చిన్నారుల్లో ‘డెంగీ’ కలవరం!

27 Sep, 2021 03:41 IST|Sakshi

నగరంలో ప్రతి ఇంట్లో ఒకరు జ్వరపీడితులే

విజృంభిస్తున్న మలేరియా, టైఫాయిడ్‌ జ్వరాలు

జ్వర పీడితులతో కిటకిటలాడుతున్న నిలోఫర్‌ ఆస్పత్రి

ఉస్మానియా, గాంధీ, ఫీవర్‌ ఆస్పత్రులకు పోటెత్తుతున్న రోగులు

ఇదే అదనుగా దోపిడీకి తెరతీస్తున్న ప్రైవేట్‌ ఆస్పత్రులు  

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ నుంచి గ్రేటర్‌ వాసులు ఇంకా పూర్తిగా కోలుకోకముందే తాజాగా డెంగీ, మలేరి యా, టైఫాయిడ్, చికెన్‌గున్యా జ్వరాలు వెంటాడుతున్నాయి. ఇటీవల ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తోడు...వాతావరణంలో చోటు చేసుకుంటున్న అనూహ్య మార్పుల వల్ల అనేక మంది విషజ్వరాల బారినపడు తున్నారు. గ్రేటర్‌ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో ప్రస్తుతం ఏ ఇంట్లోకి చూసినా కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు దగ్గు, జలుబు, జ్వరం, ఒంటి నొప్పులతో బాధపడుతున్నట్లు వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ముఖ్యంగా ఈ జ్వరపీడితుల్లో చిన్నారులు ఎక్కువగా ఉండటం విశేషం. ప్రతి ఐదుగురు జ్వరపీడితుల్లో ఒకరికి డెంగీ పాజిటివ్‌ రిపోర్ట్‌ అవుతుండటం ఆందోళన కలిగిస్తుంది. బస్తీ, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో సరైన వైద్యసేవలు అందక పోవడంతో శివారు ప్రాంతాల్లోని బాధితులంతా మెరుగైన వైద్యం కోసం నగరంలోని బోధనాసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. ఫలితంగా ఉస్మానియా, గాంధీ, నిలోఫర్‌ సహా నల్లకుం ట ఫీవర్‌ ఆస్పత్రి, కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి.

రోగుల నిష్పత్తికి తగినన్ని పడకలు లేకపోవడంతో ఉస్మానియా, నిలోఫర్‌ ఆస్పత్రుల్లో రోగులను నేలపై పడుకోబెట్టి చికిత్సలు అందించాల్సి వస్తుంది. వెయ్యి పడకల సామర్థ్యం కలిగిన నిలోఫర్‌ ఆస్పత్రిలో ప్రస్తుతం 1,200 మంది చికిత్స పొందుతున్నారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.  

కిటకిటలాడుతున్న పెద్దాసుపత్రులు.. 
హైదరాబాద్‌ జిల్లాలో 85 పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఉండగా, రంగారెడ్డి జిల్లాలో 40పైగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. ఇక మేడ్చల్‌ జిల్లాలో 36 ఉన్నాయి. ఈ మూడు జిల్లాల పరిధిలో 200పైగా బస్తీ దవాఖానాలతో పాటు ఏడు ఏరియా ఆస్పత్రులు ఉన్నాయి. ఆయా ఆస్పత్రుల్లో సరైన వైద్యసేవలు అందడం లేదు. సాధారణ రక్త, మూత్ర పరీక్షలకు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుండటంతో అత్యవసర పరిస్థితుల్లో వారంతా ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఫీవర్‌ ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు.

సాధారణ రోజుల్లో ఉస్మానియా ఆస్పత్రిలో రోజు సగటు ఓపీ 1,200 ఉండగా, ప్రస్తుతం 1,800 నుంచి 2,000పైగా నమోదవుతోంది. ఇక ఫీవర్‌ ఆస్పత్రిలో సాధారణ రోజుల్లో సగటు ఓపీ 350 ఉండగా, ప్రస్తుతం వెయ్యి దాటింది. ఇక నిలోఫర్‌ చిన్నపిల్లల ఆస్పత్రిలో సాధారణ రోజుల్లో 900 ఉండగా, ప్రస్తుతం ఈ సంఖ్య 1,500 దాటింది. ఈఎన్‌టీ ఆస్పత్రిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఆయా ఆస్పత్రుల్లో రోగుల నిష్పత్తికి తగినన్ని పడకలు లేకపోవడంతో వచ్చిన వారిని నేలపై పడుకోబెట్టి వైద్యసేవలు అందిం చాల్సి వస్తుంది.

