MLC Kavitha: కవిత ఈడీ విచారణ.. రేపు మరోసారి

20 Mar, 2023 21:45 IST|Sakshi

లిక్కర్‌ స్కాంలో కవిత ఈడీ విచారణ.. అప్‌డేట్స్‌

లిక్కర్‌ స్కామ్‌లో  పదిన్నర గంటల పాటు ఈరోజు(సోమవారం)సుదీర్ఘ విచారణ ఎదుర్కొన్న కవిత.. రేపు మరోసారి విచారణకు హాజరు కానున్నారు. రేపు(మంగళవారం)  ఉదయం గం. 11:30 ని.లకు ఆమె మరోసారి ఈడీ ఎదుట విచారణకు హాజరుకానున్నారు.

ముగిసిన కవిత విచారణ
► ఉత్కంఠ వీడింది. దాదాపు పదిన్నర గంటలపాటు ఈడీ విచారణ తర్వాత బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. విచారణ తర్వాత నేరుగా బయటకు వచ్చి తన కారులో వెళ్లిపోయారామె.  

నెక్స్ట్‌ ఏంటి?

రాత్రి సమయంలో మహిళలను ప్రశ్నించడంపై దర్యాప్తు ఏజెన్సీల తీరును తప్పుబడుతూ సుప్రీం కోర్టులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌ విచారణ పెండింగ్‌లోనే ఉంది. కానీ, ఇవాళ ఈడీ విచారణ సందర్భంగా రాత్రి 8 గంటలు దాటినా.. ఆమె ఇంకా ఈడీ కార్యాలయంలోనే ఉన్నారు. దాదాపు పది గంటలపాటు ఆమెను ఈడీ విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఉదయం పిళ్లైతో.. సాయంత్ర నుంచి సిసోడియా, అమిత్‌ అరోరాతో ఆమెను ఈడీ ప్రశ్నిస్తోంది. వాంగ్మూలం, కీలక డాక్యుమెంట్లపై ఆమె నుంచి సంతకాలు సేకరించినట్లు కూడా తెలుస్తోంది. అదే సమయంలో ఈడీ ఆఫీస్‌ బయట ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. పది గంటలకు పైగా ఆమెను ఈడీ ప్రశ్నిస్తోంది.  ఒకవైపు భారీగా పోలీసులు ఈడీ ఆఫీస్‌ బయట మోహరించగా.. మరోవైపు బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు బయట ఎదురు చూస్తున్నారు.  నెక్స్ట్‌ ఏం జరగబోతోందా? అనే ఉత్కంఠ నెలకొంది.

విచారణ మొదలై తొమ్మిది గంటలు దాటిన.. కవిత ఈడీ విచారణ. ఇంకా ఈడీ ఆఫీసులోనే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ. జోరు వానలోనూ ఢిల్లీ ఈడీ ఆఫీస్‌ బయట భారీగా పోలీసుల మోహరింపు. 

కవిత నుంచి సంతకాల సేకరణ?
► డాక్యుమెంటేషన్‌, వాంగ్మూలంపై కవిత నుంచి సంతకాలు ఈడీ అధికారులు సేకరిస్తున్నట్లు సమాచారం.

ఈడీ ఆఫీస్‌ వద్ద భారీగా పోలీసులు
► ఢిల్లీలోని ఈడీ ఆఫీస్‌ వద్ద హైటెన్షన్‌ నెలకొంది. లిక్కర్‌ స్కాంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎనిమిది గంటలుగా విచారిస్తోంది ఈడీ. ఈ క్రమంలో భారీగా పోలీసులు ఈడీ ఆఫీస్‌ ముందు మోహరించారు. అంతకు ముందు ఆమె లాయర్ల బృందం, ఆ వెంటనే మహిళా వైద్యురాలి నేతృత్వంలోని బృందం ఈడీ కార్యాలయానికి చేరుకోవడం గమనార్హం. 

ఈడీ ఆఫీసుకి వైద్యుల బృందం
► లిక్కర్‌ స్కాంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఇవాళ ఉదయం నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను విచారిస్తోంది. ఒకవైపు ఆమె తరపు న్యాయవాదుల బృందం ఈడీ ఆఫీస్‌కు చేరుకోగా.. తాజాగా వైద్యుల బృందం సైతం అక్కడికి చేరుకుంది.

ఈడీ ఆఫీసుకి కవిత లాయర్లు
లిక్కర్‌ స్కాంలో ఇవాళ గంటల తరబడి ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ కొనసాగుతుండగా.. మరోవైపు ఆసక్తికర పరిణామం ఒకటి చోటు చేసుకుంది. ఢిల్లీలోని ఈడీ ఆఫీస్‌కు కవిత లాయర్ల బృందం చేరుకుంది.  న్యాయవాదులు సోమాభరత్‌, రామచంద్రరావు, మోహన్‌రావులతో కూడిన బృందం అక్కడికి చేరుకుంది. దీంతో ఏం జరగనుందా? అనే ఉత్కంఠ నెలకొంది.

నాలుగు గంటలు దాటిన విచారణ
►  ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ నాలుగు గంటలకు పైనే దాటింది. కన్‌ఫ్రంటేషన్‌ పద్దతిలోనే ఆమెను విచారిస్తోంది ఈడీ. ఈ క్రమంలో నిందితుడు  అరుణ్‌ రామచంద్ర పిళ్లైను కవితను ఎదురెదురుగా కూర్చోబెట్టి పశ్నించారు అధికారులు. ఈ తరుణంలో ఇవాళ పిళ్లై కస్టడీ ముగిడయంతో.. విచారణ మధ్యలోనే రౌస్‌ ఎవెన్యూ కోర్టుకు పిళ్లైను తరలించారు. పిళ్లై మధ్యేలోనే వెళ్లిపోయినప్పటికీ కవిత ఇంకా ఈడీ కార్యాలయంలోనే ఉండడంతో ఉత్కంఠను రేకెత్తిస్తోంది. మరోవైపు కోర్టు పిళ్లైకి జ్యూడిషియల్‌ రిమాండ్‌ విధించింది. ఏప్రిల్‌ 3 వరకు జ్యూడిషియల్‌ రిమాండ్‌ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

కవితపై రెండు గంటలుగా ప్రశ్నల వర్షం..
ఢిల్లీ లిక్కర్ స్కాం మనీ లాండరింగ్ కేసులో కవితను ప్రశ్నిస్తున్న ఈడీ అధికారులు
కవితను ముగ్గురు అధికారుల బృందం ప్రశ్నిస్తున్నట్లు సమాచారం
కవితను అరుణ్ పిళ్ళైని కలిపి ప్రశ్నిస్తున్న ఈడీ అధికారులు
ఢిల్లీ లిక్కర్ స్కాం లో కవిత పాత్ర, నిందితులతో ఉన్న సంబంధాలు, ఇండో స్పిరిట్స్ కంపెనీలో వాటాలు, 100 కోట్ల ముడుపుల వ్యవహారం పై కవితను ప్రశ్నిస్తున్న ఈడీ
ఇప్పటివరకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పాత్ర పై సేకరించిన ఆధారాలు సాక్ష్యాలతో కవితను ప్రశ్నిస్తున్న ఈడీ 
మౌఖికంగా,లిఖితపూర్వకంగా కవిత స్టేట్ మెంట్ రికార్డు చేస్తున్న అధికారులు
 అరుణ్ పిళ్ళై, బుచ్చిబాబు స్టేట్మెంట్ ఆధారంగా కవితను ప్రశ్నిస్తున్న ఈడీ

కవితను ఈడి అడిగే అవకాశమున్న ప్రశ్నలు...!
అరుణ్ పిళ్ళై మీ బినామీ నా ? మీ ప్రతినిధి గా ఇండో స్పిరిట్స్ లో వ్యాపారం చేసారా ?
లిక్కర్ స్కాం లో మీ పాత్ర  ఉందా ?
కేజ్రీవాల్,సిసోడియా తో మీకు రాజకీయ అవగాహన ఉందా?
ఇండో స్పిరిట్స్ లో పెట్టుబడులు పెట్టారా ?
విజయ్ నాయర్ ని 2021 మార్చి 19,20 తేదీల్లో కలిశారా?
100 కోట్ల ముడుపుల వ్యవహారం లో డబ్బు సమకూర్చారా ?
సిసోడియాతో మాట్లాడారా..? కలిసారా..?
లిక్కర్ పాలసీ రూపకల్పన సమావేశాల్లో పాల్గొన్నారా?
హైదరాబాద్ లో మీ నివాసంలో పిళ్ళై, సమీర్ మహేంద్రుని కలిసారా?
మొబైల్ ఫోన్స్ ఎందుకు మార్చారు?
ఆధారాలు ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారా?

ఢిల్లీ లిక్కర్ స్కాం మనీ లాండరింగ్ కేసులో కవితను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఆమె కార్యాలయంలోనికి వెళ్లి గంటకుపైనే అవుతోంది. అరుణ్ పిళ్ళై తో కలిపి కవితను విచారించనున్నట్లు తెలుస్తోంది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ 50కింద కవిత స్టేట్ మెంట్‌ను ఈడీ రికార్డు చేయనుంది.

