Regional Ring Road: ఆర్ఆర్ఆర్ భూసేకరణ నిధుల విషయంలో వివాదం! పెండింగ్‌లో ప్రాజెక్టు?

23 Feb, 2023 04:48 IST|Sakshi

రీజనల్‌ రింగు రోడ్డు భూసేకరణ నిధుల విషయంలో వివాదం 

రాష్ట్ర వాటా చెల్లించాలంటూ డిసెంబర్‌ నుంచి ఎన్‌హెచ్‌ఏఐ లేఖలు 

తుది గెజిట్‌ విడుదల చేసి భూమిని స్వాధీనం చేసుకుంటామంటూ మరో లేఖ 

భారీ ప్రాజెక్టు టెండర్ల దశకు చేరుకున్న తరుణంలో వివాదం 

జాప్యం జరిగితే అంచనా వ్యయం భారీగా పెరిగే అవకాశం 

రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైదరాబాద్‌ రీజనల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) విషయంలో గందరగోళం ఏర్పడింది. ప్రాజెక్టులో ఉత్తరభాగానికి సంబంధించి అన్ని సర్వేలు, అలైన్‌మెంట్‌ గుర్తింపు పూర్తయి భూసేకరణ చేయాల్సిన తరుణంలో.. ప్రాజెక్టు పెండింగ్‌లో పడేలా కనిపిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం భారత్‌మాల పరియోజన ప్రాజెక్టులో భాగంగా రీజనల్‌ రింగ్‌ రోడ్డును జాతీయ రహదారిగా నిర్మించనుంది. అయితే దీనికి అయ్యే భూసేకరణ వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం సగం భరించాల్సి ఉంది.

ఈ మేరకు వాటా నిధులను రాష్ట్ర ప్రభుత్వం ‘జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ)’కు డిపాజిట్‌ చేయకపోవటంతో వివాదం మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం వాటా నిధులు ఇస్తే.. భూసేకరణకు సంబంధించిన గెజిట్‌ నోటిఫికేషన్‌ (3డీ) విడుదల చేసేందుకు ఎన్‌హెచ్‌ఏఐ సిద్ధమైంది. నిధులను డిపాజిట్‌ చేయాలంటూ గత డిసెంబర్‌ నుంచి పలుమార్లు లేఖలు రాసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్‌హెచ్‌ఏఐ చైర్మన్‌ సంతోష్‌కుమార్‌ యాదవ్‌ తాజాగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఘాటుగా లేఖ రాయటంతో ఈ అంశం మరింతగా ముదురుతున్నట్టు కనిపిస్తోంది. 

రూ.2,948 కోట్ల నిధుల కోసం.. 
రీజనల్‌ రింగ్‌ రోడ్డు ఉత్తర భాగానికి సంబంధించి 162 కిలోమీటర్ల పొడవునా 2 వేల హెక్టార్ల భూమిని సమీకరించాల్సి ఉంది. ఇందుకు పరిహారంగా రూ.5,170 కోట్లను రైతులకు చెల్లించాల్సి ఉంటుందని ఎన్‌హెచ్‌ఏఐ లెక్కలేసుకుంది. ఇందులో 50 శాతం మొత్తం రూ.2,585 కోట్లతోపాటు విద్యుత్‌ స్తంభాలు వంటి వాటిని తరలించడం, ఇతర ఖర్చులకు మరో రూ.363.43 కోట్లు చెల్లించాలంటూ.. గత డిసెంబరులో ఢిల్లీలోని ఎన్‌హెచ్‌ఏఐ ప్రధాన కార్యాలయ ఉన్నతాధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. తర్వాత ఆ విభాగం ప్రాంతీయ అధికారి కార్యాలయం నుంచి మరో మూడు లేఖలు, ఆ తర్వాత ఎన్‌హెచ్‌ఏఐ చైర్మన్‌ సంతోష్‌ కుమార్‌ యాదవ్‌ ఒక లేఖ రాయగా.. తాజాగా ఎన్‌హెచ్‌ఏఐ చైర్మన్‌ మరో లేఖ రాశారు.

‘‘భూసేకరణకు సంబంధించి అవార్డు పాస్‌ చేసేందుకు అవసరమైన 3డీ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయాల్సి ఉంది. ఈలోపే రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు చెల్లించే విధానాన్ని స్పష్టం చేయాలి. నిధులు కూడా అందాలి. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదలతో సంబంధిత భూములు కేంద్ర ప్రభుత్వం ఆ«దీనంలోకి వస్తాయి. అప్పుడు రాష్ట్ర నిధుల వాటా లేని పక్షంలో పరిహారం చెల్లింపులో న్యాయపరమైన చిక్కులు ఏర్పడుతాయి’’అని అందులో స్పష్టం చేశారు. 

జాప్యమైతే వ్యయం మోత! 
తొలుత రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రతిపాదించినప్పుడు ఉత్తర భాగానికి రూ.9 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. కోవిడ్‌ వల్ల జరిగిన జాప్యం వల్ల ఇప్పటికే అంచనా వ్యయం రూ.15 వేల కోట్లకు చేరువైంది. ఇంకా జాప్యం జరిగితే ప్రామాణిక ధరల పట్టిక (ఎస్‌ఎస్‌ఆర్‌)లో మార్పులు వచ్చి అంచనా వ్యయం మరో రూ.2–3 వేల కోట్ల వరకు పెరిగే అవకాశం ఉందని అధికారవర్గాలు చెప్తున్నాయి. రోడ్డు త్వరగా అందుబాటులోకి వస్తే ఆయా ప్రాంతాల్లో వాణిజ్యపరంగా పురోగతి ఉండటం, పెట్టుబడుల రాక, స్థానికుల ఉపాధి అవకాశాలు పెరిగే పరిస్థితితోపాటు హైదరాబాద్‌ నగరంపై ట్రాఫిక్‌ భారానికి కొంత పరిష్కారం లభిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఎన్‌హెచ్‌ఏఐ లేఖలపై వివరణ కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని సంప్రదించడానికి ‘సాక్షి’ప్రయతి్నంచగా ఆమె స్పందించలేదు.   

మరిన్ని వార్తలు