తిప్పి పంపడానికి తిప్పలెన్నో!

3 Jun, 2022 07:12 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో అక్రమంగా నివసిస్తూ పోలీసులకు పట్టుబడిన విదేశీయులను వారి దేశాలకు పంపడానికి అవసరమైన ఏర్పాట్లు చేయడానికి డిపోర్టేషన్‌ సెంటర్‌లో ఉంచుతారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ సెంటర్‌ను తాత్కాలిక ప్రాతిపదికన నగర నేర పరిశోధన విభాగంలో (సీసీఎస్‌) ఏర్పాటు చేశారు. సరైన వసతులు, సౌకర్యాలు లేకపోవడంతో ఇక్కడ ఉంటున్న విదేశీయులు ఇబ్బందులు పడుతున్నారు. వీరి వైఖరి పోలీసులకు తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఈ నేపథ్యంలోనే డిపోర్టేషన్‌ సెంటర్‌ను అనువైన ప్రాంతానికి మార్చాలంటూ నగర పోలీసుల దాదాపు ఏడాది క్రితం పంపిన ప్రతిపాదనలపై ప్రభుత్వం స్పందించట్లేదు.  

నగరంలోనే బెడద ఎక్కువ.. 
రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల కంటే నగరంలోనే ‘ఈ విదేశీయుల’ బెడద ఎక్కువగా ఉంటోంది. విద్య, వైద్య, వృత్తి, వ్యాపార, పర్యాటక రంగాల్లో గణనీయమైన అభివృద్ధి నేపథ్యంలో, కల్చర్‌ ఎక్స్‌ఛేంజ్‌ కార్యక్రమంలో భాగంగానూ అనేక మంది విదేశీయులు హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు.  స్టడీ, విజిట్, బిజినెస్, మెడికల్‌ వీసాలపై వచ్చిన వారిలో కొందరు ఇక్కడే అక్రమంగా ఉండిపోతున్నారు. ప్రధానంగా సూడాన్, సోమాలియా, నైజీరియా, యమెన్, కెన్యా, జిబౌటీ తదితర దేశాల నుంచి వస్తున్న వారితోనే ఇబ్బంది ఎక్కువగా ఉంటోంది.  

ఇలా అక్రమంగా నివసిస్తూ పట్టుబడిన విదేశీయులతో పాటు వివిధ నేరాల్లో చిక్కిన వారినీ పోలీసులు అరెస్టు చేయడం, తమ ఆధీనంలోకి తీసుకోవడం చేస్తారు. వీరిపై సంబంధిత కేసులు నమోదు చేసిన తర్వాత దాని తీరును బట్టి తదుపరి చర్యలు తీసుకుంటారు. వీరిని ఆయా దేశాలకు బలవంతంగా తిప్పి పంపడానికి (డిపోర్టేషన్‌) ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు డిపోర్టేషన్‌  సెంటర్‌గా పిలిచే చోట నిర్భంధించి ఉంచుతారు. ఉమ్మ డి రాష్ట్రంలో ఈ సెంటర్‌ విశాఖపట్నంలో ఉండేది. ఆపై తాత్కాలిక ప్రాతిపదికన హైదరాబాద్‌ సీసీఎస్‌ డిపోర్టేషన్‌ సెంటర్‌గా మా రింది. విదేశీయులు పట్టుబడితే వారిని వెంటనే వారి దేశాలకు పంపడం సాధ్యం కాదు.  

భాష అర్థం కాక.. ఆహారం అందించలేక.. 
చిక్కిన వారి వివరాలను ఫారినర్స్‌ రీజనల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీస్‌కు (ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ) పంపి, అక్కడి నుంచి ఆయా దేశాలకు చెందిన ఎంబసీలకు సమాచారం ఇవ్వడం ద్వారా వివరాలు పొంది, వారి సాయంతోనే డిపోర్ట్‌ చేయాలి. అప్పటి వరకు డిపోర్టేషన్‌ సెంటర్‌లోనే ఉంచాలి. డిపోర్టేషన్‌ సెంటర్‌ ఏర్పాటుకు కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి. ఆయా దేశీయుల భాష తర్జుమా చేయడానికి ట్రాన్స్‌లేటర్లు, వారికి అనువైన ఆహారం వండి ఇవ్వడానికి కుక్స్‌ ఉండాలి. సదరు సెంటర్‌ సైతం సువిశాల స్థలం మధ్యలో భవంతులతో నిర్మితం కావాలని మార్గదర్శకాలు చెబుతున్నాయి. 

ఇవేవీ లేకుండా సీసీఎస్‌లోని ఓ సెల్‌ను డిపోర్టేషన్‌ సెంటర్‌గా మార్చారు. దీంతో ఇక్కడి విదేశీయుల భాష అర్థం కాక, వారు అడిగిన ఆహారం అందించలేక, వసతుల లేమి నేపథ్యంలో వాళ్లు చేస్తున్న హంగామా భరించలేక పోలీసులు తలలు పట్టుకోవాల్సి వస్తోంది. వీటిని గమనించిన ఉన్నతాధికారులు డిపోర్టేషన్‌ సెంటర్‌ను అనువైన ప్రాంతానికి మార్చాలంటూ దాదాపు ఏడాది క్రితమే ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపారు. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆ సెంటర్‌ సీసీఎస్‌లోనే కొనసాగుతోంది.   

(చదవండి: 6 నెలల ముందే అభ్యర్థులు)

మరిన్ని వార్తలు