CM KCR Delhi Tour: ముగిసిన కేసీఆర్‌ ఢిల్లీ టూర్‌.. వివరాలు ఇవే..

10 Sep, 2021 02:29 IST|Sakshi

హైదరాబాద్‌ చేరుకున్న సీఎం కేసీఆర్‌

తొలుత 3 రోజుల షెడ్యూలే.. 

ఆపై మరో 6 రోజులు పొడిగింపు

ప్రధాని సహా పలువురు మంత్రులతో  భేటీలు

మరోసారి కంటి పరీక్షలు చేయించుకున్న ముఖ్యమంత్రి

సాక్షి, హైదరాబాద్‌: ఢిల్లీ పర్యటన ముగించుకొని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు గురువారం హైదరాబాద్‌ చేరుకున్నారు. ఈ నెల 2న ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ భవన్‌కు శంకుస్థాపన చేసేందుకు వీలుగా మూడు రోజుల ఢిల్లీ పర్యటన కోసం ఈ నెల 1న హస్తిన వెళ్లిన సీఎం కేసీఆర్‌.. షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 3న తన పర్యటన ముగించుకొని తిరిగి రాష్ట్రానికి రావాల్సి ఉంది. అయితే ఆయన మరో 6 రోజులపాటు ఢిల్లీ పర్యటన షెడ్యూల్‌ను పొడిగించుకున్నారు. 
(చదవండి: కుటుంబాన్ని చిదిమేసిన లారీ)

ఈ పర్యటనలో ప్రధాని సహా ఇతర కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశం లేదని సీఎం కార్యాలయ వర్గాలు తొలుత ప్రకటించగా షెడ్యూల్‌ పొడిగింపు అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ నెల 3న ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ఐపీఎస్‌ కేడర్‌పై సమీక్ష, సమీకృత టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటు, హైదరాబాద్‌–నాగపూర్‌ పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధి, కొత్త జిల్లాల్లో నవోదయ విద్యాసంస్థల ఏర్పాటు వంటి అంశాలపై ప్రధానితో భేటీలో చర్చించారు.

ఈ నెల 4న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, 6న కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ, జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెఖావత్‌లతో వేర్వేరుగా సమావేశమై రాష్ట్ర అంశాలపై లేఖలు అందజేశారు. కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన అంశాలకు పరిష్కారం సాధించే దిశగా ప్రయత్నించాలని పార్టీ ఎంపీలను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. 

నిపుణులతో సమావేశాలు.. 
ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్‌ అధికారిక సమావేశాల్లో పాల్గొనడంతోపాటు మిగతా సమయాల్లో వివిధ రంగాల నిపుణులతో పిచ్చాపాటిగా సమావేశమైనట్లు తెలిసింది. దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు, తెలంగాణ అభివృద్ధి, ఇతర అంశాలపై రాజకీయ, ఆర్థిక రంగాల ప్రముఖులతో సీఎం చర్చించినట్లు సమాచారం. అలాగే గతంలో ఢిల్లీలో కంటి శస్త్రచికిత్స చేయించుకున్న కేసీఆర్‌... బుధవారం మరోసారి కంటి పరీక్షలు చేయించుకున్నట్లు తెలియవచ్చింది.
(చదవండి: మిషన్‌ భగీరథ పైపులైన్‌ను ఢీకొట్టిన లారీ)

మరిన్ని వార్తలు