మద్యం ధరలు పెంచొద్దు

23 Jan, 2024 04:48 IST|Sakshi

ఆదాయ మార్గాలను వెతకండి 

ఎలైట్‌ బార్ల కేటాయింపులో ఏకీకృత విధానం అమలు కావాలి 

ప్రీ బడ్జెట్‌ సమావేశాల్లో ఎక్సైజ్‌ శాఖకు డిప్యూటీ సీఎం భట్టి దిశానిర్దేశం

సాక్షి, హైదరాబాద్‌: మద్యం ధరలను పెంచకుండా ఎక్సైజ్‌ శాఖ ఆదాయాన్ని పెంచే మార్గాలను, అందుబాటులో ఉన్న వనరులను గుర్తించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సూచించారు. ప్రీ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా సోమ వారం సచివాలయంలో ఎక్సైజ్, టూరిజం శాఖల అధికారులతో సంబంధిత మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ ప్రొహిబిషన్‌ ఎక్సైజ్‌ శాఖ మద్యం విక్రయాలపైనే కాకుండా కట్టడిపైనా దృష్టి పెట్టి పనిచేయాలని కోరారు.

ఎలైట్‌ బార్‌ల తో పాటు ఎలైట్‌ షాప్‌ల విషయంలో ఏకీకృత విధానాలను అమలు చేయాలని, రాష్ట్రమంతటా ఒకటే నిబంధనలు అమలయ్యేలా మార్గదర్శకాలు రూ పొందించాలని కోరారు. పోలీస్, సమాచార శాఖలతో కలిసి ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసుకుని డ్రగ్స్‌ను కట్టడి చేయాలని ఆదేశించారు. ఇందుకు సరైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని, ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. 

టెంపుల్‌ టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి 
రాష్ట్రంలో పురాతన కట్టడాలు, దేవాలయాలు ఉన్న ప్రదేశాల్లో టెంపుల్, ఎకో టూరిజం అభివృద్ధికి గల అవకాశాలను అన్వేషించాలని, టెంపుల్‌ టూరిజం అభివృద్ధికి దేవాదాయ, పర్యాటక, ఆర్టీసీ శాఖలు సమన్వయంతో పనిచేయాలని భట్టి కోరారు. తగిన మార్కెటింగ్‌ వ్యవస్థ లేని కారణంగా సహజసిద్ధమైన పర్యాటక ప్రదేశాలను వినియోగించుకోలేక పోతున్నామన్నారు.

తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని అంతర్జాతీయ పర్యాటకులకు తెలియజేసేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఎక్సైజ్‌ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ అన్ని టూరిజం ప్రాజెక్టులను ప్రభుత్వమే చేపట్టలేదని, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో ప్రైవేటు కంపెనీల పెట్టుబడులకు అవసరమైన మార్గదర్శకాలను రూపొందించాలని కోరారు.

సమావేశంలో భాగంగా కొత్త కార్యాలయ భవనాల నిర్మాణం, చెక్‌పోస్టుల పటిష్టత కోసం ఎక్సైజ్‌ శాఖ అధికారులు నిధులను కోరగా కొత్త పర్యాటక ప్రాంతాల అభివృద్ధి, స్పిల్‌ఓవర్‌ పనులకు టూరిజం శాఖ నిధులను ప్రతిపాదించింది. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, ఎక్సైజ్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌శర్మ, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్‌ పాల్గొన్నారు.   

>
మరిన్ని వార్తలు