నగరానికి నీటి ముప్పు

23 Jan, 2024 00:46 IST|Sakshi

నాగార్జునసాగర్‌ జలాశయంలో తగ్గుతున్న నిల్వలు 

ప్రస్తుతం 520 అడుగులకు చేరిన నీటిమట్టం 

మరో పది అడుగులు తగ్గితే ఆందోళనకరమే 

తాజా వివాదంతో అత్యవసర ఎత్తిపోతలకూ కష్టమే 

సాక్షి, హైదరాబాద్‌: వేసవికి ముందే నగరానికి నీటిముప్పు పొంచి ఉంది. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులో నీటినిల్వలు తగ్గుముఖం పట్టి తాగునీటి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. సాగర్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 520 అడుగులకు చేరింది. సాగర్‌ నీటిమట్టం మరింత తగ్గి పుట్టంగడి పంపింగ్‌ కేంద్రానికి నీరు అందకపోతే అత్యవసర పంపింగ్‌ తప్పనిసరి అవుతుంది.

జలాశయంలో 510 అడుగుల నీటిమట్టం వరకు ఎలాంటి పంపింగ్‌ లేకుండా నగరానికి తాగునీటిని తరలించవచ్చు. వేసవినాటికి  జలాశయంలో నీటిమట్టం మరింత అడుగుకు చేరే అవకాశం కనిపిస్తోంది. అత్యవసర పంపింగ్‌ చేపట్టినా డెడ్‌స్టోరేజీ వరకు మాత్రమే నీటిని పంపింగ్‌ చేసేందుకు వీలుంటుంది. ప్రస్తుతం కృష్ణాజలాల తర లింపుపై తెలంగాణ, ఏపీ మధ్య వివాదం నెలకొన్న దృష్ట్యా ఈ సమస్య మరింత జఠిలమయ్యే ప్రమాదం కనిపిస్తోంది. 

సగంనీరు సాగర్‌ నుంచే... 
మహానగరవాసుల దాహార్తి తీర్చేందుకు సరఫరా చేస్తున్న తాగునీటిలో సగానికి పైగా నాగార్జునసాగర్‌ జలాశయం నుంచి తరలిస్తున్నారు. నగరంతోపాటు ఔటర్‌ రింగ్‌ రోడ్డు ప రిధిలోని అత్యధిక ప్రాంతాలకు కృష్ణా జలాలే ఆధారం. సాగర్‌ నుంచి నిత్యం 290 ఎంజీడీ నీటిని నగరానికి తీసుకొచ్చి సరఫరా చేస్తున్నట్టు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు పరిధిలోని పుట్టంగండి పంప్‌హౌస్‌ నుంచి అక్కంపల్లి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ ద్వారానే నీటిని సేకరిస్తున్నారు.

సాగర్‌ నీటిమట్టం 510 అడుగులకు పడిపోతే అక్కంపల్లి రిజర్వాయర్‌ నుంచి గ్రావిటీ ద్వారా నీటిని తరలించే పరిస్థితి ఉండదు. దీంతో కృష్ణాజలా ల పంపింగ్‌ నిలిచిపోతుంది. గతంలో నీటి మట్టం కిందకు పడిపోతుండగానే అత్యవసర పంపింగ్‌కు ఏర్పాట్లు జరిగేవి. గత ఐదేళ్ల క్రితం నాటి పరిస్థితి తిరిగి పునరావృత్తమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ఇదీ పరిస్థితి 
ఎగువన ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో కృష్ణాబేసిన్‌ వట్టిపోతోంది. నాగార్జునసాగర్‌లో నీటిమట్టం గతేడాది ఇదే రోజు నాటికి 571.900 అడుగులు ఉండగా, ఈసారి మాత్రం 520 అడుగులకు పడిపోయింది. ప్రాజెక్టు నీటి నిల్వ సామ ర్థ్యం పరిశీలిస్తే గతేడాది 261.300 టీఎంసీలు ఉంటే,  ఈ సారి మాత్రం 149.820 టీఎంసీలకు చేరింది.

వాస్తవంగా నాగార్జునసాగర్‌లో 510 అడుగుల నీటిమట్టం ఉంటేనే ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు ద్వారా నగరానికి తాగునీటిని అందించడానికి ఎత్తిపోతల సాధ్యమవుతుంది. అంతకంటే నీటి మట్టం తగ్గితే అక్కడ పంపులను నడపడం సాధ్యం కాదు. మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల నీటి అవసరాలకుగాను 505 అడు గుల వరకు నీటిని వినియోగించుకునేందుకు ఒప్పందం కూడా జరగడంతో అత్యవసర పంపింగ్‌తో కూడా నగరానికి నీటి తరలింపు సమస్యగా మారే ప్రమాదం కనిస్తోంది. 

జలాల తరలింపు  ఇలా.. 
హైదరాబాద్‌ మహానగరానికి వివిధ జలాశయాల నుంచి ప్రతి నిత్యం సుమారు 560 నుంచి 590 ఎంజీడీ (మిలియన్‌ గ్యాలన్‌ ఫర్‌ డే) నీటిని తరలిస్తున్నారు. కృష్ణా నుంచి 290 ఎంజీడీలు, గోదావరి నుంచి 160 ఎంజీడీలు, సింగూరు, మంజీరాల నుంచి 103 ఎంజీడీలు, ఉస్మాన్‌సాగర్‌ నుంచి 14 ఎంజీడీల నీటిని తరలిస్తున్నారు. హిమాయత్‌సాగర్‌ నుంచి ప్రస్తుతం నీటి సేకరణ జరగడం లేదు.  హిమాయత్‌సాగర్‌ నుంచి వచ్చే వేసవిలో అవసరాల మేరకు  పాతనగరానికి నీటిని అందించి,  కృష్ణా జలాల ప్రాంతాలకు సర్దుబాటు చేసే అవకాశాలు ఉన్నాయి. ఒక్క కృష్ణా జలాలు తప్ప అన్ని రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్నాయి. 

>
మరిన్ని వార్తలు