రిజిస్ట్రేషన్ల శాఖ జాయింట్‌ ఐజీ బదిలీ 

18 Nov, 2020 03:46 IST|Sakshi

టీఎస్‌ టీఎస్‌ ఓఎస్డీగా నియమించిన ప్రభుత్వం?  

‘ధరణి’ని విజయవంతం చేసేందుకే ఆయనకు బాధ్యతలు 

శ్రీనివాసులు బదిలీతో రెవెన్యూలో 

రిజిస్ట్రేషన్ల శాఖ విలీనంపై చర్చ 

సాక్షి, హైదరాబాద్ ‌: రాష్ట్ర రిజిస్ట్రేషన్ల శాఖ కీలక అధికారి, రిజిస్ట్రేషన్‌ చట్టంపై సంపూర్ణ అవగాహన కలిగిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ జాయింట్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ వేముల శ్రీనివాసులును బదిలీ చేసినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ధరణి పోర్టల్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ సేవలను సరళతరం చేయాలన్న ప్రభుత్వ ఆలోచనను విజయవంతం చేయాలనే కోణంలోనే శ్రీనివాసులును తెలంగాణ స్టేట్‌ టెక్నలాజికల్‌ సర్వీసెస్‌ (టీఎస్‌ టీఎస్‌) ఓఎస్డీగా నియమించినట్టు సమాచారం. ధరణి పోర్టల్‌ ద్వారా వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లలో ఎలాంటి సాంకేతిక, శాఖాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్న ఉద్దేశంతోనే సమర్థ అధికారికి ఈ బాధ్యత అప్పగించినట్టు రాష్ట్ర ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 

విలీనమేనా?  
శ్రీనివాసులు బదిలీతో రిజిస్ట్రేషన్ల శాఖలో కలవరం మొదలైంది. రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ శేషాద్రి సమక్షంలో మంగళవారం జరిగిన రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నత స్థాయి సమావేశం అనంతరం ఈ నిర్ణయం వెలుగులోకి రావడంతో చాలాకాలం నుంచి ప్రచారం జరుగుతున్న విధంగా రిజిస్ట్రేషన్ల శాఖను రెవెన్యూలో అంతర్భాగం చేస్తారని, తమను సీసీఎల్‌ఏ పరిధిలోకి తెస్తారనే చర్చ మొదలైంది. అయితే, శ్రీనివాసులు సమర్థత మేరకే ఆయన్ను ఐటీ శాఖకు బదిలీ చేశారా? 110 ఏళ్ల చరిత్ర గల రిజిస్ట్రేషన్ల శాఖను రెవెన్యూలో అంతర్భాగం చేస్తారా? రాబడిపై ప్రభావం లేకుండా రిజిస్ట్రేషన్ల శాఖను యథాతథంగా కొనసాగిస్తారా? అన్నది రాష్ట్ర ప్రభుత్వ అధికారిక ఉత్తర్వులు వెలువడేంతవరకు వేచి చూడాల్సిందే.  

మరిన్ని వార్తలు