ఉందిగా పండగ.. వర్రీ దండగ

9 Aug, 2020 08:41 IST|Sakshi

పండుగల సీజన్‌పైనే కంపెనీల ఆశలు

వినియోగదారులను ఆకట్టుకునేలా పలు సంస్థల వ్యూహాలు

గ్రామీణ ప్రాంతాల్లోనూ పరిశుభ్రతపై పెరిగిన అవగాహన

సాక్షి, హైదరాబాద్ ‌: దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ రాబోయే ఆరునెలల్లో వేగంగా పుంజుకుంటుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. కరోనా కష్టకాలంలో గత ఆరు నెలలుగా వినిమయ వస్తువుల గిరాకీకి డిమాండ్‌ తగ్గి డీలా పడిన వివిధ కంపెనీల వినియోగ ఉత్పత్తుల మార్కెట్‌ కూడా మెరుగయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయనే ఆశాభావాన్ని వివిధ మార్కెటింగ్‌ సంస్థల అధ్యయనాలు వ్యక్తం చేస్తున్నాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి భయంతో విధించిన లాక్‌డౌన్, ఆ తర్వాత కోవిడ్‌ మహమ్మారి విజృంభణ నేపథ్యంలో అనేక మార్పుచేర్పులు చోటుచేసుకున్నాయి. 

గ్రామీణ మార్కెట్‌ బలోపేతంపై...
ప్రస్తుత కోవిడ్‌ కాలంలో ఆరోగ్యభద్రత, పరిశుభ్రతతో ముడిపడిన ఉత్పత్తుల ద్వారా కస్టమర్ల నమ్మకాన్ని పొందేందుకు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగా తమ వ్యూహాలను మార్చుకుంటున్నాయి. షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, ఆఫీసులు, వేర్‌హౌజింగ్‌ వంటి వాటికి శాశ్వత భద్రతా, సంరక్షణ చర్యలు వంటి చర్యలతో థర్డ్‌–పార్టీ ఈ–కామర్స్‌ సంస్థలతోనూ సంబంధాలు విస్తృతం చేసుకుంటున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని కస్టమర్లు సైతం వ్యక్తిగత పరిశుభ్రత, ఇళ్లను శుభ్రంగా ఉంచుకోవడం, ఆరోగ్యభద్రతకు సంబంధించిన ఉత్పత్తులు, వస్తువులను ఎక్కువగా వినియోగించడంపై దృష్టి పెడుతుండటంతో ఈ మార్పు మరింత వేగంగా సంభవించవచ్చునని అంచనా వేస్తున్నారు. దీంతో పాటు రాబోయే నెలల్లో వరుసగా వస్తున్న పండుగల సీజన్‌ వల్ల కూడా అటు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోనూ వివిధ రకాల వినియోగ ఉత్పత్తుల కొనుగోళ్లు పెరుగుతాయని భావిస్తున్నారు.

కస్టమర్ల అభిరుచుల్లో మార్పులు...
కోవిడ్‌ కారణంగా ప్రత్యక్ష, పరోక్ష పద్ధతుల్లో పడుతున్న ప్రభావాలతో వినియోగదారుల అభిరుచులు, కొనుగోళ్ల తీరు, వ్యవహారంలో ఇప్పటికే కొన్ని కీలకమార్పులు చోటుచేసుకోగా, మరికొన్ని చోటుచేసుకోబోతున్నాయి.‘ఫ్యూచర్‌ కన్జూమర్‌ ఇండెక్స్‌’ పేరిట ఎర్నెస్ట్‌ యంగ్‌ ఇండియా సంస్థ భారతీయ వినియోగదారులపై నిర్వహించిన తాజా సర్వేలో దీనికి సంబంధించిన పలు అంశాలు వెల్లడయ్యాయి. కస్టమర్ల అభిరుచుల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా తమ తమ ఉత్పత్తులను ఆ విధంగా మలచుకోవడంపై వివిధ కంపెనీలు దృష్టి నిలుపుతున్నట్టు తెలుస్తోంది.  

మరిన్ని వార్తలు