అవసాన దశలో మావోయిస్టు ఉద్యమం

9 Oct, 2022 02:30 IST|Sakshi
శనివారం మీడియాతో మాట్లాడుతున్న డీజీపీ మహేందర్‌ రెడ్డి.  చిత్రంలో ఉషారాణి 

లొంగిపోయినవారికి ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తాం: డీజీపీ మహేందర్‌రెడ్డి

నాయకత్వ లేమితో అత్యంత బలహీనంగా మావోయిస్టు పార్టీ

అనారోగ్య సమస్యలతో అగ్ర నాయకులంతా చివరిదశలో ఉన్నారని వ్యాఖ్య

డీజీపీ ఎదుట లొంగిపోయిన దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ సభ్యురాలు ఆలూరి ఉషారాణి

సాక్షి, హైదరాబాద్‌: మావోయిస్టు ఉద్యమం నాయకత్వ లేమితో బలహీనమై అవసాన దశలో ఉందని, ఏ క్షణంలోనైనా కుప్పకూలిపోవచ్చని డీజీపీ మహేందర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. లొంగిపోయి జనజీవన స్రవంతిలోకి రావాలని, ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తామని తెలిపారు. దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ సభ్యురాలు ఆలూరి ఉషారాణి శనివారం డీజీపీ ఎదుట లొంగిపోయారు.

ఈ సందర్భంగా డీజీపీ మహేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఆలూరి ఉషారాణి అలియాస్‌ విజయక్క అలియాస్‌ పోచక్క అలియాస్‌ భాను దీదీగా మావోయిస్టు ఉద్యమంలో పనిచేశారని.. అనారోగ్య సమస్యలు, ఇతర కారణాలతో మావోయిస్టు ఉద్యమం నుంచి తప్పుకొని లొంగిపోయారని ప్రకటించారు. ‘‘ఉషారాణి కుటుంబ నేపథ్యమంతా మావోయిస్టు ఉద్యమంతో ముడిపడి ఉంది.

తండ్రి ఆలూరి భుజంగరావు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ విరసంలో సభ్యుడిగా కొనసాగారు. తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి పీపుల్స్‌వార్‌లో చేరారు. ఉషారాణి గుడివాడ ఏఎన్‌ఆర్‌ డిగ్రీ కాలేజీలో చదువుతున్నప్పుడే ఆర్‌ఎస్‌యూలో చేరి, 1987లో విద్యార్థి సంఘ నేతగా ఎన్నికయ్యారు. 1991లో పీపుల్స్‌వార్‌లో చేరి మునుగోడు దళ కమాండర్‌గా పనిచేశారు.

1998 యాదగిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌పై దాడిచేసి ఒకరిని చంపి, ఆయుధాలు తీసుకెళ్తున్న సమయంలో ఆమె భర్త ఎదురుకాల్పుల్లో చనిపోయారు. ఉషారాణి 2002 నుంచి ఇప్పటివరకు దండకారణ్య జోనల్‌ కమిటీలో పనిచేశారు. ఆరోగ్యం సహకరించకపోవడంతో 2019లో సరెండర్‌ అవుతానని పార్టీని కోరారు. రెండున్నరేళ్ల తర్వాత ఇప్పుడు లొంగిపోయారు’’ అని డీజీపీ వివరించారు.

మావోయిస్టు పార్టీకి నాయకత్వలోపం
మావోయిస్టు ఉద్యమాన్ని నడిపిస్తున్న సీనియర్లు అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారని డీజీపీ మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. జంపన్న, సుధాకర్‌ సరెండర్‌ అయిన తర్వాత మావోయిస్టు పార్టీకి సరైన నాయకత్వం లేదన్నారు. మావోయిస్టు పార్టీకి అగ్ర నాయకత్వం లేక బలహీనపడిందని ఉషారాణి ద్వారా తెలుసుకున్నట్టు వివరించారు. ప్రస్తుతం పార్టీలోకి కొత్తగా వస్తున్న వారికి ఐడియాలజీ లేదని.. నాయకత్వ లోపం వల్ల మావోయిస్టు పార్టీ దానికదే కూలిపోతుందని వ్యాఖ్యానించారు.

సెంట్రల్‌ కమిటీలో కీలకమైన 11 మంది తెలుగు రాష్ట్రాలకు చెందినవారేనని.. వారి ఆరోగ్య పరిస్థితి బాగోలేదని చెప్పారు. సెంట్రల్‌ కమిటీ మెంబర్‌ ముప్పాళ్ల లక్ష్మణరావు నడవలేకపోతున్నారని, కనీసం మాట్లాడే పరిస్థితిలో కూడా లేరని.. ఆనంద్‌ కూడా అనారోగ్యంతో ఉన్నారని పేర్కొన్నారు. మావోయిస్టులు లొంగిపోతే మంచి వైద్యసేవలు అందిస్తామని, సాధారణ జీవితం గడపవచ్చని చెప్పారు. దండకారణ్యంలో మావోయిస్టు పార్టీని నిర్మూలించడానికి పోలీసు విభాగం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని చెప్పారు. 

మరిన్ని వార్తలు