పిల్లల చిరుతిండి.. డిమాండ్‌ దండి! 

28 Sep, 2020 04:49 IST|Sakshi

పదేళ్లలోపు పిల్లలకు ఆరోగ్యకరమైన ‘స్నాక్స్‌’పై దృష్టి 

బెల్లం ఆధారిత ఉత్పత్తులు, ఇతర ఆహార పదార్థాలు తయారీ 

ఫాస్ట్‌ మూవింగ్‌ కన్జూమర్‌ గూడ్స్‌ స్టార్టప్‌ల యత్నం

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ మహమ్మారి రాక ముందు పిల్లలు ఏ స్నాక్స్‌ అడిగినా పెద్దలు అడ్డుచెప్పేవారు కాదు. అయితే, వైరస్‌ వచ్చాక పిల్లల డిమాండ్లను తోసిపుచ్చుతున్నారు. కారణం.. వైరస్‌ భయంతోపాటు రోగనిరోధక శక్తిని పెంచడానికి ఆ స్నాక్స్‌ ఉపయోగపడవనే ఆలోచనే. దీంతో పిల్లల చిరుతిండి తయారుచేసే కంపెనీల ప్రణాళికల్లో మార్పులు తప్పనిసరి అయ్యాయి. పదేళ్లలోపు పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారంతోపాటు రోగ నిరోధక శక్తి పెంచేందుకు దోహదపడేలా స్నాక్స్‌ రూపం లో వివిధ తినుబండారాలు అందించే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. గతంలో చిన్న పిల్లల చిరుతిండి, స్నాక్స్‌ సెగ్మెంట్‌ను కంపెనీలు పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రస్తుతం కోవిడ్‌ కారణంగా నూతన ఆవిష్కరణల వైపు ఫాస్ట్‌ మూవింగ్‌ కన్జూమర్‌ గూడ్స్‌ స్టార్టప్‌లు ప్రణాళికలు అమలు చేస్తున్నాయి.

పిల్లలకు ఆరోగ్యవంతమైన ఆహారం అందించేందుకు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. పిల్లల చిరుతిండి కోసం ప్రత్యేకంగా ఒక సెగ్మెంట్‌ ఏర్పాటు చేసుకునేందుకు ఇప్పటికే కొన్ని కంపెనీలు కార్యాచరణ చేపట్టగా మంచి ఫలితాలే నమోదయ్యాయి. ప్రీ బయోటెక్‌ చాక్‌లెట్లు, హోల్‌ గ్రెయిన్‌ స్నాక్స్, పల్లీ, డ్రై ఫ్రూట్స్, ఇతర నట్స్‌తో తయారు చేసిన చాక్‌లెట్‌ బార్లు, ఇలా భిన్నమైన ఉత్పత్తుల ద్వారా చిన్నపిల్లలు, వారి తల్లిదండ్రులను ఆకర్షించే ప్రయ త్నాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలోనే బెల్లం తో తయారుచేసిన తినుబండారాలు, ప్రొటీన్లతో కూడిన పానీయాలు, డెయిరీ ప్రొడక్ట్‌లు, ఇతర ఆహార పదార్థాల తయారీ పెరుగుతోంది. ప్రస్తుతం మనదేశంలో చిన్నపిల్లల స్నాక్స్‌ మార్కెట్‌ సెగ్మెంట్‌ నాలుగు బిలియన్‌ అమెరికన్‌ డాలర్లు ఉన్న ట్లు అంచనా. ఇది 2023 కల్లా దశలవారీ మూడు రెట్లు పెరుగుతుందని కంపెనీలు భావిస్తున్నాయి.  

మరిన్ని వార్తలు