పెరిగిన డీజిల్‌ ధరలతో గ్రేటర్‌ ఆర్టీసీ కుదేల్‌

10 May, 2022 18:37 IST|Sakshi

రోజుకు రూ.1.62 కోట్ల చమురు భారం

చుక్క చుక్కనూ లెక్కిస్తేనే లాభాల బాట

అర కి.మీ. కేఎంపీఎల్‌ పెరిగినా భారీ ఆదా

నష్టాల్లో నడుస్తున్న సంస్థకు గొప్ప ఊరట 

సాక్షి, హైదరాబాద్‌: పీకల్లోతు నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న గ్రేటర్‌ ఆర్టీసీపై పెరిగిన ఇంధన ధరలు మరింత భారంగా మారాయి. ప్రతి రోజు కోట్లాది రూపాయలు ఇంధనం కోసం  వెచ్చిస్తున్నారు. దీంతో  ప్రయాణికుల నుంచి టికెట్లపై  వచ్చే ఆదాయం కంటే ఖర్చులే  అధికంగా ఉన్నాయి. విడిభాగాలు, ఇతర నిర్వహణ వ్యయం కంటే డీజిల్‌ కొనుగోలు కోసమే పెద్ద మొత్తంలో ఖర్చవుతున్నట్లు అంచనా. 

గ్రేటర్‌ హైదరాబాద్‌లో సుమారు 2,550కిపైగా సిటీ బస్సులు ప్రతి రోజు 7.20 లక్షల కిలోమీటర్లు తిరుగుతున్నాయి. ఇందుకోసం  రోజుకు 1.55 లక్షల లీటర్ల డీజిల్‌ వినియోగమవుతోంది. ఏటా నష్టాలతో కుదేలైన సంస్థలో కోవిడ్‌  అనంతరం ఇటీవల కాలంలో క్రమంగా  ప్రయాణికుల ఆదరణ పెరుగుతోంది. సిటీ బస్సుల్లో ఆక్యుపెన్సీ సైతం 60 శాతానికిపైగా నమోదవుతున్నట్లు అంచనా. కానీ బస్సుల నిర్వహణ భారంగా మారడంతో అధికారులు ఇటీవల పెద్ద ఎత్తున దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. ఒకవైపు  ప్రయాణికుల ఆదరణ పెంచుకొనేందుకు చర్యలు చేపడుతూనే  తక్కువ వనరులతో ఎక్కువ ఫలితాలను సాధించేందుకు సిబ్బందికి  అవగాహన కల్పిస్తున్నారు.  


పొదుపుగా వాడితేనే..  

► ప్రస్తుతం నగరంలో రోజుకు రూ.2.5 కోట్ల వరకు ఆదాయం లభిస్తుండగా ఇంధనం, విడిభాగాలు, జీతభత్యాలు, బస్సుల నిర్వహణ తదితర అవసరాల కోసం  రూ.3.5 కోట్లకుపైగా ఖర్చు చేయాల్సివస్తోంది. దీంతో రోజుకు రూ.కోటికిపైగా నష్టంతో సిటీ బస్సులు నడుస్తున్నాయి.  

► ఈ  క్రమంలో వనరుల వినియోగంపై అధికారులు దృష్టి సారించారు. ముఖ్యంగా పెరిగిన ఇంధన ధరలను దృష్టిలో ఉంచుకొని డీజిల్‌ను పొదుపుగా వినియోగిస్తే ప్రతినెలా కోట్లాది రూపాయలు ఆదా అవుతాయని అంచనా.  

► సిటీ బస్సులు లీటర్‌ వినియోగంపై 4.67 (కేఎంపీఎల్‌) చొప్పున తిరుగుతున్నాయి. డీజిల్‌ను పొదుపుగా వినియోగించగలిగితే 0.1 కిలోమీటర్‌ అదనంగా పెంచుకొనే అవకాశం ఉంటుంది. అంటే ఒక లీటర్‌పై 4.77 కేఎంపీల్‌ పెంచుకోవచ్చు. ఇలా  0.1  కి.మీ అదనంగా పెరిగితే ప్రతినెలా రూ.కోటి ఆదా అవుతుంది. నెలకు రూ.12 కోట్లు మిగుతాయని ఓ ఆర్టీసీ ఉన్నతాధికారి తెలిపారు.  

అవగాహన కోసమే నోటీసులు.. 
డీజిల్‌ వినియోగంపై డ్రైవర్లలో అవగాహన పెంచి పొదుపు పాటించేందుకు కసరత్తు చేపట్టారు. ఒక డ్రైవర్‌ అదనంగా డీజిల్‌ వినియోగించడం వల్ల అయ్యే ఖర్చును నేరుగా అతనికే నోటీసుల రూపంలో అందజేస్తున్నారు. ‘డ్రైవర్లను అప్రమత్తం చేసేందుకు మాత్రమే వారి జీతాల్లోంచి ఎందుకు వసూలు చేయకూడదంటూ  హెచ్చరిస్తున్నాం. కానీ అదనపు  డీజిల్‌ భారాన్ని వారిపై మోపేందుకు కాదు’ అని ఆర్టీసీ ఉన్నతాధికారి  ఒకరు చెప్పారు.  

డ్రైవర్ల చేతుల్లోనే ‘గేర్‌’.. 
► ఇంధనాన్ని పరిమితంగా వినియోగించే నైపుణ్యం డ్రైవర్ల చేతుల్లోనే ఉంది. ఉదాహరణకు ఒకే రూట్‌లో, ఒకే  దూరానికి కొంతమంది డ్రైవర్లు  50 లీటర్లు వినియోగిస్తే మరికొందరు  60 లీటర్ల వరకు వినియోగిస్తున్నారు. (క్లిక్: ఆ వెబ్‌సైట్‌ మాకు ఇప్పించండి!)

► గేర్‌లు మార్చే సమయంలో యాక్సిలేటర్‌ను అవసరానికి మించి నొక్కడం వల్ల ఇంజిన్‌లోకి డీజిల్‌ అదనంగా చేరుతుంది. ‘మొదటి గేర్‌పై బండి నడిపే సమయంలో ఏ మేరకు డీజిల్‌ అవసరమో ఆ మేరకు యాక్సిలేటర్‌ నొక్కాలి, కానీ అలా జరగడం లేదు. దీంతో ఎక్కువ డీజిల్‌ వినియోగమవుతోంది’ అని ఓ అధికారి వివరించారు.  (క్లిక్: ఇంటర్నేషనల్‌ కన్‌స్ట్రక్షన్‌ వర్సిటీ సాధ్యమే

మరిన్ని వార్తలు