5 లక్షలు దాటిన ధరణి  లావాదేవీలు

15 Jun, 2021 08:41 IST|Sakshi

వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ లావాదేవీల్లో కీలక మైలురాయి

సాక్షి, హైదరాబాద్‌: వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ లావాదేవీల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన ధరణి పోర్టల్‌లో లావాదేవీలు 5 లక్షల మార్కు దాటాయి. గతేడాది నవంబర్‌ 2 నుంచి ధరణి కార్యకలాపాలు ప్రారంభమవగా సోమవారం వరకు 5.20 లక్షల దరఖాస్తులు వివిధ లావాదేవీల రూపంలో పరిష్కారమయ్యాయని ప్రభుత్వ వర్గాలు వివరించాయి. ఇందులో కేవలం రిజిస్ట్రేషన్‌ లావాదేవీల సంఖ్య 3.73 లక్షలు దాటగా మ్యుటేషన్లు లక్షకు మించి జరిగాయి. వారసత్వ పంపిణీ, భాగ పంపకాలు లాంటివి కలిపి మొత్తంగా ఇప్పటివరకు 5.20 లక్షల లావాదేవీలు పూర్తికావడం గమనార్హం. ఇక వ్యవసాయ భూములను వ్యవసాయేతర అవసరాలకు మార్చేందుకుగాను ‘నాలా’దరఖాస్తులు 16 వేలకుపైగా రాగా అందులో 14,778 దరఖాస్తులు పరిష్కారమయ్యాయి. 

ఈ దరఖాస్తులను కూడా కలిపితే ఇప్పటివరకు ధరణి ద్వారా పరిష్కారానికి వచ్చిన మొత్తం 5.59 లక్షల దరఖాస్తుల్లో 5.34 లక్షలకుపైగా లావాదేవీలు పూర్తికావడం విశేషం. ఒక్కో రిజిస్ట్రేషన్‌ లావాదేవీకి సగటున 45 నిమిషాలు పడుతోందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. అలాగే వారసత్వ పంపిణీకి 27 నిమిషాలు, భాగ పంపకాల లావాదేవీకి 28,  మ్యుటేషన్‌కు 27, నాలా దరఖాస్తుకు 27 నిమిషాలు పట్టిందని పేర్కొన్నాయి. గరిష్టంగా ఒక మ్యుటేషన్‌ లావాదేవీ పూర్తికి సుమారు 10 గంటలు పట్టిందని గణాంకాలు  వెల్లడిస్తున్నాయి. అయితే ఈ పోర్టల్‌ ద్వారా చాలా రకాల లావాదేవీలకు పూర్తిస్థాయిలో ఆప్షన్లు రాలేదని, వాటినీ అందుబాటులోకి తెస్తే ప్రజలు తహశీల్‌ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

మరిన్ని వార్తలు