ప్రసవం కోసం పడవ ప్రయాణం 

23 Sep, 2022 01:15 IST|Sakshi
పడవలో గర్భిణిని తీసుకెళ్తున్న గ్రామస్తులు  

దిందా వాగు పొంగడంతో ఆస్పత్రికి వెళ్లేందుకు పాట్లు 

‘ప్రాణహిత’ నుంచి పడవ తెచ్చి దాటించిన గ్రామస్తులు  

చింతలమానెపల్లి(సిర్పూర్‌): దిందా వాసుల కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు..వరదతో ఉప్పొంగే వాగుపై వంతెన నిర్మించాలని పోరుబాట పట్టినా ఫలితం దక్కలేదు. ఈ క్రమంలో ఓ నిండు గర్భిణిని అష్టకష్టాలు పడి ఆస్పత్రికి తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కుమురంభీం జిల్లా సిర్పూర్‌(టి) మండలం నవేగాం గ్రామానికి చెందిన లొకండే సాయిరాం భార్య పద్మ రెండో కాన్పు కోసం చింతలమానెపల్లి మండలం దిందా గ్రామంలోని పుట్టింటికి వచ్చింది.

నెలలు నిండటంతో వైద్యుల సూచన మేరకు శుక్రవారం కాగజ్‌నగర్‌లో శస్త్రచికిత్స చేయించాల్సి ఉంది. బుధవారమే ఆస్పత్రికి చేరుకోవాల్సి ఉన్నా దిందా వాగులో వరద అధికంగా ఉండటంతో వెళ్లలేదు. రెండ్రోజులుగా వరద తగ్గకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు నాటు పడవపై గర్భిణిని వరద దాటించాలని నిర్ణయించారు. గురువారం ఉదయం ప్రాణహిత నది వద్ద నుంచి నాటు పడవను తీసుకువచ్చారు. వాగు దాటేందుకు పద్మ పత్తి చేల గుండా కాలినడకన వాగు వద్దకు చేరుకుంది. ఆ తర్వాత నాటు పడవ ద్వారా స్థానికులు వాగు దాటించారు. అనంతరం అవతలి ఒడ్డున ఏర్పాటు చేసిన 108 వాహనంలో కాగజ్‌నగర్‌కు తరలించారు.  

మరిన్ని వార్తలు