25న డబుల్‌ ఇళ్ల కోసం ధర్నా

24 Jul, 2023 03:59 IST|Sakshi

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి  

ప్రజా సమస్యలపై వరుస ఆందోళనలు

కాచిగూడ/సాక్షి, హైదరాబాద్‌: పేదలకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు నిర్మించి ఇవ్వకుండా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం బర్కత్‌పురాలోని బీజేపీ నగర కార్యాలయంలో పార్టీ హైదరాబాద్‌ సెంట్రల్‌ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ ఎన్‌.గౌతంరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నిరంకుశ కేసీఆర్‌ను గద్దె దించడం, అర్హులైన పేదలందరికీ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు సాధించడం కోసం ఈ నెల 25వ తేదీన హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ వద్ద దీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

పేదలకు తక్షణమే డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు పంపిణీ చేయనిపక్షంలో బీజేపీ పెద్దఎత్తున ఆందోళన చేస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ నేతలు మర్రి శశిధర్‌రెడ్డి, గోలి మధుసూదన్‌రెడ్డి, శ్యామ్‌సుందర్‌ గౌడ్, నాగూరావు నామాజీ, కేశబోయిన శ్రీధర్, కార్పొరేటర్లు అమృత, కన్నె ఉమారమేశ్‌ యాదవ్, దీపిక తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా డబుల్‌ ఇళ్ల అంశంపైనే కిషన్‌రెడ్డి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పార్టీ కోర్‌ కమిటీ సభ్యులతో కూడా సమావేశమయ్యారు.

ఈనెల 25న ఇందిరాపార్కు వద్ద జరిగే ధర్నాకు ఒక్కో జిల్లానుంచి ఐదువేల మందికి తగ్గకుండా జనాన్ని తరలించాలని నిర్ణయించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని లబి్ధదారులకు రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో నిర్మించిన ఇళ్లను ఇవ్వాలనుకోడం సరికాదని, ముందుగా అక్కడి స్థానికులకే ఇళ్లు కేటాయించాలని, తర్వాతే ఇతర ప్రాంతవాసులకు ఇవ్వాలనే డిమాండ్‌ను తెరపైకి తీసుకురావాలని నిర్ణయించారు. ఇళ్ల సమస్యపై ఆందోళన తర్వాత రేషన్‌కార్డులు, పింఛన్ల మంజూరు వంటి అంశాలపై కూడా వరుస ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.   

మరిన్ని వార్తలు