సివిల్‌ ‘సర్వీస్‌’ మాకే!

23 Jan, 2022 04:38 IST|Sakshi

రాష్ట్రాల సమ్మతి లేకుండానే కేంద్రానికి అధికారుల డిప్యుటేషన్‌

అఖిల భారత సర్వీసుల కేడర్‌ రూల్స్‌కు సవరణలను ప్రతిపాదించిన కేంద్రం

సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని పలు రాష్ట్రాల ఆగ్రహం 

త్వరలో అభిప్రాయం తెలపనున్న తెలంగాణ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వాల సమ్మతితో సంబంధం లేకుండానే.. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ అధికారులను నేరుగా డిప్యుటేషన్పై నియమించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. ఈ మేరకు కేంద్రం ‘ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌ (కేడర్‌) రూల్స్‌–1954’కు ప్రతిపాదిస్తున్న సవరణలను పలు రాష్ట్రాలు తప్పుబ డుతున్నాయి. ఈ సవరణలు భారత సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయంటూ పశ్చిమబెంగాల్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌ తదితర రాష్ట్రాలు ఇప్పటికే వ్యతిరేకత వ్యక్తం చేశాయి. అఖిల భారత సర్వీసుల అధికారులను తమ అధీనంలోని తెచ్చుకుని.. రాష్ట్రాల హక్కులను కాలరాసేయడానికే కేంద్రం ఈ సవరణలను చేపట్టిందని మండిపడ్డాయి. దీనిపై ఆరు రాష్ట్రాలు కేంద్రానికి లేఖలు కూడా రాశాయి. 

త్వరలో సీఎం కేసీఆర్‌కూడా..: కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలపై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం వెల్లడించలేదు. సమాఖ్య స్ఫూర్తి, రాష్ట్రాల హక్కుల పరిరక్షణ కోసం సీఎం కేసీఆర్‌ కొంతకాలంగా కేంద్రంతో కొట్లాట వైఖరి అవలంబిస్తున్నారు. ఈ క్రమంలో ఐఏఎస్‌(కేడర్‌) రూల్స్‌ సవరణలను సైతం రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించే అవకాశాలున్నాయి. ఈ మేరకు సీఎం త్వరలో కేంద్రానికి లేఖ రాయనున్నట్టు అధికారవర్గాలు చెప్తున్నాయి. 

నిబంధనలేంటి?.. సవరణలేంటి? 
ఐఏఎస్‌ కేడర్‌ రూల్స్‌లోని నిబంధన 6(1) ప్రకారం.. ఏదైనా రాష్ట్ర కేడర్‌ ఐఏఎస్‌/ఐపీఎస్‌/ఐఎఫ్‌ఎస్‌ అధికారిని సదరు రాష్ట్ర ప్ర భుత్వ సమ్మతితోనే కేంద్ర సర్వీసులకుగానీ, ఇతర రాష్ట్రాలు, ప్రభుత్వ రంగ సంస్థలకు గానీ డిప్యుటేషన్‌పై పంపించాలి. రాష్ట్ర ప్ర భుత్వ సమ్మతి లేకుంటే.. కేంద్ర సర్వీసులకు డిప్యుటేషన్‌పై తీసుకోవడానికి వీలులేదు. 

♦ కేంద్ర ప్రభుత్వం ఇక ముందు రాష్ట్రాల సమ్మతితో సంబంధం లేకుండా నేరుగా అధికారులను డిప్యుటేషన్‌పై నియమించుకోవడానికి వీలుగా 6(1) నిబంధనకు సవరణలు ప్రతిపాదించింది. దీనిపై జనవరి 25లోగా తమ అభిప్రాయాలను తెలపాలని కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ (డీఓపీటీ) గత నెలలోనే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసింది. 

♦ రాష్ట్రాల నుంచి తగినంత మంది అధికారులను డిప్యుటేషన్‌పై కేంద్రానికి పంపడం లేదని, అందువల్ల అధికారుల కొరత తీవ్రంగా ఉందని పేర్కొంది. 
♦ ఈ ప్రతిపాదనల ప్రకారం రాష్ట్రాలు తమ కేడర్‌ స్ట్రెంథ్‌ నుంచి నిర్దేశిత సంఖ్యలో వివిధ స్థాయిలకు చెందిన అధికారులను కేంద్రానికి డిప్యుటేషన్‌పై పంపించేందుకు సిద్ధంగా ఉంచాల్సి వస్తుంది.

అధికారుల్లో ఆందోళన 

ప్రతిపాదిత ఐఏఎస్‌(కేడర్‌) రూల్స్‌ సవరణ పట్ల.. రాష్ట్రంలోని అఖిల భారత సర్వీసుల అధికారులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సవరణలు అమల్లోకి వస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజకీయ విభేదాలు, వివాదాలకు అధికారులు బలికావాల్సి వస్తుందని అభిప్రాయపడుతున్నారు. ఉదాహరణకు.. యాస్‌ తుఫాన్‌పై ప్రధాని మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ సమీక్షకు పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, ఆ రాష్ట్ర సీఎస్‌ అలాపన్‌ బందో పాధ్యాయ్‌ గైర్హాజరయ్యారు. దానితో గతేడాది మార్చిలో సీఎస్‌ బందోపాధ్యాయ్‌ను కేంద్రానికి రీకాల్‌ చేస్తూ డీఓపీటీ ఉత్తర్వులు జారీ చేయడం, ఆ వెంటనే బందోపాధ్యాయ్‌ స్వచ్ఛంద పదవీవిరమణ చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 

♦ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాల సమ్మతితోపాటు అధికారులు తమకోరిక మేరకు కేంద్ర సర్వీసులకు డిప్యుటేషన్‌ వెళ్తున్నారు. ఇకపై ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా.. అధికారులను డిప్యుటేషన్‌పై కేంద్రం పిలిచే అవశాలుంటాయి. ఏదైనా అంశంపై కేంద్ర, రాష్ట్రాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న సమయాల్లో సంబంధిత అధికారులను శిక్షించడానికి/ఇబ్బందిపెట్టడానికి ఈ నిబంధన కేంద్రం చేతిలో ఆయుధంగా మారే అవకాశం ఉం దనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

♦ రాష్ట్రాల్లో కీలక పథకాలు, ప్రాజెక్టులు, బాధ్యతల్లో పనిచేస్తున్న సమర్థులైన అధికారులను కేంద్రం ఏకపక్షంగా తీసుకుంటే.. రాష్ట్రాల్లో సమర్థులైన అధికారుల కొరతఏర్పడుతుందనే అభిప్రాయమూ ఉంది. 

♦ కేంద్రం ప్రతిపాదించిన సవరణలపై రాష్ట్ర ఐఏఎస్‌ అధికారుల సంఘం ప్రతినిధి అభిప్రాయాన్ని కోరగా.. ఇది కేంద్రం వర్సెస్‌ రాష్ట్రమని, ఇందులో తామేమీ చెప్పడానికి లేదని సమాధానమిచ్చారు.  

మరిన్ని వార్తలు