మళ్లీ సొంతగూటికి డీఎస్‌ 

27 Mar, 2023 01:21 IST|Sakshi
డీఎస్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న మాణిక్‌రావ్‌ ఠాక్రే . చిత్రంలో ఉత్తమ్, సంజయ్, వీహెచ్, రేవంత్, పొన్నాల, జానా, కోమటిరెడ్డి, షబ్బీర్‌ అలీ

ఠాక్రే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన ధర్మపురి శ్రీనివాస్‌

కాంగ్రెస్‌ను వీడి తప్పు చేశా: డీఎస్‌ 

డీఎస్‌ది లక్కీహ్యాండ్‌: రేవంత్‌ రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్‌ (డీఎస్‌) సొంత గూటికి చేరుకున్నారు. తన కుమారుడు సంజయ్‌తో కలిసి ఆదివారం ఉదయం గాంధీభవన్‌కు వచ్చిన డీఎస్‌ కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పుకున్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే సమక్షంలో మాజీ ఎంపీ వి.హనుమంతరావు, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ మాజీ నేత కె.జానారెడ్డిలు ఆయనకు పార్టీ కండువాలు కప్పారు.

ఆయనతో పాటు నిజామాబాద్‌ మాజీ మేయర్‌ ధర్మపురి సంజయ్, మేడ్చల్‌ సత్యనారాయణలు కూడా పార్టీలో చేరారు. కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్‌ ముఖ్య నేతలు పొన్నాల లక్ష్మయ్య, రేణుకా చౌదరి, అంజన్‌కుమార్‌ యాదవ్, షబ్బీర్‌అలీ తదితరులు పాల్గొన్నారు.  

సంతోషంగా ఉంది: డీఎస్‌ 
తిరిగి కాంగ్రెస్‌ పార్టీలోకి రావడంపై మాజీ ఎంపీ డీఎస్‌ మీడియాతో మాట్లాడుతూ తనకు చాలా సంతోషంగా, ఆనందంగా ఉందన్నారు. తాను కాంగ్రెస్‌ను వీడి తప్పు చేశానని, భవిష్యత్తులో అలాంటి తప్పు చేయనని, తాను చనిపోయినపుడు తన మృతదేహంపై కాంగ్రెస్‌ పార్టీ జెండానే ఉంచాలని సోనియాగాంధీని కలిసినప్పుడు చెప్పానని వెల్లడించారు. భవిష్యత్తులో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందా అన్న ప్రశ్నకు స్పందిస్తూ పార్టీ అధికారంలోకి వచ్చేది రానిది ప్రజల నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు. రాహుల్‌గాంధీకి అండగా నిలబడతామని చెప్పారు.  

డీఎస్‌ సారథ్యంలోనే అధికారంలోకి వచ్చాం: రేవంత్‌
డీఎస్‌ పార్టీలో చేరిన అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మీడియాతో ఇష్టాగోష్టి మాట్లాడుతూ డీఎస్‌ది లక్కీ హ్యాండ్‌ అని వ్యాఖ్యానించారు. ఆయన పార్టీలో చేరడానికి ప్రాధాన్యత ఉందని, డీఎస్‌ ఎప్పుడు క్రియాశీలంగా ఉన్నా పార్టీ అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. 2004, 2009 ఎన్నికల్లో ఆయన సారథ్యంలోనే పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు.

ఇప్పుడు రాహుల్‌గాంధీకి అండగా నిలిచేందుకు డీఎస్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వచ్చారన్నారు. కాగా, సొంతగూటికి చేరుకున్న డీఎస్‌ను రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు ఆప్యాయంగా అక్కున చేర్చుకున్నారు. నల్లగొండ ఎంపీ ఉత్తమ్, జానారెడ్డిలు డీఎస్‌ను ఆలింగనం చేసుకుని ఆత్మీయంగా పలకరించారు. డీఎస్‌ గాంధీభవన్‌లో ఉన్నంతసేపూ ఆయన పార్టీ అభివృద్ధికి చేసిన కృషి గురించి  నేతలకు వివరించారు. డీఎస్‌ ఆరోగ్యం గురించి పలువురు నేతలు వాకబు చేశారు.   

>
మరిన్ని వార్తలు