ఆసిఫాబాద్‌ జిల్లా: ముగిసిన డీజీపీ టూర్‌..

6 Sep, 2020 16:57 IST|Sakshi

క్షేత్ర స్థాయి ఆకస్మిక తనిఖీలు, సమీక్షలతో డీజీపీ హల్ చల్

సాక్షి, ఆసిఫాబాద్: జిల్లాలో డీజీపీ మహేందర్‌రెడ్డి పర్యటన ఆదివారం ముగిసింది. ఐదు రోజుల పాటు డీజీపీ పర్యటన కొనసాగింది. నిన్నంతా ఎస్పీ క్యాంపు కార్యాలయంలోనే సమీక్షలు జరిపారు. జిల్లా కలెక్టర్ సందీప్ ఝా, ఇంచార్జీ ఎస్పీ సత్యనారాయణ, ఓఎస్డీ ఉదయ్ కుమార్ రెడ్డి, ఎఎస్పీ సుధీంద్రలతో పాటు ఇతర అధికారులతో విడివిడిగా సమావేశమయ్యారు. ఛత్తీస్‌గడ్‌, మహారాష్ట్రల నుంచి తెలంగాణ లోకి మావోయిస్టుల కట్టడి విషయంలో పోలీసులకు డీజీపీ కఠిన ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని దిశా నిర్దేశం చేశారు. ఎస్‌ఐ మొదలుకొని జిల్లా ఎస్పీ వరకూ అందరి పనితీరును దగ్గరుండి క్షుణ్ణంగా ఫీల్డ్ లెవల్‌లో ఆయన పరిశీలించారు. ఓ డీజీపీ స్థాయి అధికారి మావోయిస్టు ప్రాబల్య మారుమూల ప్రాంతాల్లో రోజుల తరబడి ఉండటం అరుదు. డీజీపీ మకాంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పోలీసు యంత్రాంగం అలర్ట్ అయింది. ప్రాణహిత నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రత్యేక బలగాల విస్తృత కూంబింగ్, అనుమానిత ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. (చదవండి: సీరియస్‌గా ఉన్న డీజీపీ, వారే టార్గెట్)

ఈ నెల 2న హెలికాప్టర్ లో ఆసిఫాబాద్ కు వచ్చిన డీజీపీ, అదే రోజు ఏజెన్సీలో ఏరియల్ సర్వే నిర్వహించారు. తన పర్యటనలో భాగంగా మావోయిస్టు ప్రాబల్య అటవీ ప్రాంతంలో ఉండే తిర్యాని మండల పోలీసు స్టేషన్‌ను డీజీపీ రాత్రి పూట ఆకస్మిక తనిఖీ చేశారు. మిగతా రోజుల్లో ఆసిఫాబాద్ కేంద్రంగానే ఉంటూ మావోయిస్టు సెర్చ్ ఆపరేషన్ల పర్యవేక్షణ, సమీక్షలు నిర్వహించారు.

ఆరు నెలలుగా ఆసిఫాబాద్ ఏజెన్సీని టార్గెట్ చేసుకొని కేబీఎం (కొమరం భీం మంచిర్యాల) ఏరియా కార్యదర్శి మైలారపు అడెళ్లు అలియాస్ భాస్కర్ దళం సంచరించడం తెలిసిందే. డివిజన్, ఏరియా కమిటీల పునర్నిర్మాణం, ఆదివాసీ యువకులే లక్ష్యంగా రిక్రూట్ మెంట్ జరుగుతుందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్. జూలై 13, 18 తేదీల్లో తిర్యాని మండలం మంగి, తొక్కిగూడ అడవుల్లో ఎదురు కాల్పులు జరగగా, తృటిలో మావోయిస్టు అడెళ్లు దళం తప్పించుకుంది. మావోయిస్టుల కార్యకలాపాలను సీరియస్‌గా తీసుకున్న పోలీసు బాస్.. ఈ క్రమంలోనే రోజుల తరబడి పర్యటన చేసినట్లు తెలిసింది. క్షేత్ర స్థాయిలోనే ఉంటూ పోలీసులను అప్రమత్తంగా ఉంచడమే లక్ష్యంగా పర్యటన సాగింది. (చదవండి: మావోయిస్టు సుదర్శన్‌ లొంగిపోతారా..?)


 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా