ఉన్నత విద్యలోనూ ఉత్తర, దక్షిణాలే! 

2 May, 2022 04:23 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  భౌగోళికంగా, సాంస్కృతికంగా భిన్నంగా ఉండే ఉత్తర, దక్షిణ భారత రాష్ట్రాలు.. విద్యార్థుల చదువు విషయంలోనూ విభిన్నంగా ఉన్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో విద్యార్థులు సంప్రదాయ కోర్సులు, ఉపాధి అవకాశాలకు ప్రాధాన్యమిస్తుంటే.. దక్షిణాదిలో ఇంజనీరింగ్, ఇతర వృత్తివిద్యా కోర్సుల వైపే మొగ్గుచూపుతున్నారు. ఉత్తరాదిన పోటీ పరీక్షలపై ఎక్కువగా దృష్టిపెడుతుండగా.. దక్షిణ రాష్ట్రాల్లో దేశ, విదేశాల్లో ప్రైవేటు ఉద్యోగాల వైపు చూస్తున్నారు. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ఇటీవల నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ అంశంపై దేశవ్యాప్తంగా అధ్యయనం చేసిన ఏఐసీటీఈ దీనికి గల కారణాలనూ గుర్తించి, నివేదికను విడుదల చేసింది. 

నేరుగా ఉపాధి దొరికేలా.. 
దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులు బీటెక్‌ తర్వాత తక్షణ ఉపాధి అవకాశాలు కోరుకుంటున్నట్టు ఏఐసీటీఈ సర్వేలో వెల్లడైంది. సాఫ్ట్‌వేర్‌ లేదా ఇతర సాంకేతిక, వృత్తివిద్య పూర్తిచేసి.. ఉద్యోగాల్లో చేరడంపై దృష్టిపెడుతున్నట్టు తేలింది. ఈ కారణంగానే ఆయా కోర్సులకు దక్షిణాదిలో భారీగా డిమాండ్‌ ఉందని.. దేశవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్‌ సీట్లలో 54 శాతం దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉన్నాయని ఏఐసీటీఈ పేర్కొంది. దేశవ్యాప్తంగా 12,47,667 బీటెక్‌ సీట్లు అందుబాటులో ఉంటే.. అందులో సగం మేర అంటే 6,74,697 సీట్లు కేవలం ఐదు దక్షిణాది రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం పరిధిలోనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా కలిపి ఎంసీఏలో 70,065 సీట్లు ఉంటే.. దక్షిణాదిలోనే 30,812 (44 శాతం) సీట్లు ఉన్నాయి. ఎంబీఏ, పీజీడీఎం వంటి మేనేజ్‌మెంట్‌ కోర్సులకు సంబంధించి మొత్తంగా 3,39,405 సీట్లు ఉంటే.. ఇందులో దక్షిణాదిలోనే 1,57,632 సీట్లు ఉండటం గమనార్హం. ఇక్కడి విద్యార్థుల ఆసక్తికి అనుగుణంగానే.. బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ సీట్లు భారీగా పెరిగాయని ఏఐసీటీఈ అంచనా వేసింది. 2015–16లో దేశంలోని మొత్తం బీటెక్‌ సీట్లలో 48.77 శాతం మేర దక్షిణాదిలోనే ఉండగా.. గత ఆరేళ్లలో మరో 5.3 శాతం పెరిగి 54 శాతానికి చేరాయని తేల్చింది. 

