Hyderabad: డెంగీ, ఇతర వ్యాధులతో తల్లడిల్లుతున్న జనం  

15 Sep, 2022 17:41 IST|Sakshi
ఫీవర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇన్‌ పేషెంట్లు

సాక్షి, హైదరాబాద్‌: నగరంపై విషజ్వరాలు ముప్పేట దాడి చేస్తున్నాయి. సీజనల్‌ ఫీవర్లు చుట్టుముడుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులన్నీ రోగులతో నిండిపోతున్నాయి. బస్తీ దవాఖానాల్లో పరిస్థితి కూడా అందుకు భిన్నంగా ఏమీలేదు. కరోనా సమయంలో కనపడకుండా పోయిన సీజనల్‌ వ్యాధులన్నీ ఇప్పుడు విరుచుకుపడుతున్నాయి. జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులతో బాధపడుతూ బాధితులు దవాఖానాల బాట పడుతున్నారు. అధికారుల గణాంకాల్లో తక్కువగా కనపడుతున్నా, డెంగీ కేసుల సంఖ్య భారీగానే ఉందని ప్రైవేటు ఆసుపత్రుల్లో పేషెంట్ల రద్దీ, ప్లేట్‌లెట్లకు పెరుగుతున్న డిమాండ్‌ వెల్లడిస్తోంది. మరోవైపు వైద్యారోగ్య శాఖ కేవలం నామమాత్రపు చర్యలకే పరిమితమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి.


గాంధీ ఓపీ విభాగంలో క్యూలైన్లలో బారులు తీరిన రోగులు  

గాంధీఆస్పత్రి/ నల్లకుంట/తార్నాక జ్వరంతో ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. బేగంపేట శ్యాంలాల్‌ బిల్డింగ్‌లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలో గత నెలలో 16, ఈ నెలలో ఇప్పటివరకు 6 డెంగీ కేసులు నమోదయ్యాయి. సాధారణ రోజుల్లో ఓపీ రోగుల సంఖ్య 60– 70 వరకు ఉంటే ప్రస్తుతం 110 నుంచి 120 మందికి, అలాగే 50 వరకు ఓపీ ఉండే సనత్‌నగర్‌ అశోక్‌ కాలనీ బస్తీ దవాఖానాలో ఆ సంఖ్య 100కు చేరింది. ఇక్కడ 6 దాకా డెంగీ కేసులున్నాయి.   

సనత్‌నగర్‌ అర్బన్‌ హెల్త్‌ ప్రైమరీ సెంటర్‌లో సాధారణ రోజుల్లో 100–120 వరకు ఉండే సంఖ్య 150కు చేరింది. గత రెండు వారాల్లో ఇక్కడి యూపీహెచ్‌సీ పరిధిలో 2 డెంగీ కేసులు నమోదు కావడం గమనార్హం. అదే విధంగా కొండాపూర్‌ ఏరియా జిల్లా ఆస్పత్రికి  రోజు 400 నుంచి 450 మంది వస్తున్నారు. వీరిలో రోజుకు 40 నుంచి 50 మంది జ్వరంతో బాధపడుతున్నవారు ఉండగా,  రోజుకు 20 మంది ఆస్పత్రిలో చేరుతున్నారు. ‘వర్షాలతో మురుగు పేరుకుపోవడంతో దోమల ద్వారా జ్వరాలు సోకుతున్నాయి. ప్రస్తుతం పేషెంట్ల సంఖ్య రెట్టింపు అయ్యింది’ అని కొండాపూర్‌ ఏరియా ఆస్పత్రి సూపరిటెండెంట్, డాక్టర్‌ వరదాచారి చెప్పారు. 

ఉప్పల్‌లో ఇంటికొకరు..  
ఉప్పల్‌లో ఇంటికి ఒకరు చొప్పున విష జ్వరాలు బారిన పడుతుంటే వీరిలో చిన్న పిల్లలు ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఉప్పల్‌ ప్రాథమిక వైద్య కేంద్రం పరిధిలో ఓపీల దగ్గర క్యూలు సైతం భారీగా పెరిగాయి. రోజుకు 80 నుంచి 100 వరకు ఉండే ఓపీలో  150 వరకు పెరగింది. వైరల్‌ ఫీవర్ల తీవ్రత ఉందని, ఉప్పల్‌ పీహెచ్‌సీ పరిధిలో గత 25 రోజులుగా దాదాపు 30కి పైగా డెంగీ కేసులను నమోదయినట్లు వైద్యాధికారి సౌందర్యలత తెలిపారు. అలాగే రెండు మలేరియా కేసులు నమోదు అయినట్లు చెప్పారు. ‘గత నెల రోజులుగా  డెంగీ కేసుల సంఖ్య పెరుగుతోంది. సాధారణ రోజుల్లో నిత్యం 600లోపు ఓపీ ఉంటోంది. కొద్ది రోజులుగా 1000కి పెరిగింది’ అని నల్లకుంట ఫీవర్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా.శంకర్‌ చెప్పారు.  

గాంధీలో రోగుల రద్దీ.. 
విషజ్వరాల వ్యాప్తితో సికింద్రాబాద్‌ గాం«దీఆస్పత్రికి రోగుల సంఖ్య భారీగా పెరిగింది. అవుట్‌ పేషెంట్‌ విభాగంలో 1500 నుంచి 2000 వరకు, ఇన్‌పేషెంట్‌ విభాగంలో 1800 మందికి వైద్యసేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం గాం«దీలో 160 శాతం ఆక్యుపెన్సీ ఉన్నట్లు ఆస్పత్రి గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఓపీ విభాగంలో కంప్యూటర్‌ చిట్టీలు, వైద్యసేవల కోసం వందలాది మంది రోగులు క్యూలైన్లలో గంటల తరబడి నిరీక్షించే దుస్థితి నెలకొంది. ఇన్‌పేòÙంట్‌ విభాగంలోని పలు వార్డుల్లో  రోగుల సంఖ్య పెరగడంతో ఫ్లోర్‌బెడ్స్‌ (నేలపై పరుపు)వేసి వైద్యసేవలు అందిస్తున్నారు. నెలరోజల నుంచి గాంధీ ఆస్పత్రికి రోగుల రద్ధీ అధికంగా ఉందని, విషజ్వరాలకు గురైన రోగులు ఓపీకి 500, ఐపీలో 250 మంది గతం కంటే అధికంగా వస్తున్నట్లు గుర్తించామని గాంధీ సూపరింటెండెంట్‌ రాజారావు తెలిపారు. 

మరిన్ని వార్తలు