యాదాద్రిలో లడ్డూ ప్రసాదం కోసం తోపులాట..

29 Aug, 2022 01:50 IST|Sakshi
ప్రసాదం కోసం తోసుకొస్తున్న భక్తులను ఆపుతున్న సిబ్బంది

భారీగా ట్రాఫిక్‌ జామ్‌తో భక్తుల ఇబ్బందులు

యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తులకు లడ్డూ ప్రసాదం సరిగ్గా అందక ఇబ్బందులు పడ్డారు. ఆదివారం సెలవురోజు కావడంతో భక్తులు పెద్దసంఖ్యలో స్వామిని దర్శించుకునేందుకు వచ్చారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో ప్రసాద కౌంటర్ల వద్ద లడ్డూలు అయిపోవడంతో భక్తులు ఒక్కసారిగా ప్రసాద విక్రయశాలలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు.

సిబ్బంది తలుపులు మూసేయడంతో అధికారుల తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండపైన లడ్డూ తయారీ మెషీన్‌లో సాంకేతిక లోపం ఏర్పడటంతో పాతగుట్టలో లడ్డూ తయారు చేయిస్తున్నామని.. అక్కడి నుంచి మూడవ ఘాట్‌ రోడ్డు మీదుగా లడ్డూ ప్రసాదం తీసుకురావడానికి సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. భక్తులు అధికంగా రావడం, భారీగా ట్రాఫిక్‌ జామ్‌ కావడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు చెప్పారు.

కాగా, యాదాద్రి కొండపై, ఘాట్‌ రోడ్డులో  భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడటంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. చాల మంది కాలినడకన   కొండపైకి చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. పెద్ద సంఖ్యలో వచ్చిన వాహనాలను సరిగా పార్కింగ్‌ చేయకపోవడంతో ఇబ్బందులు ఏర్పడ్డాయి.

యాదాద్రికి పోటెత్తిన భక్తులు: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆదివారం భక్తులతో పోటెత్తింది. 40వేల మందికిపైగా భక్తులు స్వామిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. స్వామి దర్మదర్శనా నికి 4గంటల సమయం పట్టగా, వీఐపీ దర్శనానికి 2గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు.

మరిన్ని వార్తలు