తెలంగాణలో కరోనా పరీక్షలు పెంచుతున్నాం: డీహెచ్‌

1 Jun, 2021 13:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా పరీక్షలు పెంచుతున్నామని డీహెచ్‌ శ్రీనివాస్‌ హైకోర్టుకు తెలిపారు. గతనెల 29న లక్ష కరోనా పరీక్షలు జరిగాయని, రెండోదశ ఫీవర్‌ సర్వేలో 68.56 శాతం మందికి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. తెంగాణలో కరోనా కట్టడి చర్యలపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. కోవిడ్‌ చర్యలపై తెలంగాణ ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేయగా డీహెచ్‌, డీజీపీ, కార్మిక జైళ్లశాఖ అధికారులు, జీహెచ్‌ఎంసీ అధికారులు వేర్వేరుగా నివేదికలు సమర్పించారు. ఈ సందర్భంగా డీహెచ్‌ తన వాదనలు వినిపిస్తూ.. ప్రైవేట్‌ ఆస్పత్రులపై ఫిర్యాదుల పరిశీలనకు ముగ్గురు ఐఏఎస్‌లతో టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. 

79 ఆస్పత్రులకు 115 షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.ఇప్పటి వరకు 10 ఆస్పత్రుల కరోనా చికిత్స లైసెన్స్‌ రద్దు చేసినట్లు, బ్లాక్‌ ఫంగస్‌ మందులకు దేశవ్యాప్తంగా కొరత ఉందన్నారు. బ్లాక్‌ ఫంగస్‌ ఔషధాలు కొనుగోలు చేస్తున్నామని, రాష్ట్రంలో ఇప్పటి వరకు 744 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సకు 1500 బెడ్లు అందుబాటులో ఉన్నాయని, కరోనా చికిత్సలకు తగినన్ని ఆస్పత్రులు, పడకలు ఉన్నాయన్నారు

ఔషధాల బ్లాక్‌ మార్కెట్‌పై 150 కేసులు నమోదు చేసినట్లు తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి హైకోర్టుకు తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి మే 30 వరకు 7.49 లక్షల కేసులు నమోదుచేసినట్లు తెలిపారు. ఈ మేరకు డీజీపీ హైకోర్టుకు నివేదిక సమర్పించారు. మాస్కులు ధరించని వారిపై 4.18 లక్షల కేసులు పెట్టి.. రూ.35.81 కోట్ల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. భౌతిక దూరం పాటించనందుకు  41,872 కేసులు నమోదు చేసినట్లు, జనం గుమిగుడినందుకు 13,867 కేసులు పెట్టినట్లు తెలిపారు. లాక్ డౌన్, కర్ఫ్యూ నిబంధనల ఉల్లంఘనలపై 2.61 లక్షల కేసులు, లాక్‌డౌన్‌ను నిబంధనల మేరకు కఠినంగా అమలు చేస్తున్నామని హైకోర్టుకు వెల్లడించారు.

చదవండి:
పిల్లలకు థర్డ్‌వేవ్‌ అలర్ట్‌.. ముప్పును ఎదుర్కొనేందుకు ఏర్పాట్లు!
మద్యం ప్రియులు.. మే నెలలో ఎంత తాగారో తెలుసా!

మరిన్ని వార్తలు