విద్యార్థులు7.69 లక్షల మంది, కొత్త విద్యార్థులు 6.71లక్షల మంది. గత నెలాఖరు నాటికి 5.78 లక్షల దరఖాస్తులు మాత్రమే పరిశీలించారు. కోవిడ్‌ నేపథ్యంలో పలువురు ఉద్యోగులు ఇంటివద్ద నుంచే పనిచేస్తున్నారు. దరఖాస్తులన్నీ ఆన్‌లైన్‌లోనే పరిశీలన చేయాల్సి ఉండటంతో వీలైన వారంతా వర్క్‌ ఫ్రం హోమ్‌ పద్ధతిలో పరిశీలన చేస్తున్నట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు.   

మరిన్ని వార్తలు