బుచ్చిబాబు లెక్కల్లో ‘లిక్కర్‌’ చిట్టా!

17 Sep, 2022 02:15 IST|Sakshi
ఆడిటర్‌ బుచ్చిబాబు నివాసం వద్ద భద్రతా సిబ్బంది 

హైదరాబాద్‌ కేంద్రంగానే లిక్కర్‌ స్కామ్‌కు బీజం

ప్రముఖ వ్యక్తి చుట్టూ బిగుస్తున్న లిక్కర్‌ కుంభకోణం ఉచ్చు

ఆడిటర్‌ బుచ్చిబాబు కార్యాలయాల్లో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్న ఈడీ

అరుణ్‌ రామచంద్రన్‌ పిళ్లై, అభిషేక్, ప్రేమ్‌సాగర్‌రావు, సీఏ బుచ్చిబాబు నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు

స్కామ్‌లో తెరపైకి కొత్త వ్యక్తుల పేర్లు, ప్రముఖ కంపెనీల పాత్ర

తనకు నోటీసులు ఇవ్వలేదని వెల్లడించిన ఎమ్మెల్సీ కవిత 

సాక్షి, హైదరాబాద్‌: దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన లిక్కర్‌ కుంభకోణం.. ఇక్కడ రాష్ట్ర రాజధానిలో ప్రకంపనలు సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా శుక్రవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు చేపట్టిన సోదాలు హైదరాబాద్‌లోనూ సాగాయి. ఇక్కడ పలువురి నివాసాలు, కార్యాలయాలు కలిపి ఏకకాలంలో 25 చోట్ల తనిఖీలు చేయడం కలకలం రేపింది.

ఈ స్కామ్‌లో కీలకమనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ వ్యక్తికి చెందిన ఆడిటర్‌తోపాటు బంధువులు, పరిచయస్తుల నివాసాల్లో సోదాలు జరగడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. కోకాపేట, రాయదుర్గం, అశోక్‌నగర్, మాదాపూర్‌ సహా పలు ప్రాంతాల్లో ఉదయం 8గంటలకు ప్రారంభమైన తనిఖీలు అర్ధరాత్రి వరకు కొనసాగాయి. 

ఆడిటర్‌ బుచ్చిబాబు కీలకంగా..
లిక్కర్‌ స్కామ్‌లో సీబీఐ అరుణ్‌ రామచంద్రన్‌ పిళ్ళై పేరును ఇప్పటికే నిందితుల జాబితాలో చేర్చింది. ఈ మేరకు అతడితోపాటు రాబిన్‌ డిస్టిలరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో డైరెక్టర్లుగా ఉన్న బోయినిపల్లి అభిషేక్‌రావు, గండ్ర ప్రేమ్‌సాగర్‌రావుల నివాసాల్లో ఈడీ కూడా సోదాలు నిర్వహించింది. లిక్కర్‌ స్కామ్‌లో వీరు మాత్రమే ఉన్నారని తొలుత భావించినా.. శుక్రవారం ఈడీ చేసిన దాడుల్లో కొత్త పేర్లు, కొత్త కంపెనీల వ్యవహారం వెలుగులోకి వచ్చినట్టు తెలిసింది.

ముఖ్యంగా రాష్ట్రంలో ఓ ప్రముఖ నేతకు ఆడిటర్‌గా ఉన్న గోరంట్ల బుచ్చిబాబు నివాసం, కార్యాలయాల్లో ఈడీ సోదాలు చేసింది. ఈ సందర్భంగా పలు కీలక అంశాలు బయటపడినట్టు తెలిసింది. అరుణ్‌ రామచంద్రన్‌ పిళ్ళైలైకి కూడా బుచ్చిబాబు ఆడిటర్‌గా వ్యవహరించారని గుర్తించినట్టు సమాచారం. అంతేగాకుండా లిక్కర్‌ స్కామ్‌లో పాత్రధారులు, సూత్రధారులు ఎవరు, ఎవరు ఏయే కంపెనీలు పెట్టారు, వెనుక ఉన్న వారెవరు, ఆ కంపెనీల నుంచి ఢిల్లీ లిక్కర్‌ కుంభకోణంలో టెండర్లకు ఉపయోగించిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి ఖాతాల నుంచి ఆ డబ్బును తరలించారన్న అంశాలకు సంబంధించిన ఆధారాలు లభించినట్టు తెలిసింది. 

లావాదేవీలతో క్లారిటీ 
లిక్కర్‌ స్కామ్‌లో పదే పదే పేరు వినిపిస్తున్న ప్రముఖ నేత పాత్ర ఏమిటన్నదానిపైనా ఓ స్పష్టతకు రాగలిగిన మేర ఆధారాలు లభించినట్టు ఈడీ వర్గాలు తెలిపాయి. లిక్కర్‌ టెండర్ల కోసమే పుట్టుకొచ్చిన షెల్‌ కంపెనీలు, టెండర్లలో పాల్గొన్న కంపెనీల నుంచి వెళ్లిన ‘ఎర్నెస్ట్‌ మనీ డిపాజిట్‌ (ఈఎండీ)’కు సంబంధించిన కీలక లావాదేవీల ఆధారాలనూ ఆడిటర్‌ బుచ్చిబాబు కార్యాలయంలో ఈడీ స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది.

