గడపగడపకూ టీకా

21 Aug, 2021 02:18 IST|Sakshi

ఎక్కువ మందికి కరోనా టీకాలు ఇవ్వడంపై వైద్యారోగ్యశాఖ దృష్టి 

పీహెచ్‌సీలు, బస్తీ దవాఖానాలు కేంద్రంగా నిరంతరంగా వ్యాక్సినేషన్‌ 

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్రంలో ఇంటింటికీ వెళ్లి కరోనా టీకాలు వేయాలని వైద్యారోగ్య శాఖ నిర్ణయించింది. ఇప్పటికే మొబైల్‌ వ్యాన్లతో పల్లెలు, బస్తీలకు చేరుకున్న వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని మరింతగా విస్తృతం చేయడంపై దృష్టి పెట్టింది. వ్యాక్సిన్‌ కోసం ఎదురుచూడటం, గంటల తరబడి క్యూలో నిల్చోవడం వంటివేవీ లేకుండా.. ఆయా ప్రాంతాల్లో నిర్దేశించిన రోజున ఇంటివద్దకే వచ్చి టీకాలు వేసేలా ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం రోజుకు సగటున లక్షన్నర వరకు వ్యాక్సిన్లు వేస్తుండగా.. గడపగడపకు వెళ్లే కార్యక్రమంతో ఇంతకు రెట్టింపు వేసేలా ప్రణాళిక రచించినట్టు వైద్యారోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. 

త్వరగా వ్యాక్సినేషన్‌ పూర్తి చేసేలా.. 
రాష్ట్రంలో ఇప్పటివరకు 1.66 కోట్ల డోసుల టీకా వేశారు. ఇందులో 1.24 కోట్ల మందికి మొదటి డోస్‌ వేయగా.. 42.55 లక్షల రెండు డోసులూ పూర్తయ్యాయి. మొదటిడోసు వేసుకున్నవారిలో అత్యధికంగా 18–44 ఏళ్ల మధ్య వయసు వారు 61 లక్షల మంది ఉన్నారు. వీరిలో 8.72 లక్షల మంది రెండు డోసులూ తీసుకున్నారు. అయితే రాష్ట్రంలో అర్హులందరికీ వ్యాక్సిన్‌ వేయాలంటే ఈ ఏడాది చివరివరకు సమయం పడుతుందని గతంలో అంచనా వేశారు. కానీ అంతకన్నా ముందే టీకా వేయాలని తాజాగా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. 

డోసుల లభ్యతను బట్టి.. 
టీకాల లభ్యతను బట్టి ప్రస్తుతం వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఒక్కోసారి అనుకున్నంతగా వ్యాక్సిన్లు రాష్ట్రానికి అందడం లేదు. అలాంటప్పుడు టీకా కార్యక్రమం సజావుగా సాగడం లేదు. గత నెలలో రెండో డోసు వారికి మాత్రమే టీకాలు వేశారు. లభ్యత పెరగడంతో ఈ నెలలో మొదటి డోసు వారికి కూడా ఇస్తున్నారు. కొత్త వ్యాక్సిన్లకు అనుమతి వస్తుండటం, టీకాల ఉత్పత్తి పెరుగుతుండటంతో.. ఇంటింటికీ వెళ్లి టీకాలు వేయాలని నిర్ణయించినట్టు అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం ప్రముఖుల ఇళ్లకు వెళ్లి కరోనా టీకాలు వేస్తున్నారు. అదే తరహాలో సాధారణ ప్రజలకూ టీకాలు ఇంటిముందుకే రానున్నాయి. 

పీహెచ్‌సీ, బస్తీ దవాఖానాలు కేంద్రంగా.. 
రాష్ట్రంలో ప్రతి మండలానికి ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) ఉంది. పెద్ద మండలాల్లో రెండు వరకు ఉన్నాయి. అలాగే హైదరాబాద్‌ నగరంలో బస్తీ దవాఖానాలు ఉన్నాయి. వీటిని కేంద్రంగా చేసుకొని వ్యాక్సినేషన్‌ను ముమ్మరం చేయాలని అధికారులు భావిస్తున్నారు. పీహెచ్‌సీల్లో ప్రతి బుధ, శనివారాల్లో సాధారణ వ్యాక్సినేషన్ల కార్యక్రమం జరుగుతుంటుంది. ఏఎన్‌ఎంలు ఈ రోజుల్లో పిల్లలు, గర్భిణులకు పలురకాల టీకాలు ఇస్తారు. ఇకముందు సాధారణ వ్యాక్సినేషన్‌తోపాటు కరోనా టీకాలు కూడా వేయాలని నిర్ణయించారు.

రియాక్షన్‌ వచ్చే అవకాశం ఉంటుందన్న అంచనాల కారణంగా వ్యాక్సినేషన్‌ మొదలుపెట్టిన కొత్తలో డాక్టర్, అంబులెన్స్‌ తప్పనిసరిగా అందుబాటులో ఉండేలా చూశారు. అయితే వ్యాక్సిన్లతో రియాక్షన్‌ సమస్య దాదాపుగా లేనందున.. ఆ ఏర్పాట్లు అవసరం లేదని వైద్యారోగ్యశాఖ భావిస్తోంది. వ్యాక్సిన్‌ తీసుకున్నవారిలో కొందరికి ఒళ్లు నొప్పులు, జ్వరాలు వస్తుంటాయి. అందువల్ల పారాసిటమాల్‌ మాత్రలు అందజేయాలని నిర్ణయించారు.   

మరిన్ని వార్తలు