డిప్యూటీ తహసీల్దార్‌ హల్‌చల్‌.. ఐఏఎస్‌ స్మితా సబర్వాల్‌ ఇంట్లోకి చొరబడి

22 Jan, 2023 10:38 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న మహిళా ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌కు చేదు అనుభవం ఎదురైంది. హైదరాబాద్‌లోని స్మితా  ఇంటి వద్ద  మేడ్చల్‌ జిల్లాకు చెందిన ఓ డిప్యూటీ తహసీల్దార్‌ హల్‌చల్‌ చేశారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. మేడ్చల్‌ జిల్లా పౌరఫరాశాఖ కార్యాలయంలో ఆనంద్‌ కుమార్‌ రెడ్డి(45) డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్నాడు.

గురువారం రాత్రి తన స్నేహితుడు దుర్గా విలాస్‌ హోటల్‌ యజమాని బాబుతో కలిసి యూసుఫ్‌గూడ పోలీస్‌ లైన్స్‌లోని ప్లెజెంట్‌ వ్యాలీలో ఆమె ఉంటున్న నివాస సముదాయం వద్దకు వచ్చాడు. తనకు అపాయింట్‌మెంట్‌ ఉందంటూ అక్కడి భద్రతా సిబ్బందిని నమ్మించి ఆనంద్‌రెడ్డిలోనికి ప్రవేశించి స్మీతా సబర్వాల్‌ ఇంటి వద్దకు వెళ్లాడు. అక్కడ భద్రత లేకపోవడంతో ప్రధాన ద్వారం గుండా ఇంట్లోకి వెళ్లాడు. అలికిడికి బయటకు వచ్చిన స్మితా సబర్వాల్‌ గుర్తు తెలియని వ్యక్తి కనిపించడంతో ఆందోళనకు గురై.. బయటకు వెళ్లిపోవాల్సిందిగా కేకలు వేసింది. దాంతో ఆనంద్‌ బయటకు వెళ్లిపోయాడు.

తన అనుమతి లేకుండా గుర్తు తెలియని వ్యక్తిని లోనికి ఎవరు పంపారంటూ సెక్యూరిటీ సిబ్బందిని ప్రశ్నించడంతో అప్రమత్తమైన సిబ్బంది బయటకు వస్తున్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు జూబ్లీ హిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా అక్కడకు చేరుకున్న పోలీసులు నిందితుడు ఆనంద్‌ కుమార్‌తోపాటు అతడి వెంట వచ్చిన బాబును అదుపులోకి తీసుకున్నారు. వారి కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గతంలో స్మితా సబర్వాల్‌ ట్వీట్లను డిప్యూటీ తహసీల్దార్‌ రీట్వీట్‌ చేసినట్లు పోలీసులు గుర్తించారు.

మరోవైపు తనకు ఎదురైన అనుభవాన్ని ఐఏఎస్‌ స్మితా సబర్వాల్‌ ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. గత రాత్రి అత్యంత బాధాకరమైన ఘటన జరిగిందని,  తన ఇంట్లోకి ఓ వ్యక్తి చొరబడినట్లు తెలిపారు. అప్రమత్తతో వ్యవహరించి తన ప్రాణాలు కాపాడుకున్నట్లు తెలిపారు. మీరు ఎంత సురక్షితంగా ఉన్నామని భావించినా.. ఎల్లప్పుడూ వ్యక్తిగతంగా తలుపులు, తాళాలు తనిఖీ చేసుకోవాలంటూ సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్‌ 100కు కాల్‌ చేయాలని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు