కళాతపస్వికి కన్నీటి వీడ్కోలు

4 Feb, 2023 02:33 IST|Sakshi
విశ్వనాథ్‌ అంతిమయాత్ర దృశ్యం..

అంతిమయాత్రలో పెద్దసంఖ్యలో పాల్గొన్న అభిమానులు

నివాళులర్పించిన రాజకీయ, సినీప్రముఖులు 

ప్రముఖ దర్శకుడు కాశీనాథుని విశ్వనాథ్‌కు అశేష అభిమానగణం కన్నీటి వీడ్కోలు పలికింది. ఆయన అంత్యక్రియలు శుక్రవారం మధ్యాహ్నం పంజగుట్ట హిందూ శ్మశానవాటికలో జరిగాయి. శుక్రవారం ఆయన నివాసం నుంచి పంజగుట్ట శ్మశానవాటిక వరకు అంతిమయాత్ర సాగింది. అంతకుముందు ఆయనకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. కళాతపస్విని కడసారి చూసేందుకు అభిమానులు పెద్దసంఖ్యలో తరలివచ్చి అంతిమయాత్రలో పాల్గొన్నారు. 

బంజారాహిల్స్‌/సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు కాశీనాథుని విశ్వనాథ్‌ (92)కు అశేష అభిమానగణం కన్నీటి వీడ్కోలు పలికింది. ఆయన అంత్యక్రియలు శుక్రవారం మధ్యాహ్నం పంజగుట్ట హిందూ శ్మశాన వాటికలో సంప్రదాయబద్ధంగా జరిగాయి. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి అపోలో ఆస్పత్రిలో తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే.

విశ్వనాథ్‌ పార్థివ దేహాన్ని ఆస్పత్రి నుంచి గురువారం రాత్రి ఒంటి గంటకు ఫిలింనగర్‌లోని స్వగృహానికి తరలించారు. రాత్రి నుంచే విశ్వనాథ్‌ భౌతికకాయాన్ని సందర్శించేందుకు సినీ, రాజకీయ ప్రముఖులతోపాటు అభిమానులు భారీగా విచ్చేయడంతో పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. శుక్రవారం ఆయన నివాసం నుంచి పంజగుట్ట శ్మశాన వాటిక వరకు అంతిమయాత్ర సాగింది. కళాతపస్విని కడసారి చూసేందుకు అభిమానులు పెద్దసంఖ్యలో అంతిమయాత్రలో పాల్గొన్నారు. అనంతరం శ్మశాన వాటికలో ఆయన పార్థివదేహాన్ని ఖననం చేశారు.  

కన్నీరుమున్నీరైన చంద్రమోహన్‌ 
విశ్వనాథ్‌ భౌతికకాయాన్ని శుక్రవారం మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఎంపీ సంతోష్‌ కుమార్, సినీ ప్రముఖులు మెగాస్టార్‌ చిరంజీవి, వెంకటేష్, పవన్‌ కల్యాణ్, శరత్‌కుమార్, రాధిక, రాజశేఖర్, జీవిత, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, కె.రాఘవేంద్రరావు, త్రివిక్రమ్‌ శ్రీనివాస్, రాజమౌళి, అల్లు అరవింద్, బోయపాటి శ్రీను, శేఖర్‌ కమ్ముల, ఆది శేషగిరిరావు, దగ్గుబాటి సురేష్‌బాబు తదితరులు సందర్శించి నివాళులర్పించారు. విశ్వనాథ్‌ కుటుంబసభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. విశ్వనాథ్‌ దర్శకత్వంలో సిరిసిరిమువ్వ సినిమాలో హీరోగా నటించిన చంద్రమోహన్‌ కన్నీరుమున్నీరయ్యారు. విశ్వనాథ్‌ భౌతికకాయాన్ని చూడటంతోనే ఆయన విలపిస్తూ అక్కడే కుప్పకూలిపోయారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.  

విశ్వనాథ్‌ మృతి బాధాకరం: మంత్రి తలసాని  
కళాతపస్వి విశ్వనాథ్‌ మృతి బాధాకరమని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. తలసాని ఆయన నివాసానికి వెళ్లి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మన సంస్కృతి సంప్రదాయాలు, కళల విశిష్టతను చాటేలా అనేక చిత్రాలు నిర్మించిన గొప్ప దర్శకులంటూ కొనియాడారు. 

ఏపీ ప్రభుత్వం తరపున.. 
విశ్వనాథ్‌ అంత్యక్రియల్లో ఏపీ ప్రభుత్వం తరపున బీసీ సంక్షేమ, సమాచార, సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పాల్గొన్నారు. ఆయన విశ్వనాథ్‌ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను, సంగీత సాహిత్యాలను సృజనాత్మక శైలిలో ప్రేక్షకులకు అందించిన కళాతపస్వి మరణించడం సినీ పరిశ్రమకు తీరని లోటని చెప్పారు.  

బహుముఖ ప్రజ్ఞాశాలి విశ్వనాథ్‌: ప్రధాని మోదీ 
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్‌ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ‘సినీ ప్రపంచంలో కె.విశ్వనాథ్‌ ఒక దిగ్గజం. సృజనాత్మక దర్శకుడిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా సినీలోకంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. వివిధ ఇతివృత్తాలతో తీసిన అతని సినిమాలు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరించాయి’.. అని శుక్రవారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 

అసమాన ప్రతిభావంతుడు: గవర్నర్‌ తమిళిసై 
కె.విశ్వనాథ్‌ మృతిపై గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒక దిగ్గజ దర్శకుడు, నటుడిని తెలుగు సినీ పరిశ్రమ కోల్పోయిందని తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. ఆయన తన అసమాన ప్రతిభతో సినీ పరిశ్రమపై చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు.

అరుదైన దర్శక దిగ్గజం: కేసీఆర్‌
ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్‌ మృతికి సీఎం కేసీఆర్‌ తీవ్ర సంతాపం తెలిపారు. అతి సా మాన్యమైన కథను ఎంచుకొని.. తన అద్భుతమైన ప్రతిభతో.. వెండి తెర దృశ్య కావ్యంగా మలిచిన అరుదైన దర్శ కుడు కె.విశ్వనాథ్‌ అని కొనియాడారు. గతంలో విశ్వనాథ్‌ ఆరోగ్యం బాగా లేనప్పుడు ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించిన సమయంలో.. సినిమాలు, సంగీతం, సాహిత్యంపై తమ మధ్య జరిగిన చర్చను సీఎం గుర్తు చేసుకున్నారు. 

తెలుగువారి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతారు: జగన్‌ 
సాక్షి, అమరావతి: సినీ దర్శక దిగ్గజం కె. విశ్వనాథ్‌ తెలుగు వారి గుండెల్లో కళాతపస్విగా శాశ్వతంగా నిలిచిపోతారని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కొనియాడారు. ఈ మేరకు శుక్రవారం ఆయన తన ట్విట్టర్‌ ఖాతాల్లో ట్వీట్‌ చేశా రు. ‘విశ్వనాథ్‌ గారి మరణం తీవ్ర విచారానికి గురిచేసింది. తెలుగు సంస్కృతికి, బారతీయ కళలకు నిలువుటద్దం విశ్వనాథ్‌ గారు. ఆయన దర్శకత్వం రూపుదిద్దుకున్న చిత్రాలు తెలుగు సినీ రంగానికి అసమాన గౌరవాన్ని తెచ్చాయి’ 
అని పేర్కొన్నారు.  

స్పీకర్, మంత్రుల సంతాపం
కె.విశ్వనాథ్‌ మరణంపై స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌ కుమార్, శ్రీనివాస్‌గౌడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ప్రణాళిక సంఘం వైస్‌ చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌కుమార్‌ సంతాపం వ్యక్తం చేశారు.

సినిమా తీయాలనుకున్నా 
విశ్వనాథ్‌తో సినిమా తీయాలన్న తన ఆశ కలగానే మిగిలిపోయిందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. కె.విశ్వనాథ్‌ మృతికి టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ వేర్వేరు ప్రకటనల్లో తీవ్ర సంతాపం తెలిపారు.   

మరిన్ని వార్తలు