కరెంట్‌ చార్జీల పెంపుపై కసరత్తు

7 Nov, 2020 01:33 IST|Sakshi

ప్రభుత్వం అనుమతిస్తే ఈఆర్సీకి ప్రతిపాదనలు పంపనున్న డిస్కంలు

గత రెండేళ్లుగా టారిఫ్‌ ప్రతిపాదనల సమర్పణకు ఒప్పుకోని సర్కారు

ఈ నెల 30తో ముగియనున్న వచ్చే ఏడాది టారిఫ్‌ ప్రతిపాదనల గడువు

ఐదేళ్లుగా చార్జీలు పెంచకపోవడంతో రూ. 20 వేల కోట్లకు చేరిన ఆదాయ లోటు  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో విద్యుత్‌ చార్జీల పెంపుపై విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లు మళ్లీ కసరత్తు ప్రారంభించాయి. రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తే ఈ నెలాఖరులోగా రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి టారిఫ్‌ పెంపు ప్రతిపాదనలు సమర్పించనున్నాయి. వరుస ఎన్నికలతో గత రెండేళ్లుగా చార్జీల పెంపు ప్రతిపాదనలను డిస్కంలు వాయిదా వేసుకుంటూ వచ్చాయి. కేంద్ర విద్యుత్‌ చట్టం ప్రకారం ఏటా నవంబర్‌ 30లోగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాల (ఏఆర్‌ఆర్‌) అంచనాల నివేదికను డిస్కంలు ఈఆర్సీకి సమర్పించాల్సి ఉంటుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర విద్యుత్‌ సరఫరా అవసరాలు ఏమిటి? ఎన్ని మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ అవసరం కానుంది? ఇంత విద్యుత్‌ సరఫరా చేయడానికి ఎంత ఖర్చు కానుంది? ప్రస్తుత విద్యుత్‌ చార్జీలతో ఇంత విద్యుత్‌ సరఫరా చేస్తే ఎంత ఆదాయ లోటు ఏర్పడనుంది? ఆర్థిక లోటును అధిగమించడానికి ఏ మేరకు విద్యుత్‌ చార్జీలు పెంచాలి? ఏ కేటగిరీ వినియోగదారులపై ఎంత భారం మోపాలి? వంటి అంశాలకు సంబంధించిన అంచనాలు, ప్రతిపాదనలతో ఏఆర్‌ఆర్‌ నివేదికను సమర్పించాల్సి ఉంటుంది.

వాటిపై ఈఆర్సీ బహిరంగ విచారణ నిర్వహించి వచ్చే ఏడాదికి సంబంధించిన టారిఫ్‌ ఉత్తర్వులను జారీ చేస్తుంది. అయితే గత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు, ఇతర రాజకీయ కారణాలతో డిస్కంలు 2019–20, 2020–21 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన ఏఆర్‌ఆర్‌ నివేదికలను ఇప్పటివరకు ఈఆర్సీకి సమర్పించలేదు. దీంతో 2018–19 ఆర్థిక సంవత్సరం కోసం జారీ చేసిన టారిఫ్‌ ఆధారంగా రాష్ట్రంలో విద్యుత్‌ చార్జీలు వసూలు చేసుకోవడానికి డిస్కంలకు ఈఆర్సీ అనుమతిచ్చింది. 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఏఆర్‌ఆర్‌ నివేదికను ఈఆర్సీకి సమర్పించడానికి ఈ నెలాఖరుతో గడువు ముగియబోతోంది. అందువల్ల 2019–20, 2020–21, 2021–22 ఆర్థిక సంవత్స రాలకు సంబంధించిన ఏఆర్‌ఆర్‌ నివేదికలను డిస్కంలు ఈఆర్సీకి సమర్పించాల్సి ఉంది. ఇప్పటికే 2019–20, 2020–21కి సంబంధించిన ఏఆర్‌ఆర్‌ నివేదికలు డిస్కంల వద్ద సిద్ధంగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించకపోవడంతో ఈఆర్సీకి సమర్పించలేకపోయాయి. గడువు సమీపిస్తుండటంతో 2021–22కి సంబంధించిన ఏఆర్‌ఆర్‌ల రూపకల్పనపై దృష్టి సారించాయి.

ఆదాయ లోటు రూ. 20 వేల కోట్లు
డిస్కంల ఆదాయ లోటు ఏకంగా రూ. 20 వేల కోట్లకు ఎగబాకిందని ఇంధన శాఖ అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. 2018–19 నాటికి రూ. 12 వేల కోట్లు ఉన్న ఆదాయ లోటు గత రెండేళ్లలో భారీగా పెరిగి రూ. 20 వేల కోట్లకు మించిపోనుందని ఉన్నతాధికారులు పేర్కొంటు న్నారు. ఉచిత వ్యవసాయ విద్యుత్, ఎత్తిపోతల పథకాలకు విద్యుత్‌ సరఫరా కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది రూ. 10 వేల కోట్ల విద్యుత్‌ రాయితీలను బడ్జెట్‌లో కేటాయించింది. ఈ రాయితీలు పోగా ఆదాయ లోటు రూ. 20 వేల కోట్ల వరకు మిగిలి ఉంటాయని ఓ ఉన్నతాధికారి తెలిపారు. విద్యుదుత్పత్తి కంపెనీలకు డిస్కంలు రూ. 10 వేల కోట్లకుపైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కరోనా ఆత్మనిర్భర్‌ ప్యాకేజీ కింద ఆర్‌ఈసీ, పీఎఫ్‌సీ నుంచి రూ. 12 వేల కోట్ల రుణాలను పొందడానికి డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇప్పటికే రూ. 6 వేల కోట్ల రుణాలు మంజూరవగా కేంద్రం విధించిన షరతులు పూర్తి చేస్తే మిగిలిన రుణం మంజూరు కానుంది. అయితే భారీ మొత్తంలో విద్యుత్‌ చార్జీలు పెంచితేనే ప్రస్తుత పరిస్థితుల్లో డిస్కంలు ఆర్థిక సంక్షోభం నుంచి కొంత వరకు గట్టెక్కే అవకాశాలున్నాయి.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాతే..
జీహెచ్‌ఎంసీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఈ నెలాఖరులోగా టారిఫ్‌ పెంపు ప్రతిపాదనలు సమర్పించడానికి డిస్కంలకు అనుమతి లభించే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. వచ్చే ఏడాది జనవరిలోగా జీహెచ్‌ఎంసీ ఎన్నికలు పూర్తయితే ఆ వెంటనే టారీఫ్‌ పెంపు ప్రతిపాదనలను సమర్పించే అవకాశముంది.

మరిన్ని వార్తలు