‘దిశ’ కమిషన్‌ విచారణకు మహేశ్‌ భగవత్‌ 

5 Sep, 2021 02:55 IST|Sakshi

అప్పటికే హుస్సేన్‌ను విచారిస్తున్న త్రిసభ్య కమిటీ

దీంతో భగవత్‌ను విచారించని సిర్పుర్కర్‌ కమిటీ

భగవత్‌ విచారణ ఈనెల 13వ తేదీకి రీషెడ్యూల్డ్‌

ఆ తర్వాత వైద్యులు, వెపన్‌ హెడ్స్‌ తదితర సాక్షుల విచారణ 

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం, ఎన్‌కౌంటర్‌పై సుప్రీం కోర్టు నియమించిన సిర్పుర్కర్‌ కమిషన్‌ ఎదుట రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ ఎం భగవత్‌ శనివారం విచారణకు హాజరయ్యారు. అయితే అప్పటికే నారాయణపేట జిల్లా జక్లేర్‌ గ్రామానికి చెందిన ఆరిఫ్‌ (ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు) తండ్రి హుస్సేన్‌ను విచారిస్తుండటంతో భగవత్‌ను విచారించలేదు. దీంతో ఆయన విచారణను కమిషన్‌ ఈనెల 13కి రీషెడ్యూల్డ్‌ చేసినట్లు తెలుస్తోంది. హుస్సేన్‌ విచారణ శనివారం పూర్తయింది.

ఇప్పటివరకు రాష్ట్ర హోం శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రవి గుప్తా, ప్రభుత్వం నియమించిన సిట్‌ దర్యాప్తు అధికారి సురేందర్‌ రెడ్డి, షాద్‌నగర్‌ రోడ్లు, భవనాల విభాగం (ఆర్‌అండ్‌బీ) డీఈఈ ఎం రాజశేఖర్, దిశ సోదరిలను చైర్మన్, ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన కమిటీ విచారణ పూర్తి చేసింది. ఇందులో దర్యాప్తు అధికారి సురేందర్‌ రెడ్డిని విచారించి కమిషన్‌ పలు కీలక సమాచారాన్ని రాబట్టింది. ఎన్‌కౌంటర్‌ తర్వాత నిందితుల మృతదేహాలకు పంచనామ చేసిన వైద్యులు, ఆయుధాలు (తుపాకులు) నిర్వహణ అధికారులు, సాంకేతిక, కాల్‌ రికార్డింగ్‌ బృందాలను విచారించనున్నట్టు సమాచారం.

మరొక 15 రోజుల్లో సిర్పుర్కర్‌ కమిటీ విచారణ పూర్తయ్యే అవకాశాలున్నాయని తెలిసింది. ఇదిలా ఉండగా...ఇప్పటికే ఒక పర్యాయం నిందితుల కుటుంబ సభ్యులను విచారించిన కమిషన్‌కు ‘ఇది బూటకపు ఎన్‌కౌంటర్‌’అని కుటుంబ సభ్యులు వాంగ్మూలం ఇచ్చారు. తమ కుమారులు పారిపోలేదని, పోలీసులే పట్టుకెళ్లి కాల్చి చంపారని కమిషన్‌ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు.

మరిన్ని వార్తలు