కుంటాల సందర్శకులకు గుడ్‌ న్యూస్‌

4 Mar, 2021 04:49 IST|Sakshi

‘కుంటాల’ వద్ద కుటీరాలు 

స్వదేశీ దర్శన్‌ పథకం కింద  రూ. 3.81 కోట్లు మంజూరు 

 

సాక్షి, ఆదిలాబాద్‌: కుంటాల.. రాష్ట్రంలోనే ఎత్తైన జలపాతం. కుంటాల అందాలను వీక్షించేందుకు వచ్చేవారి అవస్థలను తొలగించడానికి మార్గం సుగమమైంది. పర్యాటకుల వసతి కోసం రిసార్ట్స్, కుటీరాలు నిర్మిస్తున్నారు. ఇందుకుగాను రూ.3.81 కోట్లు మంజూరయ్యాయి. ఈ మేరకు డిటెయిల్డ్‌ ప్రాజెక్టు రిపోర్ట్‌ (డీపీఆర్‌) తయారు చేస్తున్నారు. త్వరలో టెండర్లు పిలిచి పనులు చేపట్టనున్నారు. గిరిజన సర్క్యూట్‌ అమలులో భాగంగా కేంద్ర స్వదేశీ దర్శన్‌ పథకం కింద ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసే పనులు నడుస్తున్నాయి. కేంద్ర టూరిజం మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో స్వదేశీ దర్శన్‌ పథకం కింద పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయిస్తోంది.

ఈ పనులను ఐటీడీఏ అమలు చేస్తుండగా రాష్ట్ర పర్యాటక శాఖ అనుసంధానంగా పనిచేయనుంది. జూలై నుంచి అక్టోబర్‌ వరకు జలపాతం వద్ద పర్యాటకుల తాకిడి అధికంగా ఉంటుంది. మన రాష్ట్రంతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా అనేకమంది పర్యాటకులు ఈ జలపాతం అందాలను వీక్షించేందుకు వస్తుంటారు. అయితే, ఇక్కడ పర్యాటకులకు సరైన వసతి, ఇతర సౌకర్యాలు లేవు. తాజాగా కుంటాలకు దగ్గరలో గిరిజన సంస్కృతి ప్రతిబింబించేలా ఎకో ఎథెనిక్‌ రిసార్ట్‌ నిర్మిస్తున్నారు. ఈ జలపాతం వద్ద అటవీ ప్రాంతం ఉంటుంది. దానికి తగ్గట్టు పర్యాటకులు ఉండేలా పర్యావరణానికి అనువుగా కుటీరాలు నిర్మిస్తున్నారు. అంతేకాకుండా పర్యాటకులు భోజనం చేసేందుకు డైనింగ్‌ ఏరియాను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తంగా కుంటాల జలపాతానికి వచ్చే పర్యాటకులు ఇక్కడ విడిది చేయాలన్న ఉద్దేశంతో అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు.


ఫైల్‌ ఫోటో  

మరిన్ని వార్తలు