ఢిల్లీ లిక్కర్ స్కాం మనీ లాండరింగ్ కేసులో అనుమానితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కవిత. సౌత్ గ్రూప్ నుంచి కవితను కీలక వ్యక్తిగా ఈడీ పేర్కొంటోంది. ఢిల్లీ లిక్కర్ స్కాం లో సౌత్ గ్రూప్ పాత్ర రూ.100 కోట్ల ముడుపుల వ్యవహారాలు, నిందితులతో సంబంధాలు, డీలర్ కమిషన్ పెంచడం, లిక్కర్ వ్యాపారులకు అనుకూలంగా పాలసీలో మార్పులపై ఢిల్లీ, హైదరాబాద్‌లో జరిగిన సమావేశాలపై  కవితను ఈడీ ప్రశ్నించనుంది.

కవిత ఇప్పటికే బ్యాంక్‌ స్టేట్ మెంట్స్ సహా ఈడి అడిగిన 12 డాక్యుమెంట్లను సమర్పించారు. లిక్కర్ స్కాం లో తన పాత్ర లేదని.. ఎవరో ఇచ్చిన స్టేట్ మెంట్స్ ద్వారా తనను ఇరికిస్తున్నారని కవిత ఫైర్ అయ్యారు. బీజేపీ దర్యాప్తు సంస్థల ద్వారా కక్ష సాధిస్తోందని ధ్వజమెత్తారు.

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇవాళ ఈడీ ఎదుట మరోసారి విచారణకు హాజరయ్యారు ఎమ్మెల్సీ కవిత. ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి ఆమె చేరుకున్నారు. కవిత భర్త అనిల్ ఆమెను వెన్ను తట్టి ఈడీ కార్యాలయంలో విచారణకు పంపారు.

అయితే కవిత వెళ్లేది ఈడికి భయపడి మాత్రం కాదని,  చట్టం పై గౌరవంతోనే వెళ్తున్నారని బీఆర్‌ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి పేర్కొన్నారు. విపక్షాలను టార్గెట్ చేసి దర్యాప్తు సంస్థలతో దాడులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అందరిపై విచారణ చేయకుండా, కేవలం విపక్షాలకు చెందిన నేతలపైనేదాడులు జరుపుతున్నారని మండిపడ్డారు.

10 పైసలు..
తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ లిక్కర్ స్కాంని పది పైసలతో పోల్చారు. లక్షల కోట్లు ఎగ్గొట్టినవారిని వదిలేసి తెలంగాణ ఆడబిడ్డను వేధిస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ గురించి ఢిల్లీ కేబినెట్ నిర్ణయం ప్రకారం ఇందులో ఏపీ, తెలంగాణ వాళ్ళు ఉంటే ఉండొచ్చన్నారు.

అంతకుముందు ఢిల్లీలో కవిత నివాసానికి వెళ్లారు తెలంగాణ అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు, మంత్రి శ్రీనివాస్ గౌడ్. విచారణకు ముందు ఆమె మరోసారి న్యాయ నిపుణులతో చర్చలు జరిపారు. ఈడీ విచారణ నిమిత్తం ఆదివారం రాత్రే తన సోదరుడు కేటీఆర్ తో కలిసి ఢిల్లీ చేరుకున్నారు.

కాగా.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ  కవితకు మూడోసారి నోటీసులిచ్చిన విషయం విధితమే. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, సెక్షన్ 50కింద కవిత స్టేట్ మెంట్‌ను ఈడీ  రికార్డు చేయనుంది. ఇప్పటికే బ్యాంకు స్టేట్ మెంట్స్ సహా ఈడి అడిగిన 12 డాక్యుమెంట్లను కవిత అందజేశారు.

వాస్తవానికి కవిత ఈనెల 16నే రెండోసారి విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే తాను  హాజరుకాలేనని ఈడీకి ఆమె అదే రోజు న్యాయవాది ద్వారా లేఖ పంపారు.  తనను ఇంటివద్దే విచారించాలని కోరారు. అయితే ఈడీ అందుకు నిరాకరించింది. మరోసారి.. మార్చి 20న హాజరుకావాలని నోటీసులు పంపింది. దీంతో ఆమె ఇవాళ విచారణకు హాజరయ్యారు. ఈడీ అధికారులు కవితను రామచంద్ర పిళ్లై, మనీష్ సిసోడియాతో కలిపి విచారించే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు