ఈ వేరియంట్లేంటి? మ్యుటేషన్ల ముప్పేంటి?

1 Jul, 2021 03:27 IST|Sakshi

ఏడాదిన్నర కింద కరోనా వైరస్‌ దాడి మొదలైంది. ఏడాది కింద మొదటి వేవ్‌తో కలకలం సృష్టించింది. ఇటీవల రెండో వేవ్‌తో అతలాకుతలం చేసింది. త్వరలో మూడో వేవ్‌ వస్తోందన్న ఆందోళననూ రేకెత్తిస్తోంది. అంతా కరోనానే అయినా.. మొదట్లో వచ్చిన వైరస్‌ వేరియంట్‌ ఆల్ఫా, ఇప్పుడున్నది డెల్టా, మూడోవేవ్‌కు కారణమవుతాయన్నది డెల్టా ప్లస్‌. మరి అసలు వైరస్‌ ఇలా మ్యూటేట్‌ అవడం ఏమిటి? కారణాలు ఏమిటి? దీనివల్ల ప్రమాదం ఎంత? దేశంలో ప్రస్తుత పరిస్థితి ఏమిటన్నది తెలుసుకుందామా..    
– సాక్షి సెంట్రల్‌ డెస్క్‌

వైరస్‌ మ్యుటేషన్లు, వేరియంట్లు ఏమిటి?
సాధారణంగా వైరస్‌లు పరిస్థితులకు అనుగుణంగా తరచూ వాటిల్లోని జన్యు, ప్రొటీన్‌ పదార్థాలను మార్చుకుంటూ ఉంటాయి. ఈ మార్పులనే మ్యుటేషన్లు అంటారు. జన్యు, ప్రొటీన్లలో జరిగిన మార్పులను బట్టి ఆ వైరస్‌ లక్షణాలు తీవ్రంగా మారడంగానీ, ఉన్న సామర్థ్యాన్ని కోల్పోవడం గానీ జరుగుతుంది. ఇలా మ్యుటేషన్లు జరిగిన వైరస్‌ రకాలనే వేరియంట్లు అంటారు. వైరస్‌ ఎంత ఎక్కువగా వ్యాప్తి చెందుతూ పోతుంటే.. అంత ఎక్కువగా మ్యుటేషన్లు చెంది కొత్త కొత్త వేరియంట్లు వస్తాయి. వీటిలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన వేరి యంట్లను ‘వేరియంట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌ (వీఓఐ)’గా.. ప్రమాదకరంగా మారే అవకాశమున్న వాటిని ‘వేరియంట్‌ ఆఫ్‌ కన్సర్న్‌ (వీఓసీ)’గా సూచిస్తున్నారు.

కరోనా ఎందుకు మార్పు చెందుతోంది?
ప్రజలు కోవిడ్‌ నిబంధనలు సరిగా పాటించకపోవడం వల్ల విపరీతంగా వ్యాప్తి చెందే అవకాశం ఉండటం
వ్యాపించిన కొద్దీ వైరస్‌ తన సామర్థ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేయడం
భారీగా పునరుత్పత్తి చేసుకునే క్రమంలో వైరస్‌ విభజనలో తేడాలు
ప్లాస్మా థెరపీ, వ్యాక్సిన్లు, మోనోక్లోనల్‌ యాంటీబాడీస్‌ వంటి చికిత్సలతో శరీరంలో ఏర్పడిన రోగనిరోధక శక్తిని ఎదుర్కొనేందుకు వైరస్‌ ప్రయత్నించడం.

మ్యుటేషన్ల వల్ల ప్రమాదం ఎంత వరకు?
వైరస్‌ ఇన్ఫెక్షన్‌ తీవ్ర స్థాయిలో ఉండటం
వ్యాప్తి చెందే సామర్థ్యం పెరగడం
రోగ నిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకోవడం
ఊపిరితిత్తుల కణాలకు మరింత సులువుగా అతుక్కునే సామర్థ్యం రావడం
ఒకచోట ఉన్నవారందరికీ గుంపులుగా ఇన్ఫెక్ట్‌ కావడం
మోనోక్లోనల్‌ యాంటీ బాడీస్‌ నుంచి తప్పించుకునే శక్తి సంతరించుకోవడం

