మాంసమే నైవేద్యంగా.. 

15 Jan, 2022 01:13 IST|Sakshi
హనుమంతుడికి కోడిని సమర్పిస్తున్న భక్తుడు 

చింతలకుంట ఆంజనేయస్వామి ఉత్సవాల్లో ప్రత్యేక ఆచారం  

కోళ్లు, పొట్టేళ్లు బలి ఇచ్చి మొక్కులు తీర్చుకుంటున్న భక్తులు 

పెబ్బేరు రూరల్‌: అన్ని హనుమంతుడి ఆలయాల్లో సిందూరం, తమలపాకులు, టెంకాయలతో ప్రత్యేక పూజలు చేయడం చూస్తుంటాం. కానీ, చింతలకుంట ఆంజనేయస్వామికి మాత్రం మాంసం, మద్యాన్ని నైవేద్యంగా ఉంచి భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం నుంచి 8 కి.మీ. దూరంలో పాతపల్లి శివారులో చింతలకుంట ఆంజనేయస్వామి కొలువుదీరాడు.

ఇక్కడ ఏటా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మూడు రోజులపాటు ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు. తాము కోరుకున్న కోరికలు తీరిన భక్తులు కోళ్లు, పొట్టేళ్లను స్వామి వారికి బలిస్తారు. దీంతోపాటు కొత్తగా కొనుగోలు చేసిన వాహనాలకు స్వామివారి సన్నిధిలో పొట్టేళ్లను బలిచ్చి పూజలు చేస్తారు. శుక్రవారం పలువురు భక్తులు కోళ్లను బలి ఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. 

చరిత్ర..: ఈ ఆలయం చుట్టుపక్కల చింతచెట్లు ఎక్కువగా ఉండడంతో అప్పట్లో రాక్షసులు ఎక్కువగా సంచరించేవారట. మనుషులు, పశుపక్షాదులను చంపుతుండటంతో ప్రజలు రక్షించాలని హనుమంతుడిని వేడుకోవడంతో ఆయనే ఇక్కడ కొలువై రాక్షసకాండకు ముగింపు పలికాడని చెబుతారు.

ఈక్రమంలోనే రాక్షసులంతా హనుమంతుడిని వేడుకోవడంతో.. భక్తులు వారి ఇష్టపూర్తితో తనకు జంతువులను బలి ఇస్తారని, వాటితో కడుపు నింపుకోవాలని, మనుషుల జోలికి వెళ్లవద్దని చెప్పినట్లు ఓ కథ ప్రచారంలో ఉంది. అయితే శ్రీరంగాపూర్‌ మొదటి పరిపాలన రాజు వాసుదేవరావు సైతం తాను అనుకున్నది నెరవేరడంతో గుడిని నిర్మించారు. గుడి సమీపంలో చింతల చెరువు ఉండటంతో చింతలకుంట ఆంజనేయస్వామి అని పేరొచ్చిందని చెబుతారు.

మరిన్ని వార్తలు