మరియమ్మ కుమారుడికి డీజీపీ మహేందర్‌రెడ్డి పరామర్శ

27 Jun, 2021 12:12 IST|Sakshi

సాక్షి, నల్గొండ/ఖమ్మం: దొంగతనం కేసులో అరెస్టయిన దళిత మహిళ మరియమ్మ లాకప్‌లో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆమె కుమారుడు ఖమ్మం జిల్లాలోని సంకల్ప ఆ‍స్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆమె కుమారుడు ఉదయ్ కిరణ్‌ను తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదివారం పరామర్శించారు. లాకప్‌డెత్‌ ఘటనపై కుటుంబసభ్యుల నుంచి డీజీపీ పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అసలు అడ్డగూడురులో ఏం జరిగిందని, ఎవరు మరియమ్మ, ఉదయ్‌ కిరణ్‌ను కొట్టారని అడిగి తెలుసుకున్నారు. 


విచారణ సమయంలో వారిని ఎంతమంది కొట్టారని స్వయంగా అడిగి తెలుసుకున్నారు.డీజీపీ ముందు ఉదయ్‌ కిరణ్‌ కన్నీరు మున్నీరుగా విలపించారు. పోలీసులు తమను అత్యంత క్రూరంగా కొట్టారని డీజీపీకి తెలిపాడు. తమకు న్యాయం చేయాలని ఉదయ్ కిరణ్ డీజీపీని వేడుకున్నాడు. ప్రభుత్వం అండగా ఉంటుందని డీజీపీ భరోసా ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన పోలీసులను సస్పెండ్ చేశామని చెప్పారు. అనంతరం డీజీపీ మహేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మరియమ్మ ఘటన బాధాకరమని, ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపడతామని డీజీపీ తెలిపారు. మరియమ్మ కుటుంబం నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నామని, విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలియ జేస్తామన్నారు.  రూల్స్ విరుద్ధంగా ఎవరు తప్పు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

చదవండి: మరియమ్మ, ఆమె కుమారుడిపై పోలీసుల థర్డ్‌ డిగ్రీ?

మరిన్ని వార్తలు