వరద సహాయక చర్యలపై కేటీఆర్‌ సమీక్ష

20 Oct, 2020 13:07 IST|Sakshi

హైదరాబాద్: భారీ వర్షాలతో హైద్రాబాద్ నగరం అతలాకుతలమైంది. నగరంలో భారీ వరదల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో సహాయ, పునరావాస కార్యక్రమాలను చేపట్టేందుకు గాను ఢిల్లీ ప్రభుత్వం 15 కోట్ల రూపాయల సాయం ప్రకటించింది. ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ట్విట్టర్‌ వేదికగా ఈ విషయాన్ని తెలిపారు. ‘వరదలతో హైదరాబాద్‌ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ వాసులు హైదరాబాద్‌ సోదర సోదరీమణుల పక్షాన నిలబడి.. వారికి సాయం చేయాలనుకుంటున్నారు. దానిలో భాగంగా సహాయ పునరావాస కార్యక్రమాల కోసం ఢిల్లీ ప్రభుత్వం తెలంగాణకు 15 కోట్ల రూపాయల సాయం చేయనుంది’ అంటూ కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేశారు. (చదవండి: 1908.. ఆ రెండు రోజులు)

సహాయక చర్యలపై కేటీఆర్‌ సమీక్ష
ఇక హైదరాబాద్‌ వరద సహాయక చర్యలపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. నగర మేయర్, డిప్యూటీ మేయర్, జీహెచ్‌ఎంసీ పరిధి ఎమ్మెల్యేలుదీనిలో పాల్గొన్నారు. వరదలతో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ తక్షణ సాయం అందించాలని కేటీఆర్‌ సూచించారు. షెల్టర్ క్యాంపులను పరిశీలించి సహాయక చర్యలను పర్యవేక్షించాలన్నారు. ఈ క్రమంలో వరద సహాయక చర్యల్లో భాగంగా 2 నెలల వేతనం ఇచ్చేందుకు జీహెచ్‌ఎంసీ పరిధి ఎమ్మెల్యేలు, ఎంపీల నిర్ణయించారు.

మరిన్ని వార్తలు