ఓపీకి వస్తున్న వారిలో ఎక్కువగా జ్వరపీడితులే. కరోనా భయం ఇంకా పోకముందే, డెంగీ జ్వరాలు వెంటాడుతుండటంతో నగరవాసులు కంటిమీద కునుకు లేకుండా గడపాల్సి వస్తుంది. కరోనా, డెంగీలోనూ ఒకే లక్షణాలు ఉండటంతో ఈ జ్వరాల గుర్తింపు ఆందోళన కలిగిస్తోంది.  

సాధారణ జ్వర పీడితులకు డెంగీ బూచీ.. 
ఆరోగ్య కేంద్రాల్లో డెంగీ నిర్ధారణ పరీక్షలు చేసే అవకాశం లేకపోవడంతో అక్కడికి వచ్చిన బాధితుల నుంచి రక్తనమూనాలు సేకరించి ఐపీఎంలోని తెలంగాణ డయాగ్నోస్టిక్‌ సెంటర్‌కు పంపుతున్నారు. రిపోర్టుల జారీలో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో జ్వరం తీవ్రత మరింత పెరిగి రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. విధిలేని పరిస్థితుల్లో పేదలు ప్రైవేటు డయాగ్నోస్టిక్‌ సెంటర్లను ఆశ్రయించాల్సి వస్తుంది. కరోనా, డెంగీ పరీక్షల పేరుతో ఆయా కేంద్రాలు రోగుల నిలువుదోపిడీకి పాల్పడుతున్నాయి.

డయాగ్నోస్టిక్‌ సెంటర్లపై సరైన నియంత్రణ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రైవేటు ఆస్పత్రుల్లోని వైద్యులు సాధారణ జ్వరాలను కూడా డెంగీ, కరోనా జ్వరాలుగా పేర్కొంటూ అత్యవసర చికిత్సలను సిఫార్సు చేస్తున్నారు. ఐసీయూ చికిత్సల పేరుతో పేదలను దోచుకుంటుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది.

నగరం లోని కొంత మంది వైద్యులు డెంగీ మరణాలను బూచిగా చూపించి..ప్లేట్‌లెట్‌ కౌంట్స్‌ చికిత్సల పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి. అంతేకాదు డెంగీ కేసుల వివరాలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు తెలియజేయాల్సి ఉన్నా.. అనుమానం రాకుండా సస్పెక్టెడ్‌ డెంగీ కేసుగా అడ్మిట్‌ చేసుకుని చికిత్సలు చేస్తుండటం విశేషం. 

డెంగీకి కారణాలివే 
– డాక్టర్‌ స్వరాజ్యలక్ష్మి, జిల్లా వైద్య 
ఆరోగ్యశాఖ అధికారి, రంగారెడ్డిజిల్లా 
ఎడిస్‌ ఈజిప్టే (టైగర్‌)దోమ కుట్టడం వల్ల డెంగీ సోకుతుంది. సాధారణంగా ఇది పగలు మాత్రమే కుడుతుంది. 
కేవలం పగలు మాత్రమే కుట్టే డెంగీ దోమలు లైట్ల వెలుగులు విరజిమ్ముతుండటంతో రాత్రి వేళలోనూ కుడుతున్నాయి.  
ఇంటి పరిసరాల్లో ఖాళీ కొబ్బరి బోండాలు, సీసాలు, డబ్బాలు, టైర్లు, ప్లాస్టిక్‌ గ్లాసులు లేకుండా చూసుకోవాలి.  
వర్షపు నీరు వీటిలో చేరి నిల్వ ఉండటం వల్ల దోమలకు నిలయంగా మారి వీటిలో గుడ్లు పెడుతుంటాయి. 
ఇంటి పరిసరాల్లో నీటి గుంతలు లేకుండా చూసుకోవాలి. మంచినీటి ట్యాంకులపై మూతలు పెట్టి ఉంచాలి.  

సీజన్‌ మారుతుండటం వల్లే 
– డాక్టర్‌ వెంకటి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ 
అధికారి, హైదరాబాద్‌ జిల్లా 
వాతావరణ మార్పులను శరీరం తట్టుకోలేదు. సీజన్‌ మారిన ప్రతిసారీ దగ్గు, జలుబు, టైఫాయిడ్‌ జ్వరాలు సర్వసాధారణం. భయపడాల్సిన పనిలేదు. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, నిల్వ ఉన్న ఆహార పదార్థాలకు బదులుగా అప్పుడే వండిన తాజా ఆహార పదార్థాలను తీసుకోవడం, గోరు వెచ్చని మంచినీరు తాగడం; తరచూ చేతులను శుభ్రం చేసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ప్రతి ఒక్కరూ విధిగా కోవిడ్‌ టీకాలు వేసుకోవాలి.   

మరిన్ని వార్తలు