విదేశీ మోజు.. ప్రైవేటు కాలేజీలు.. 
దక్షిణాది విద్యార్థులు బీటెక్‌ తర్వాత విదేశాల్లో ఎంఎస్‌ చేసి, ఉద్యోగంలో స్థిరపడటంపై మక్కువ చూపుతున్నారు. వీరిలో పోటీ పరీక్షలవైపు మొగ్గుచూపుతున్నవారు ఉత్తరాదితో పోలిస్తే చాలా తక్కువని ఏఐసీటీఈ పేర్కొంది. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రైవేటు కాలేజీలు భారీగా ఉండటం కూడా విద్యార్థులు వృత్తివిద్య వైపు వెళ్లడానికి కారణమని అంచనా వేసింది. వీటిలోనూ ఎక్కువగా కంప్యూటర్‌ సైన్స్, అనుబంధ కోర్సుల్లోనే చేరుతున్నట్టు తెలిపింది. ఈ కారణంతోనే దక్షిణాది రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో సంప్రదాయ కోర్సుల సీట్లు మిగిలిపోతున్నాయి. వృత్తి విద్య కోర్సులే అయినా.. సివిల్, మెకానికల్‌ సీట్లు కూడా పూర్తిస్థాయిలో నిండటం లేదు. దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడులో ఇంజనీరింగ్‌ కోర్సులు చేసేవారు భారీగా ఉంటున్నట్టు ఏఐసీటీఈ పేర్కొంది. అయితే ఉన్నత విద్య విషయంగా ఉత్తర, దక్షిణ రాష్ట్రాల్లో నెలకొన్న వ్యత్యాసంపై మరింత అధ్యయనం అవసరమని భావిస్తోంది. 

విభిన్న ధోరణులే కారణం 
ఉత్తర, దక్షిణ భారతదేశ రాష్ట్రాల్లో విద్యార్థుల ఆలోచనలు విభిన్నంగా ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో మొదట్నుంచీ విద్యార్థులు గణితం నేర్చుకోవడం ఇష్టపడతారు. తల్లిదండ్రులు ఈ దిశగానే ప్రోత్సహిస్తున్నారు. ఐటీ, ఇతర సాంకేతిక విభాగాలు గణితంతో మిళితమై ఉంటాయి. దీంతో ఎక్కువగా బీటెక్‌ కోర్సుల్లో చేరుతున్నారు. అమెరికాతో మనకు సంబంధాలు పెరిగాక సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలపై ఆసక్తి పెరిగింది. ఉత్తరాదిలో పరిస్థితి భిన్నంగా ఉంది. అక్కడి విద్యార్థుల్లో మొదట్నుంచీ కమ్యూనికేషన్‌ స్కిల్స్, ఆంగ్ల భాష మీద పట్టు ఎక్కువగా ఉంటున్నాయి. వాళ్లు ఎక్కువగా అకౌంటింగ్, మార్కెటింగ్, నిర్వహణ సామర్థ్యం ఉండే ఉపాధి వైపు చూస్తున్నారు. అందుకు తగ్గ కోర్సులను ఎంచుకుంటున్నారు. మరో ముఖ్య విషయం ఏమంటే ఔత్సాహిక    పారిశ్రామికవేత్తలు ఉత్తరాది నుంచే ఎక్కువగా ఉంటున్నారు. అక్కడి తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఆ దిశగా ప్రోత్సహిస్తున్నారు. 
– ప్రొఫెసర్‌ వి.వెంకటరమణ, 
ఉన్నత విద్యా మండలి వైస్‌ చైర్మన్‌  

దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు,    ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలలో  విద్యార్థులు దాదాపు ఒకేరకమైన కోర్సుల్లో చేరుతున్నారు. ముఖ్యంగా బీటెక్, ఎంబీఏ, ఎంసీఏను ఎంచుకుంటున్నారు. ఇందులోనూ ఐటీ ఆధారిత కోర్సులే  ఎక్కువగా చేస్తున్నారు. 

ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్‌ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో విద్యార్థులు ఎక్కువగా సంప్రదాయ డిగ్రీ కోర్సుల్లో చేరుతున్నారు. తర్వాత పోటీ పరీక్షల వైపు మొగ్గు చూపుతున్నారు.  ఈ కారణంగానే సివిల్స్‌ వంటి పోటీ పరీక్షల శిక్షణ కేంద్రాలు ఉత్తరాదిలోనే  ఎక్కువగా ఉంటున్నాయని గుర్తించారు. 

మరిన్ని వార్తలు