ఎకరాకు రూ. 6 వేలు

29 Jul, 2020 05:28 IST|Sakshi

వ్యవసాయ కూలీలకు పెరిగిన డిమాండ్‌

నెల రోజుల ముందే బుకింగ్

వాహన సౌకర్యం కూడా ఏర్పాటు

గ్రూపులుగా ఏర్పడి రోజుకు మూడు చోట్లకు పనికి..

ఊరూరా తిరుగుతున్నా కూలీలు దొరకడం లేదంటున్న రైతులు

జోగిపేట (అందోల్‌):
వానాకాలం సీజన్‌ ఊపందు కోవ డంతో వ్యవసాయ కూలీలకు డిమాండ్‌ బాగా పెరిగింది. గతంలో రూ.300, రూ.400కే రోజంతా పనిచేసే కూలీలు.. ఇప్పుడు ఏకంగా ఎకరాకు రూ.5 వేలు నుంచి రూ.6 వేలు డిమాండ్‌ చేస్తున్నారు. నాట్లు వేయడానికి కూలీలు కావాలంటూ రైతులు ఊరూరా తిరగడం.. నెల రోజుల ముందే బుకింగ్‌ చేసుకోవడం.. వారి కోసం వాహన సౌకర్యం ఏర్పాటు చేయ డం చూస్తుంటే ఏ మేరకు డిమాండ్‌ ఉందో ఇట్టే అర్థమవుతోంది.

సంగారెడ్డి జిల్లాలో ఈ సీజన్‌లో 6,38,814 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయాలని వ్యవసాయ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. అందులో 13,909 ఎకరాల్లో వరి పంటలు పండిస్తున్నారు. జహీరాబాద్, నారాయణఖేడ్, అందోల్, సంగారెడ్డి ప్రాంతాల్లో వ్యవసాయ భూములు ఎక్కువగా ఉన్నాయి. సకా లంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండ టంతో వ్యవసాయ పనులు ఊపందు కున్నాయి. ఫలితంగా కూలీల కొరత ఏర్పడింది. దీంతో రేటును ఒక్కసారిగా పెంచేశారు. ఎకరాకు రూ.5 నుంచి రూ.6 వేల చొప్పున గుత్తగా మాట్లాడుకుంటు న్నారు. కొన్ని చోట్ల అదనంగా పెట్టె కల్లును కూడా ఇవ్వాలని కూలీలు డిమాండ్‌ చేస్తున్నారు. ఐదు నుంచి ఎనిమిది మంది ఒక గ్రూపుగా ఏర్పడి కొన్ని గంటల్లోనే నాట్లు వేసి మరో చోటికి వెళ్తున్నారు. ఇలా ఒక్కో రోజు మూడు, నాలుగు చోట్లకు వెళ్లి నాట్లు వేస్తున్నారు. 

నెల రోజుల ముందే బుకింగ్‌
వరి నాట్ల కోసం రైతులు గ్రామాలకు వెళ్లి అడ్వాన్సుగా కొంత మొత్తం చెల్లించి కూలీలను బుకింగ్‌ చేసుకుంటున్నారు. మధ్యవర్తులు ఉండి కూలీలను మాట్లా డిస్తున్నారు. ఈ సమయంలో వారికి కూడా కొంత ముట్టజెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. సదరు కూలీలు కావాలనుకున్న రైతు.. ఆటోలో తీసుకువెళ్లాలని ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. కూలీల కోసం ఊరూరా తిరుగుతున్నా దొరడకం లేదని రైతులు వాపోతున్నారు. వ్యవసాయ రంగానికి కూలీల కొరత తీవ్ర ఇబ్బందిగా మారిందన్నారు. 

గుత్త పట్టుకుంటున్నాం
రోజు లెక్క కాకుండా, గుత్త లెక్కన పట్టుకుంటున్నం. 5 నుంచి 8 మందిమి నాట్లు వేయడానికి చుట్టు పక్క గ్రామాలకు వెళ్తాం. ఆటో చార్జీలు వారే కట్టిస్తరు. ఎకరాకు రూ.5 నుంచి రూ.6వేల వరకు తీసుకుంటున్నాం. ఒక్కొక్కరికి ఒక సీసా కల్లు కూడా ఇస్తారు. 
– కాల్వ మీది లక్ష్మి, కూలీ, కన్‌సాన్‌పల్లి

మరిన్ని వార్తలు