ఇక సాధారణ చికిత్సలు షురూ

3 Jul, 2021 10:13 IST|Sakshi

కరోనా కేసులు తగ్గటంతో ఇతర వైద్య సేవలు ప్రారంభించిన ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు 

ఖాళీ అయిన కరోనా పడకలు ఇతర రోగులకు కేటాయింపు 

సాధారణ వైద్య సేవలపై ప్రైవేటు ఆస్పత్రుల ప్రచారం 

వైద్యులు, ఇతర సిబ్బందికి గతంలో మాదిరిగానే వేతనాలు 

సాక్షి, హైదరాబాద్‌: కరోనా కేసులు తగ్గడంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు సాధారణ వైద్య సేవలు, శస్త్ర చికిత్సలు ప్రారంభిస్తున్నాయి. సెకండ్‌ వేవ్‌లో గణనీయంగా కేసులు పెరగడంతో చాలావరకు ఆసుపత్రులు కోవిడ్‌ చికిత్సకే పరిమితమైన సంగతి తెలిసిందే. అత్యవసర చికిత్సలు మినహా సాధారణ వైద్య సేవలు నిలిచిపోయాయి. అత్యవసరం కాని శస్త్ర చికిత్సలను సైతం ఆస్పత్రులు వాయిదా వేస్తూ వచ్చాయి. దీంతో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు, కొత్తగా ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమైనవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు కూడా బాగా తగ్గడంతో.. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో సాధారణ చికిత్సల పునరుద్ధరణకు అనుమతి ఇస్తూ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆదేశాలిచ్చారు. చిన్నచిన్న ప్రైవేట్‌ ఆసుపత్రులు కొన్ని కోవిడ్‌ చికిత్సను పూర్తిగా నిలిపివేసి సాధారణ కేసులను అడ్మిట్‌ చేసుకుంటున్నాయి. కరోనా చికిత్స అందిస్తున్నారంటే సాధారణ రోగులు రావడానికి వెనుకాడతారనే ఉద్దేశంతో చాలా ఆసుపత్రులు కోవిడ్‌ చికిత్సను విరమించుకున్నాయి.  

కరోనా పడకల్లో 91.11 శాతం ఖాళీ 
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో 55,442 పడకలను కరోనా సేవల కోసం కేటాయించారు. వాటిల్లో ప్రస్తుతం 4,931 మంది కరోనా రోగులు మాత్రమే ఉన్నారు. అంటే 91.11% పడకలు ఖాళీగా ఉన్నాయన్నమాట. ముఖ్యంగా సాధారణ ఐసొలేషన్‌ పడకలు 96.02 శాతం ఖాళీగా ఉన్నాయి. మరోవైపు రాష్ట్రంలో కరోనా కేసులు రోజుకు వెయ్యి లోపుగానే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లోని పడకలను ఇప్పుడు సాధారణ చికిత్సలకు కేటాయించడం ప్రారంభించారు. తమ ఆస్పత్రుల్లో సాధారణ వైద్య సేవలు ప్రారంభించినట్లు కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు ప్రచారం కూడా చేస్తున్నాయి. ఇలా కోవిడేతర రోగులు ఆసుపత్రులకు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు.   

అదనపు చెల్లింపులకు కోత 
కరోనా కేసులు బాగా పెరిగిన సమయంలో డాక్టర్లు, నర్సులకు వేతనాలు పెంచడంతో పాటు ఇతర అలవెన్సులు ఇచ్చిన ప్రైవేట్‌ యాజమాన్యాలు ఇప్పుడు వాటిని గణనీయంగా తగ్గించాయి. ప్రస్తుతం కరోనా చికిత్సలో పాల్గొనే వారికి మినహా మిగిలినవారి అదనపు వేతనాల్లో కోత విధించాయి. నర్సులు, పారామెడికల్‌ సిబ్బందిని ప్రత్యేకంగా ఎక్కువ జీతాలతో తీసుకున్న కొన్ని యాజమాన్యాలు ప్రస్తుతం వారిని విధుల నుంచి తొలగించాయి.

‘కేరళ సహా ఇతర రాష్ట్రాల నుంచి కొందరు నర్సులను ప్రత్యేకంగా తీసుకొచ్చాం. వారిలో కొందరికి నెలకు రూ. 50 వేల వరకు ఇచ్చాం. ఇప్పుడు వారితో అవసరం లేదు. కాబట్టి వారిని పంపించాం. అవసరమైతే మళ్లీ పిలుస్తామని చెప్పాం’ అని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రి ప్రతినిధి తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రులకు పోస్ట్‌ కోవిడ్‌ కేసులు ఎక్కువగా వస్తున్నట్లు ఆయన వివరించారు.

కరోనా వైద్యం అందించే అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో పడకల తాజా పరిస్థితి

1.    మొత్తం కరోనా పడకలు           –        55,442 
      కరోనా రోగులతో ఉన్నవి           –        4,931 
      ఖాళీగా ఉన్నవి                      –        50,511 
2.    ఇందులో సాధారణ పడకలు     –        21,846
      కరోనా రోగులు ఉన్నవి             –        871
      ఖాళీగా ఉన్నవి                      –        20,975
3.    ఆక్సిజన్‌ పడకలు                 –        21,751 
       కరోనా రోగులు ఉన్నవి           –        2,266 
       ఖాళీగా ఉన్నవి                    –        19,485 
4.    ఐసీయూ పడకలు               –        11,845 
    కరోనా రోగులు ఉన్నవి            –        1,794 
    ఖాళీగా ఉన్నవి                     –        10,051 
 

మరిన్ని వార్తలు