26 జిల్లాలు.. 3.30 లక్షల ఎకరాలు

26 Aug, 2020 05:51 IST|Sakshi

పంట నష్టంపై వ్యవసాయ శాఖ ప్రాథమిక నివేదిక 

33 శాతం కంటే ఎక్కువ దెబ్బతిన్న వరి, పత్తి, కంది, పెసర 

ఇన్‌పుట్‌ సబ్సిడీకి కనీసం రూ.100–130 కోట్లు అవసరమని అంచనా

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా జరిగిన పంట నష్టంపై వ్యవసాయ శాఖ ప్రాథమిక నివేదిక తయారుచేసింది. ఈ మేరకు ప్రభుత్వానికి వివరాలు అందజేసింది. దీని ప్రకారం సుమారు 26 జిల్లాల్లోని 3.30 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఇందులో వరి, పత్తి , పెసర, కంది పంటలకు ఎక్కువ నష్టం వాటిల్లింది. దాదాపు 10 రోజుల పాటు ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాల ఫలితంగా పంట చేలు నీట మునిగాయని, అయితే రైతులు సకాలంలో అప్రమత్తమై ఎప్పటికప్పుడు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవడంతో ఎక్కువ నష్టం వాటిల్లే ప్రమాదం తప్పిందని నివేదికలో తెలిపింది. అయితే, నీటిని తీసేసిన తరువాత పంట దెబ్బతిందా? లేదా? అనే విషయంపై వ్యవసాయ విస్తరణ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అంచనా వేసినట్లు వెల్లడించింది. దీని ప్రకారం 26 జిల్లాలు వరద ప్రభావానికి గురయ్యాయని, సుమారు 3.30 లక్షల ఎకరాల్లో 33 శాతానికి పైగా పంట దెబ్బతిన్నట్లు పేర్కొంది. కొన్నిచోట్ల వరినాట్లు కొట్టుకుపోగా, మరి కొన్ని చోట్ల కోత దశకు వచ్చిన పంటలకు నష్టం జరిగిందని వివరించింది. అత్యధికంగా వరి 1.40 లక్షల ఎకరాల్లో దెబ్బతిందని నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. ఆ తర్వాత పత్తి 1.09 లక్షల ఎకరాలు, పెసర 58 వేలు, కందులు 10 వేలు, వేరుశనగ 6 వేలు, మొక్కజొన్న 5 వేల ఎకరాల్లో దెబ్బతిన్నాయని వెల్లడించింది. 

1.8 లక్షల మంది రైతులకు నష్టం.. 
జిల్లాల వారీ చూస్తే అత్యధికంగా వరంగల్‌ రూరల్‌ జిల్లాలో 99,500 ఎకరాల్లో పంటలు దెబ్బతినగా, జయశంకర్‌ భూపాలపల్లిలో 35,200, మహబూబాబాద్‌లో 28,500, ఖమ్మంలో 24,000, భద్రాద్రి కొత్తగూడెంలో 22,370, నారాయణపేటలో 21,200, కరీంనగర్‌లో 19,000, వరంగల్‌ అర్బన్‌ 17,500, సూర్యాపేటలో 17,000, సంగారెడ్డిలో 11,350, ములుగు 7,650, వికారాబాద్‌ 6,100, కామారెడ్డి 5,600, సిద్దిపేట జిల్లాలో 4,964 ఎకరాల్లో నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ పేర్కొంది. ఈ జిల్లాల్లోని 3,200 గ్రామాల్లో దాదాపు 1.80 లక్షల మంది రైతులు వర్షాల వల్ల నష్టపోయారని వెల్లడించింది. ఈ నష్టాన్ని 14వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వడం ద్వారా వారిపై భారం పడకుండా చూడొచ్చని, అయితే దీనికి కనీసం రూ.100 నుంచి రూ.130 కోట్ల వరకు అవసరమవుతాయని అంచనా వేసింది. 

మరిన్ని వార్తలు