Dengue Fever: హైదరాబాద్‌ను వణికిస్తున్న డెంగీ కేసులు.. షార్ట్స్‌ వేసుకుంటే కాటేస్తాయి

12 Jun, 2022 08:08 IST|Sakshi

సీజన్‌కు అతీతంగా విస్తరిస్తున్న వ్యాధి 

సాక్షి, హైదరాబాద్‌: దోమకాటుతో వచ్చే డెంగీ వ్యాధి నగరంలో ప్రబలుతోంది. సాధారణంగా వానాకాలంలో ఎక్కువగా కనపడే డెంగీ.. ఇప్పుడు సీజన్స్‌కు అతీతంగా సిటీలో విస్తరిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే నగరంలో 167 డెంగీ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించడం గమనార్హం. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు తగిన చర్యలు చేపడుతున్నారు. నగరవాసులు సైతం జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.  

సంపన్న ప్రాంతాల్లో అధికం.. 
కొంత కాలంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లలోని సంపన్న ప్రాంతాల్లో సైతం కేసులు బాగా పెరుగుతున్నాయని అధికారులు గుర్తించారు. డెంగీ దోమకి గుడ్డు పెట్టడానికి 10మి.లీ ద్రవం చాలు. కూలర్స్, ఫ్రిజ్‌లు, ఏసీలు తదితరాల నుంచి వృథా నీరు ఎప్పటికప్పుడు తొలగించకపోవడం, ఇళ్లల్లో ఇంటీరియర్‌ అందం కోసం ఎక్వేరియమ్స్‌ నీళ్లలో తాబేలు, ఫ్లవర్‌ పాట్స్‌ లాంటి డెకరేటివ్‌ ఉత్పత్తుల్లో నీళ్లు రోజూ మార్చకపోవడం దోమల విజృంభణకు కారణమవుతోంది. వేసవి సెలవులు కారణంగా.. ఊరు వెళుతున్నప్పుడు వారం, పదిరోజుల పాటు ఆ నీటిని అలాగే వదిలేస్తుండడం.. ఈ నిల్వ నీటిలో సులభంగా డెంగీ దోమ గుడ్లు పెడుతోంది.  

షార్ట్స్‌ వేసుకుంటే.. కాటు.. 
డెంగీ దోమ అడుగున్నర మించి ఎగరలేదు. మోకాళ్ల పైదాకా వచ్చి కుట్టలేదు. కాబట్టి డెంగీ దోమ షార్ట్స్‌ వేసుకునే అలవాటు ఉన్నవారికి తరచుగా కాటేస్తున్నట్టు గుర్తించారు. సిబ్బంది దోమల మందు పిచికారీ చేయడానికి కూడా కొన్ని కాలనీస్‌లలో అడ్డుకుంటున్నారు. ఇది సరికాదు.. ప్రస్తుతం తుంపర్లు లేకుండా గాలిలోనే కలిసిపోయేలా మందు పిచికారీ చేస్తున్నారు. కాబట్టి కాలనీలలో అడ్డు చెప్పకుండా సహకరించాల్సిన అవసరం ఉంది.  గత ఏడాది ఆగస్టు వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల్లో 48.5 శాతం అంటే 2,091 కేసులు హైదరాబాద్‌ రంగారెడ్డి, మేడ్చల్‌– మల్కాజిగిరి జిల్లాల్లోనే నమోదు  కావడం గమనార్హం.  

డెంగీ లక్షణాలు, చికిత్స
►ఉన్నట్టుండి తీవ్ర జ్వరం, భరించలేని తలనొప్పి, కళ్లలో మంట, చర్మంపై దద్దుర్లు, కండరాలు, కీళ్లనొప్పులు, అధిక దాహం, బీపీ తగ్గుదల.

►ప్లేట్‌లెట్‌ కౌంట్, డెంగీ స్ట్రిప్‌ టెస్ట్, సీరమ్‌ టెస్ట్‌తోపాటు తప్పనిసరిగా ఐజీఎం పరీక్ష చేయించాలి.

►డెంగీ జ్వరాన్ని గుర్తిస్తే వెంటనేవైద్యుని సలహా తీసుకోవాలి.

►ప్లేట్‌లెట్లు 50 వేలలోపు పడిపోతే దాన్ని ప్రమాదకరమైన పరిస్థితిగా పరిగణించాలి.

►జ్వరం తీవ్రతను తగ్గించేందుకు చల్లని నీటిలో స్పాంజీని ముంచి శరీరాన్ని తుడవాలి.

►రోగికి ఎలక్ట్రాల్‌ పౌడర్, పండ్ల రసాలు ఇవ్వాలి. దీనివల్ల జ్వర తీవ్రత తగ్గి ప్లేట్‌లెట్లు మళ్లీ పెరుగుతాయి. 

ఈ జాగ్రత్తలు పాటించాలి 
ఖాళీ బీరు, విస్కీ తదితర బాటిల్స్‌ ఇంట్లో, మేడమీద ఎక్కడ పడితే అక్కడ పడవేయవద్దు. ఫ్లవర్‌ పాట్స్‌ కింద ఉంచే ప్లేట్స్‌ నుంచి నీటిని తొలగిస్తూ ఎప్పటిప్పుడు శుభ్రం చేస్తుండాలి. ప్రతి నాలుగైదు రోజులకోసారి ఇంట్లో నీరు నిల్వ ఉండే ప్రదేశాలను శుభ్రం చేస్తుండాలి. పగిలిన వినియోగించని ప్లాస్టిక్‌ కంటైనర్లు, వాడేసిన కొబ్బరి చిప్పలు, పాత సామాన్లు పడేసే స్టోర్‌ రూమ్స్‌ దోమల నివాసాలని గుర్తించాలి.  

షౌకత్‌నగర్‌లో ఎక్కువ... 
నాన్‌ సింప్టమాటిక్‌ డెంగీ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటిదాకా ఇన్‌ పేషెంట్‌ చికిత్స అవసరం ఎవరికీ రాలేదు. ఒక్క కేసు వచ్చినా చుట్టూ 100 ఇళ్లు ఫీవర్‌ సర్వే చేస్తూ, మెడికల్‌ క్యాంప్స్‌ పెడుతున్నాం. కేవలం షౌకత్‌ నగర్‌లో తప్ప ఒకసారి డెంగీ గుర్తించిన ప్లేస్‌లో మళ్లీ కేసులు రావడం లేదు. సిటీలో షౌకత్‌ నగర్‌లో 6 కేసుల వరకూ వచ్చాయి. నగరంలోని 152 బస్తీ దవాఖానాలు, పట్టణ ప్రాథ మిక ఆరోగ్య కేంద్రాలు.. ఇలా అన్ని చోట్ల ఉచిత పరీక్షలు అందుబాటులో ఉన్నాయి.  
– నిరంజన్, జిల్లా మలేరియా ప్రోగ్రామ్‌ అధికారి, హైదరాబాద్‌ 

మరిన్ని వార్తలు