మొత్తంగా తొమ్మిది కంపెనీల పేరిట జరిగిన లావాదేవీల వ్యవహారం బయటపడినట్టు సమాచారం. ఈ డబ్బును ఎవరు ఏ ఖాతా నుంచి బదిలీ చేశారు, ఏయే కంపెనీ ఎంత మేర లిక్కర్‌ షేర్ల కోసం సొమ్ము బదిలీ చేసిందన్న దానిపైనా పలు ఆధారాలను గుర్తించినట్టు తెలిసింది. ఓ ప్రముఖ ఫార్మా కంపెనీ డైరెక్టర్‌ కూడా లిక్కర్‌ వ్యవహారంలో రూ.8 కోట్ల మేర నగదు లావాదేవీ చేసినట్టు ఈడీ గుర్తించింది.

అదే విధంగా ఈడీ దాడుల జాబితాలో ఉన్న విజయ్‌ నాయర్, అభినవ్‌రెడ్డి, చందన్‌రెడ్డి, పెరమన్‌ రిచర్డ్‌ తదితర పేర్లు కూడా బయటికి వచ్చాయి. వీరి నివాసాలు, కార్యాలయాల్లోనూ ఈడీ సోదాలు చేసింది. మరో 18 కంపెనీలకు ఈడీ నోటీసులు జారీచేసినట్టు తెలిసింది. ఈ కంపెనీలన్నీ హైదరాబాద్‌ నుంచే కార్యకలాపాలు సాగించడం ఆసక్తికరమైన అంశమని ఈడీ వర్గాలు చెబుతున్నాయి. 

బుచ్చిబాబు ఎపిసోడ్‌తో మారిన ఫోకస్‌! 
కొంత మంది చుట్టే లిక్కర్‌ స్కామ్‌ ప్రచారం జరుగుతున్న సమయంలో.. ఆడిటర్‌ బుచ్చిబాబుపై ఈడీ ఫోకస్‌ పెట్టడం కీలక మలుపు అని అధికారవర్గాలు చెబుతున్నాయి. ప్రముఖ నేతతోపాటు కేసులో నిందితులుగా ఉన్న అరుణ్‌ రామచంద్ర పిళ్ళై, అభిషేక్‌రావు, ప్రేమ్‌సాగర్‌రావులకు సంబంధించిన కీలక పత్రాలన్నీ బుచ్చిబాబు దగ్గర లభ్యమవడమే దీనికి కారణమని పేర్కొంటున్నాయి. సదరు వ్యక్తులు లిక్కర్‌ వ్యవహారంలో పెట్టిన డబ్బుకు ఆధారాలతో లెక్కచెప్పాల్సి ఉంటుందని అంటున్నాయి. 

హైదరాబాద్‌లోనే కుంభకోణానికి బీజం! 
అరుణ్‌ రామచంద్రన్‌ పిళ్ళై ద్వారా హైదరాబాద్‌ నుంచే ఢిల్లీ లిక్కర్‌ కుంభకోణానికి బీజం పడినట్టు సీబీఐ, ఈడీ బలంగా విశ్వసిస్తున్నాయి. అరుణ్‌ రామచంద్రన్‌కు అభిషేక్‌రావు, ప్రేమ్‌సాగర్‌రావులతో ఉన్న లింకు ఏమిటి? వీరి ఆడిటర్‌కు అరుణ్‌ రామచంద్రన్‌తో సంబంధం ఎలా ఏర్పడిందన్న అంశాలపై సీబీఐ ఫోకస్‌ చేసినట్టు తెలుస్తోంది.

ఇండో స్పిరిట్‌ కంపెనీ, అరుణ్‌ రామచంద్రన్‌లకు ఉన్న సంబంధాలపై ఇప్పటికే ఈడీ, సీబీఐలు స్పష్టతకు వచ్చినట్టు తెలిసింది. లిక్కర్‌ టెండర్లలో కీలకపాత్ర పోషించిన బెంగళూరు సంస్థ ఇండో స్పిరిట్‌కు, హైదరాబాద్‌లో ఈ ఏడాది ఏప్రిల్‌లో ఏర్పాటైన రాబిన్‌ డిస్టిలరీస్‌ మధ్య కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్టుగా భావిస్తున్నట్టు సమాచారం. 

ఉచ్చు బిగుస్తోందా? 
లిక్కర్‌ కుంభకోణం విషయంగా ఈడీ బృందాలు భారీ ఎత్తున సోదాలు చేస్తున్న నేపథ్యంలో.. ఈ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ నేతకు ఉచ్చు బిగుసుకుంటోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో ఆ నేత డైరెక్టర్‌గా ఉన్న ప్రముఖ బ్యూటీ పార్లర్, హెల్త్‌ కేర్‌ కంపెనీలోనూ సోదాలు జరగడం దీనికి మరింత బలం చేకూరుస్తోందని అధికారవర్గాలు చెబుతున్నాయి. బినామీ కంపెనీలు పెట్టి లిక్కర్‌ టెండర్ల గోల్‌మాల్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలపై.. తాజాగా ఆడిటర్‌పై దాడులతో స్పష్టత వస్తోందని పేర్కొంటున్నాయి. 

మరిన్ని వార్తలు