Telangana: రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఊరట.. రూ.10,200 కోట్ల రుణాలకు ఓకే

28 Jul, 2022 01:43 IST|Sakshi

కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శితో రాష్ట్ర బృందం చర్చలు

‘ఉదయ్‌’ రుణాలు టేకోవర్‌ చేసుకోనందుకు గతంలో నిలిపివేసిన రుణాలు తీసుకునేందుకు అనుమతివ్వాలని విజ్ఞప్తి

కేంద్రం సానుకూల స్పందన .. తక్షణమే లేఖ 

నిలిచిపోయిన ఆర్‌ఈసీ, పీఎఫ్‌సీ రుణాలపై లభించని హామీ!

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. గతంలో నిలుపుదల చేసిన రూ.10,200 కోట్ల రుణాలను తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి తాజాగా కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)ల ఆర్థిక పునర్వ్యవస్థీకరణ కోసం కేంద్రం ప్రవేశపెట్టిన ఉజ్వల్‌ డిస్కం అస్యూరెన్స్‌ యోజన (ఉదయ్‌) పథకంలో రాష్ట్ర ప్రభుత్వం 2017 జనవరిలో చేరింది. ఈ పథకం కింద రాష్ట్ర డిస్కంలకు సంబంధించిన 75 శాతం రుణాలను టేకోవర్‌ చేసుకోవడానికి సమ్మతి తెలుపుతూ కేంద్ర ప్రభుత్వం, డిస్కంలతో రాష్ట్ర ప్రభుత్వం త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఒప్పందం మేరకు రాష్ట్ర ప్రభుత్వం డిస్కంల రుణాలను టేకోవర్‌ చేసుకోకపోవడంతో అప్పట్లో కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది.75 శాతం డిస్కంల రుణాలకు సరిపడా రూ.10,200 కోట్ల ఎఫ్‌ఆర్‌బీఎం రుణాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోకుండా కోత విధించింది. 

ఫలించిన తాజా చర్చలు
తాజాగా సీఎం కేసీఆర్‌తో పాటు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ..రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, రాష్ట్ర ఆర్థిక, నీటిపారుదల శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు కె.రామకృష్ణారావు, రజత్‌కుమార్, ఇతర అధికారుల బృందం బుధవారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిని కలిసి నిలిచిపోయిన వివిధ రుణాలకు సంబంధించిన అంశంపై చర్చలు జరిపింది. ఉదయ్‌ రుణాలు టేకో వర్‌ చేసుకోనందుకు గతంలో కోత విధించిన రాష్ట్ర రుణాలకు తిరిగి అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. 2017–21 మధ్య కాలానికి సంబంధించిన డిస్కంల నష్టాలు రూ.8,925 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం టేకోవర్‌ చేసుకుంటూ గత నెలలో ఉత్తర్వులు జారీ చేసినట్టు వివరించింది.

అలాగే నీటిపారుదల ప్రాజెక్టులు, యాదాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రానికి.. ఆర్‌ఈసీ, పీఎఫ్‌సీ నుంచి ఒప్పందాల మేరకు రావాల్సిన రుణాల విడుదలకు సైతం అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో గతంలో నిలుపుదల చేసిన రూ.10,200 కోట్ల రుణాలను తీసుకోవడానికి కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి తక్షణమే అనుమతిచ్చారు. ఈ మేరకు లేఖను సైతం అందజేశారు. అయితే ఇటీవల నిలిపివేసిన ఆర్‌ఈసీ, పీఎఫ్‌సీ రుణాలపై మాత్రం స్పష్టమైన హామీ ఇవ్వలేదని తెలిసింది. 

కస్టమ్‌ మిల్లింగ్‌ గడువు పొడిగింపు
ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌) అవసరాల కోసం కస్టమ్‌ మిల్లింగ్‌ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం 2021–22లో ఎఫ్‌సీఐకి బకాయిపడిన 5 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని ఇచ్చేందుకు తాజాగా కేంద్ర ప్రభుత్వం గడువు పొడిగించింది. కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ కార్యదర్శి సుధాన్షు పాండేను.. సీఎస్‌ సోమేశ్‌కుమార్, పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ బుధవారం ఢిల్లీలో కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేయగా, ఆయన సానుకూలంగా స్పందించారు.

బీజేపీపై పోరుకు సీఎం దిశానిర్దేశం!
– ఎంపీలతో కేసీఆర్‌ చర్చలు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు తాజా రాజకీయ పరిణామాలపై పలువురు టీఆర్‌ఎస్‌ ఎంపీలతో బుధవారం చర్చలు జరిపారని తెలిసింది. పార్లమెంట్‌లో జరుగుతున్న ఆందోళనలపై ఆరా తీసిన సీఎం.. ఒంటెత్తు పోకడలతో వ్యవహరిస్తున్న అధికార బీజేపీపై రాబోయే రోజుల్లో పోరాటాన్ని ఏ విధంగా ఉధృతం చేయాలన్న అంశాలపై దిశానిర్దేశం చేశారని సమాచారం. మరోవైపు రాష్ట్ర ఆర్థిక అంశాలపై సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ సహా ఇతర ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమాలోచనలు జరిపారు.

మరిన్ని వార్తలు