దేశంలో ‘కన్సర్న్‌’ వేరియంట్ల పరిస్థితి ఏమిటి?
దేశవ్యాప్తంగా 35 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 174 జిల్లాల్లో ప్రమాదకర కరోనా వేరియంట్లను గుర్తించారు.
ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీ, పంజాబ్, తెలంగాణ, పశ్చిమబెంగాల్, గుజరాత్‌లలో ఇవి ఎక్కువగా వ్యాప్తిలో ఉన్నాయి.
40వేల శాంపిళ్లలో ప్రమాదకర వేరియంట్లపై చేసిన కమ్యూనిటీ స్టడీలో.. ఆల్ఫా వేరియంట్‌ కేసులు 3,969.. గామా రకం ఒకటి.. బీటా రకం 149.. డెల్టా, దాని అనుబంధ రకాల కేసులు 16,238 నమోదయ్యాయి.
కరోనా కొత్త కేసుల్లో ‘వీఓసీ’ల శాతం మే రెండో వారంలో 10.31 శాతమే ఉండగా.. జూన్‌ 20 నాటికి ఏకంగా 51 శాతానికి పెరిగింది. అంటే ప్రమాదకర వేరియంట్ల వ్యాప్తి పెరుగుతోంది.

డెల్టా వేరియంట్లు..  ప్రమాదం లెక్కలివీ..
దేశంలో కరోనా రెండో వేవ్‌కు ప్రధాన కారణమైన డెల్టా (బీ.1.617) వేరియంట్‌ మరికొన్ని మార్పులు చెంది.. మూడు సబ్‌ వేరియంట్లు గా మారింది. ఇందులో కప్పా (బీ.1.617.1), లంబ్డా (బీ.1.617.3)లను జాగ్రత్త పడాల్సిన ‘వీఓఐ’ రకాలుగా గుర్తించారు. మరొకటైన డెల్టా ప్లస్‌ (బీ.1.617.2 లేదా ఏవై.1) రకాన్ని ప్రమాదకరమైన ‘వీఓసీ’ రకంగా ప్రకటించారు.
డెల్టా ప్లస్‌ వేరియంట్‌కు వ్యాప్తి చెందే లక్షణం, ఊపిరితిత్తుల్లోని కణాలకు అతుక్కునే సామర్థ్యం మరింత ఎక్కువ. వ్యాక్సిన్‌తో శరీరంలో ఏర్పడిన రోగ నిరోధక శక్తి నుంచి, మోనోక్లోనల్‌ యాంటీబాడీస్‌ నుంచి తప్పించుకునే సామర్థ్యం పెరిగింది.

దేశంలో ‘డెల్టా ప్లస్‌’  కేసుల తీరు
దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో కలిపి ఇప్పటివరకు 51 డెల్టా ప్లస్‌ కేసులను గుర్తించారు.
ఐసీఎంఆర్, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్‌ఐవీ) ల్యాబ్‌లలో ఈ వేరియంట్‌పై పరిశోధనలు చేస్తున్నారు.
వ్యాక్సిన్‌ తీసుకున్నాక ఈ వేరియంట్‌ కరోనా సోకినవారి పరిస్థితి ఏమిటి, వ్యాక్సిన్‌ ప్రభా వం ఎంత వరకు ఉందన్నది కచ్చితంగా తేల్చేందుకు పలు ఆస్పత్రుల్లో అధ్యయనం జరుగుతోంది.

ప్రమాదకర వేరియంట్ల  నియంత్రణ ఎలా?
దేశంలో ప్రమాదకర వేరియంట్లు విస్తరిం చకుండా కేంద్ర వైద్యారోగ్య శాఖ పలు సూచనలు చేసింది. ఈ తరహా కేసులు వచ్చిన ప్రాంతాలను కంటైన్‌మెంట్‌ జోన్లుగా ప్రకటించడం, బాధితులను ప్రత్యేకంగా ఐసోలేట్‌ చేసి, తగిన చికిత్స అందించడం, వారి కాంటా క్టులను క్వారంటైన్‌ చేయడం, ఆయా ప్రాంతాల్లో వ్యాక్సినేషన్‌ భారీగా చేపట్టడం వంటి చర్యలు చేపట్టాలని ఆదేశించింది.
ప్రమాదకర వేరియంట్లు వచ్చిన జిల్లాలపై రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని, వైద్యారోగ్య సేవలను పెంచాలని సూచించింది.
విస్తృతంగా కరోనా టెస్టులు చేయడం, పాజిటివ్‌ వచ్చిన వారి కాంటాక్టుల ట్రేసింగ్, శాంపిళ్లను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపడం, జనం గుంపులుగా ఉండకుండా చూడటం తప్పనిసరి అని స్పష్టం చేసింది. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు