డిస్కంల నష్టాలు 5.49 లక్షల కోట్లు!

8 Apr, 2023 04:10 IST|Sakshi

దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యుత్‌ పంపిణీ సంస్థల తీరిది 

పంపిణీలో లొసుగులు, వసూళ్లలో నిర్లక్ష్యంతోనే నష్టాలు

రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీల విడుదలలో జాప్యం కూడా కారణమే: కేంద్ర విద్యుత్‌ శాఖ 

సాక్షి, ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్‌ :  దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యుత్‌ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఏకంగా రూ. 5.49 లక్షల కోట్ల మేర నష్టాల్లో కూరుకుపోయినట్లు కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖ స్వయంగా ప్రకటించింది. ఈ నష్టాలకు తోడు విద్యుత్‌ ఉత్పాదన సంస్థలకు మరో రూ. 1.20 లక్షల కోట్ల మేర డిస్కంలు బకాయిపడ్డట్లు తెలిపింది.

కేంద్ర ప్రభుత్వం గత జూన్‌లో తీసుకొచ్చిన కొత్త విద్యుత్‌ విధానం ప్రకారం పంపిణీ సంస్థలకు ఉత్పాదన సంస్థలు విద్యుత్‌ సరఫరా చేసిన 45 రోజుల్లోగా బిల్లులు చెల్లించాలి. సకాలంలో బిల్లులు చెల్లించకుంటే ఉత్పత్తి సంస్థలు డిస్కంల నుంచి అధిక వడ్డీ వసూలు చేస్తాయి. ఈ గడువు దాటినా బిల్లులు చెల్లించకపోతే సంబంధిత డిస్కంలకు విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తాయి.

కానీ ఈ నిబంధనను కూడా బేఖాతరు చేస్తూ విద్యుత్‌ పంపిణీ సంస్థలు సకాలంలో బిల్లులు చెల్లించకుండా బకాయిలు పెంచుకుంటూ పోతూనే ఉన్నాయి. గతేడాది జూన్‌ 3కు ముందు విద్యుత్‌ బకాయిలు రూ. 91,061 కోట్లుగా ఉండగా కొత్త నిబంధన అమల్లోకి వచ్చాకఉత్పాదన సంస్థలకు డిస్కంలు మరో రూ. 25, 470 కోట్లు బాకీ పడ్డాయి. 

నిర్లక్ష్యం ఫలితం... 
విద్యుత్‌ పంపిణీ వ్యవస్థలోని లొసుగులు, లెక్కాపత్రంలేని విద్యుత్‌ వాడకం, వసూళ్లలో నిర్లక్ష్యం, పంపిణీ అవుతున్న విద్యుత్‌కు.. వస్తున్న ఆదాయానికి కూడా పొంతనలేకపోవడం డిస్కంల నష్టాలకు ఓ కారణం. అదే విధంగా డి్రస్టిబ్యూషన్‌ కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ కింద చెల్లించాల్సిన నిధులు సకాలంలో విడుదల చేయకపోవడం కూడా ఈ నష్టాల పెరుగుదలకు కారణంగా భావిస్తున్నారు.  

నష్టాల్లో అగ్రస్థానం తమిళనాడు...
కేంద్రం లెక్కల ప్రకారం అత్యధిక నష్టాలు మూటగట్టుకుంటున్న రాష్ట్రాల్లో తమిళనాడు తొలి స్థానంలో నిలిచింది. అక్కడి విద్యుత్‌ పంపిణీ సంస్థలు ఏకంగా రూ. 1.25 లక్షల కోట్ల మేరకు నష్టాల్లో ఉన్నాయి. 2022–23 లెక్కలు పూర్తిగా వస్తే ఈ నష్టాలు మరింత పెరిగే అవకాశం ఉంది.

రెండో స్థానంలో రాజస్తాన్‌లోని డిస్కంలు రూ. 89,556 కోట్ల నష్టాలను మూటగట్టుకోగా రూ. 77,937 కోట్లతో యూపీ, రూ. 59,546 కోట్లతో మధ్యప్రదేశ్, రూ. 49,816 కోట్లతో తెలంగాణకు చెందినడిస్కంలు తరువాతి స్థానాల్లో ఉన్నాయి. పెద్ద రాష్ట్రాల్లోనే డిస్కంలబకాయిలు అధికంగా ఉండగా బెంగాల్‌ సహా దాదాపు 20 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల విద్యుదుత్పాదన సంస్థలకు పెద్దగా బకాయిలు లేవు. 

సంస్కరణలతోనే డిస్కంల బాగు..
విద్యుత్‌ పంపిణీ సంస్థలు జవాబుదారీగా వ్యవహరిస్తే నష్టాలు తగ్గించుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. నష్టాలు తగ్గించుకొని ఆర్థికంగా డిస్కంలు బాగుపడాలంటే యుద్ధప్రాతిపదికన ప్రీపెయిడ్‌ మీటర్ల ఏర్పాటు, ఉత్పత్తి, సరఫరా, పంపిణీకి ఆటోమేటిక్‌ మీటరింగ్‌ వ్యవస్థ అమలుఅవసరమని సూచిస్తోంది. 

మరిన్ని వార్తలు