ఐఏఎస్‌ కావాలన్న ఆశలు ఆవిరి...

10 Nov, 2020 09:04 IST|Sakshi

షాద్‌నగర్‌ రూరల్‌: ఉన్నత చదువులు చదివి ఐఏఎస్‌ కావాలని ఆమె కల. దాని కోసం శ్రమిస్తోంది. కానీ, ఆర్థిక పరిస్థితులు ఉక్కిరిబిక్కిరి చేసి ఆత్మహత్యకు పురికొల్పాయి. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని శ్రీనివాస కాలనీకి చెందిన శ్రీనివాస్‌రెడ్డి, సుమతి దంపతులకు ఐశ్వర్య(19), వైష్ణవి కూతుళ్లు. శ్రీనివాస్‌రెడ్డి బైక్‌ మెకానిక్‌. ఐశ్వర్య 8వ తరగతి వరకు హైదరాబాద్‌లో వారి బంధువుల వద్ద చదువుకుంది. ఆ తర్వాత 9, 10 తరగతులు, ఇంటర్‌ షాద్‌నగర్‌లో అభ్యసించింది. ఇంటర్‌లో 985 మార్కులతో రాష్ట్ర స్థాయిలో మంచి ర్యాంకు సాధించింది. ఢిల్లీ వెళితే డిగ్రీతో పాటు సివిల్స్‌లో కూడా శిక్షణ తీసుకోవచ్చని ఉపాధ్యాయులు సూచించారు.

అయితే, ఐశ్వర్యకు ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా మారాయి. షాద్‌నగర్‌కు చెందిన కొందరు చదువులకయ్యే ఖర్చును భరిస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ఐశ్వర్యను తల్లిదండ్రులు ఢిల్లీకి పంపించారు. గత ఏడాదిన్నరగా ఆమె ఢిల్లీ వర్సిటీలోని హాస్టల్‌లో ఉంటూ డిగ్రీ (రెండవ సంవత్సరం) చదువుకుంటోంది. ఈ నేపథ్యంలో కరోనా కారణంగా వర్సిటీ వారు సెలవులు ప్రకటించడంతో ఐశ్యర్య షాద్‌నగర్‌కు వచ్చింది. ఇటీవల ఆమె ఫోన్‌కు వర్సిటీ నుంచి ఓ మెసేజ్‌ వచ్చింది. వెంటనే హాస్టల్‌ను ఖాళీ చేయాలని అందులో ఉంది. మరోవైపు కేంద్ర, శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ ఇచ్చే ఇన్‌స్పైర్‌ స్కాలర్‌షిప్‌ రాలేదు. బయట అద్దెకు ఉండి చదువుకోవాలంటే డబ్బులు కావాలి.
(చదవండి: ఐశ్వర్యది ప్రభుత్వ హత్యే!)

దీంతో ఆమె తల్లిదండ్రులు అప్పు కోసం ఎంతో ప్రయత్నించారు. ఆదుకుంటామని హామీ ఇచ్చిన వారు కూడా ముందుకురాలేదు. ఈ క్రమంలోనే శ్రీనివాస్‌రెడ్డి అనారోగ్యానికి గురయ్యాడు. తన చదువు కోసం తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులను చూసిన ఐశ్వర్య తీవ్ర మనోవేదనకు గురైంది. తన చదువు తల్లిదండ్రులకు భారమని.. అలా అని చదువు లేకపోతే బతకలేనని.. నన్ను క్షమించండి అని పేర్కొంటూ లేఖ రాసి ఈ నెల 3న ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కనీసం ఒక సంవత్సరం ఇన్‌స్పైర్‌ స్కాలర్‌షిప్‌ వచ్చేలా చూడండి అంటూ ఐశ్వర్య ఆ లేఖలో వేడుకుంది. 
(చదవండి: ‘అండగా ఉంటామని ముఖం చాటేశారు’)

చదువులు కొనసాగవనే బెంగతోనే
ఐశ్వర్య చిన్ననాటి నుంచి ఏ పరీక్షలు రాసినా మంచి మార్కులు సాధించేది. ఐఏఎస్‌ కావాలని కలలు కనేది. తన కలలను సాకారం చేయలేకపోయాం. చదువులు కొనసాగవనే బెంగతోనే నా కూతురు ఆత్మహత్య చేసుకుంది. 
– శ్రీనివాస్‌రెడ్డి, ఐశ్వర్య తండ్రి

మరిన్ని వార్తలు