సబ్సిడీ టార్పాలిన్లు అందేనా?

9 Nov, 2021 09:27 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వానాకాలం పంట ఉత్పత్తులు చేతికి వస్తున్న కీలక సమయం ఇది. వరి, పత్తి, మొక్కజొన్న, సోయా సహా అనేక పంటలు కోతలు మొదలవుతున్నాయి. మరోవైపు ఎప్పుడు వర్షం వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. అకాల వర్షాలు కల్లాల్లోని, మార్కెట్‌ యార్డుల్లోని పంట ఉత్పత్తులను నాశనం చేసే పరిస్థితులున్నాయి. గతంలో ఇలా నష్టపోయిన రైతులు లక్షల్లో ఉన్నారు. కానీ వ్యవసాయశాఖ మాత్రం నిర్లక్ష్యానికి మారుపేరుగా మారింది. రైతులకు అవసరమైన సామాగ్రిని సమకూర్చడంలో, టార్పాలిన్లను సబ్సిడీపై అందించడంలో వ్యవసాయశాఖ వైఫల్యం చెందింది. కనీసం సబ్సిడీపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు సైతం పంపకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. దీంతో రైతులు బహిరంగ మార్కెట్లో ఎక్కువ ధరకు కొనుగోలు చేసుకోవాల్సి వస్తోంది.  

గతంలో 50 శాతం సబ్సిడీ... 
వర్షాలు, ప్రకృతి విపత్తుల నుంచి పంటలను రక్షించుకోవడానికి వ్యవసాయశాఖ గతంలో సబ్సిడీపై టార్పాలిన్లు అందించేది. కానీ గత రెండు మూడేళ్లుగా సబ్సిడీపై సరఫరాను పక్కన పెట్టింది. ఫలితంగా ఒక్క టార్పాలిన్‌న్‌కూడా రైతులకు సబ్సిడీతో అందడం లేదు. వ్యవసాయ శాఖకు ప్రభుత్వం నిధులు కేటాయించక పోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వంతో కంపెనీలు ఒప్పందం చేసుకొని గతంలో టార్పాలిన్లు అందించేవి. మండలాల వారీగా వ్యవసాయాధికారులు ఇచ్చే ఇండెంట్‌ను బట్టి సరఫరా జరిగేది. వ్యవసాయశాఖ అధికారులు గ్రామాల్లో విరివిగా ప్రచారం చేసేవారు. రైతులు డీడీ, పాస్‌ బుక్, ఆధార్‌ కార్డు జిరాక్స్‌ కాపీలు అందించి టార్ఫాలిన్లు కొనుగోలు చేసేవారు. మార్కెట్‌లో రూ. 2,500కు లభించే టార్పాలిన్లను 50 శాతం సబ్సిడీతో రూ. 1,250కే అందించేలా ఏర్పాట్లు చేశారు. రవాణా చార్జీలతో కలిపి రూ. 1,300 నుంచి రూ. 1,500 వరకు రైతులకు అందించేవారు. స్థానిక వ్యవసాయ అధికారులు రైతుల వివరాలను కంపెనీలకు ఇస్తారు. ఆ సమాచారం ద్వారా 50 శాతం సబ్సిడీ నిధులు కంపెనీలకు సర్కారు చెల్లించేది. ఆ ప్రకారం 2018 వరకు టార్పాలిన్లను అందించారు. ఆ తర్వాత నుంచి ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో సరఫరా నిలిచిపోయింది. 

రూ. 1,500 కోట్లు కేటాయించినా...
వ్యవసాయ యాంత్రీకరణకు ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో రూ. 1,500 కోట్లు కేటాయించింది. టార్పాలిన్లను కూడా వ్యవ సాయ యాంత్రీకరణలో భాగంగా ఇవ్వాల్సి ఉంది. విచిత్రమేంటంటే కనీసం ఇప్పటివరకు వ్యవసాయ యాంత్రీకరణకు సంబంధించిన మార్గదర్శకాలు ఖరారు చేయలేదు. వానాకాలం సీజన్‌ ముగిసి, యాసంగి మొదలైనా బడ్జెట్లో కేటాయించిన నిధులను వినియోగించుకునే విషయంలో ప్రతిపాదనలే తయారుకాలేదు. దీంతో రైతులు టార్పాలిన్లు, ఇతర వ్యవసాయ పనిముట్ల కోసం ఎదురుచూస్తున్నారు. కనీసం తైవాన్‌ స్ప్రేయర్‌ వంటివి కూడా రైతులకు సబ్సిడీపై ఇచ్చే దిక్కు లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వాస్తవంగా ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణపై దృష్టిసారించింది. అందుకే ఎన్నడూ లేనంతగా బడ్జెట్లో నిధులు కేటాయించింది. 2018 వరకు భారీగా ట్రాక్టర్లు సహా వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీలకు ట్రాక్టర్లు సహా కొన్నింటిపై 95 శాతం, ఇతరులకు 50 శాతం సబ్సిడీతో సరఫరా చేసింది. ఒకేసారి గ్రూపునకు లేదా వ్యక్తిగతంగా కూడా వీటిని ఇచ్చారు. ఉదాహరణకు ఒక్కో ట్రాక్టర్‌ విలువ మార్కెట్లో రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉంటుంది. భారీగా సబ్సిడీ ఉండటంతో గ్రామాల్లో ట్రాక్టర్లను విరివిగా కొనుగోలు చేశారు. దాదాపు 8 వేల వరకు ట్రాక్టర్లను వ్యవసాయశాఖ రైతులకు సబ్సిడీపై అందజేసింది. ఈ నేపథ్యంలో గ్రామాల్లో వ్యవసాయ యాంత్రీకరణ విప్లవం ఏర్పడింది. తెలంగాణ ఏర్పడక ముందు, ఆ తర్వాత రైతులకు యంత్రాల పంపిణీ దాదాపు రెండింతలైంది. దీంతో వ్యవసాయం ఆధునికత సంతరించుకుంది. ఒకవైపు సాగునీటి ప్రాజెక్టులతో కొత్త ఆయకట్టు పెరగడం, మరోవైపు యాంత్రీకరణ జరగడంతో పంటల ఉత్పత్తి, ఉత్పాదకత కూడా గణనీయంగా పెరిగింది. కానీ వానల నుంచి పంటలను రక్షించుకునేందుకు కనీసంగా అవసరమైన టార్పాలిన్లను మాత్రం సరఫరా చేసే దుస్థితి లేకుండా పోయిందన్న విమర్శలు వస్తున్నాయి. 

మరిన్ని వార్తలు