ఒమిక్రాన్‌ను ఓడిద్దాం

30 Nov, 2021 04:12 IST|Sakshi

వైద్య ఆరోగ్య శాఖ ముందస్తు సన్నద్ధత 

2.5 లక్షల రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లు రెడీ 

అందుబాటులో 32.22 లక్షల ర్యాపిడ్‌ యాంటిజెన్‌ కిట్లు 

భారీగా ఆర్టీపీసీఆర్‌ కిట్ల కొనుగోలుకు యోచన

సాక్షి, హైదరాబాద్‌: కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వ్యాపిపై ఆందోళనల నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. దేశంలో ఒమిక్రాన్‌ కేసు ఇప్పటివరకు ఒక్కటి కూడా నమోదు కానప్పటికీ అధికారులు ముందు జాగ్రత్తగా అన్ని రకాల ఏర్పాట్లు ముమ్మరం చేశారు. అత్యవసర మందులు, సర్జికల్‌ పరికరాలు తదితరాలను సమకూర్చుకునే పనిలో నిమగ్నమయ్యారు. తెలంగాణ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) అధికారులు ఆగమేఘాల మీద 2.5 లక్షలకు పైగా రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లు, వేల సంఖ్యలో ఫావిపిరావిర్‌ మాత్రలు, యాంపోటెరిసిన్‌ ఇంజెక్షన్లు, పొసాకొనాజోల్‌ గ్యాస్ట్రో రెసిస్టెంట్‌ మాత్రలను సిద్ధం చేశారు.

లక్షల సంఖ్యలో పీపీఈ కిట్లతో పాటు పల్స్‌ ఆక్సీమీటర్లు, శానిటైజర్లు, ఎన్‌–95, సర్జికల్‌ మాస్క్‌లను సిద్ధం చేశారు. కరోనా టెస్ట్‌లు చేసేందుకు 32 లక్షలకు పైగా ర్యాపిడ్‌ యాంటిజెన్‌ కిట్లను అందుబాటులో ఉంచారు. రాష్ట్రంలో ఆర్టీపీసీఆర్‌ పరీక్షల సంఖ్య చాలా తక్కువగా ఉంది. వాటిని మరింత పెంచాలని తాజాగా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ రాష్ట్రాలకు సూచించిన నేపథ్యంలో ఆ కిట్లను భారీగా కొనుగోలు చేయాలని యోచిస్తున్నారు.  

మోనోక్లోనాల్‌ కొనుగోలుపై దృష్టి 
కరోనాబారిన పడినవారు త్వరగా కోలుకోవాలంటే అందుకు మోనోక్లోనాల్‌ యాంటీబాడీస్‌ ఔషధాన్ని ఇప్పుడు అనేక ప్రైవేట్, కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇస్తున్నారు. దాని ధర మార్కెట్లో రూ. 60 వేల వరకు ఉంటుంది. కరోనా సోకిన వారికి నిర్ణీత డోస్‌లు ఇస్తే, వేగంగా కోలుకుంటున్నట్లు ఇటీవల పలు పరిశోధనలు వెల్లడించాయి. అయితే ఈ మందు ప్రైవేట్‌లోనే ఎక్కువగా లభ్యం అవుతోంది. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ వద్ద పెద్దగా అందుబాటులో లేదు.

హైదరాబాద్‌ గాంధీ, నిమ్స్‌ వంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రమే ఇది లభిస్తోంది. వాటిని కేవలం వీఐపీల కోసమే వాడుతుండగా, ప్రస్తుతం ముఖ్యమైన ఈ మందు కొనుగోలుపై దృష్టి సారించాలని భావిస్తున్నారు. అత్యవసరంగా టెండర్లు వేసి తెప్పించాలని యోచిస్తున్నట్లు తెలిసింది. ప్రభుత్వానికి ఈ మేరకు ప్రతిపాదనలు పంపుతామని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.   

మరిన్ని వార్తలు