లాక్‌డౌన్‌: తెగ తిరుగుతున్నారు!

17 May, 2021 03:13 IST|Sakshi

వాట్సాప్‌లో మందుల చీటీలతో రోడ్లపైకి.. 

 లాక్‌డౌన్‌ నిబంధనలు బేఖాతరు 

 నాలుగురోజుల్లో సుమారు 28,000 కేసులు 

ఉపేక్షించబోమంటున్న పోలీసులు

సాక్షి, హైదరాబాద్‌: రోడ్డు మీదికి బైక్‌పై వచ్చిన ఓ యువకుడిని పోలీసులు ఆపగా ‘మా పక్క వీధిలో అంకుల్‌కు కరోనా సార్‌.. ఆయనకు అర్జంటుగా విటమిన్‌ ట్యాబ్లెట్లు కావాలి. అందుకే బయటికి వచ్చా’అంటూ సాకులు చెప్పాడు. ‘సార్‌.. మా అమ్మకు తలనొప్పిగా ఉంది. అందుకే మాత్రల కోసం పోతున్నాను, సార్‌..’ఇది మరోచోట మరో యువకుడు చెప్పిన కారణం. ఇలా చాలాచోట్ల చాలామంది లాక్‌డౌన్‌ సమయంలో రోడ్ల మీదికి వచ్చి తప్పుడు కారణాలు చెబుతూ పోలీసులను తప్పుదోవపట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఏదో ఒక మెడికల్‌ ప్రిస్క్రిప్షన్‌ను జేబులో పెట్టుకోవడం, లేదంటే వాట్సాప్‌లో ఎవరో షేర్‌ చేసిన మందులచీటి పట్టుకుని ధీమాగా బయటికి వస్తూ లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు.

(మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) 

కరోనా సెకండ్‌ వేవ్‌ రోజురోజుకూ విజృంభిస్తుండటం, పాజిటివ్‌ కేసులు పెద్దసంఖ్యలో నమోదవుతుండటం, మరణాలు కూడా పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా పదిరోజుల లాక్‌డౌన్‌ విధించింది. అయితే, దీనిని కొందరు ఆకతాయిలు ఖాతరు చేయడంలేదు. ఓ వైపు కరోనాతో ప్రజల ప్రాణాలు పోతుంటే.. తమకేమీ పట్టనట్లు మరికొందరు రోడ్ల మీదికి వస్తున్నారు. ఇలాంటి నిర్లక్ష్యపూరిత ధోరణి మైనర్లు, యువతలోనే అధికంగా కనబడటం గమనార్హం. ఈ నెల 12న మొదలైన లాక్‌డౌన్‌ 21వ తేదీ వరకు కొనసాగుతుంది. కానీ, 16వ తేదీ నాటికే సుమారు 28 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి.  

ఉదయం సమయం ఉన్నా...! 
వాస్తవానికి గతేడాది లాక్‌డౌన్‌కు ఈసారి లాక్‌డౌన్‌కు చాలా వ్యత్యాసం ఉంది. గత లాక్‌డౌన్‌ సమయంలో ఎలాంటి మినహాయింపులు, వెసులులబాట్లు లేవు. కానీ, ఇప్పుడు రోజూ ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ఇంటికి ఒక్కరు, అది కూడా ఏదైనా అవసరం ఉంటేనే బయటికి రావాలని సూచించింది. పోలీసులు కూడా రోజూ ఇదే విషయాన్ని ప్రచారం చేస్తున్నారు. కానీ, ఆ సమయంలో మార్కెట్‌లోకి పొలోమని వస్తున్న చాలామంది కోవిడ్‌ నిబంధనలను పాటించడం లేదు. కూరగాయల మార్కెట్, వ్యాపారసముదాయాల వద్ద ప్రజల రద్దీ అధికంగా ఉంటోంది. వైన్‌షాపుల వద్దనైతే చెప్పనవసరం లేదు. ఉదయం 5.50 గంటలకల్లా వైన్‌షాపుల వద్ద మందుబాబులు బారులు తీరుతున్నారు. 

గ్రేటర్‌లోనే అధిక ఉల్లంఘనలు! 
లాక్‌డౌన్‌ ఉల్లంఘనల్లో సింహభాగం గ్రేటర్‌ హైదరాబాద్‌లోనే ఉన్నాయి. హైదరాబాద్‌ కమిషనరేట్‌లో 5,767, సైబరాబాద్‌లో 1,972, రాచకొండలో 3,894 కేసులు నమోదయ్యాయి. 11వేలకుపైగా కేసులు రాజధానిలోనే నమోదు కావడం గమనార్హం. ఇక మిగిలిన 17 వేల ఉల్లంఘనలు అన్ని జిల్లాల్లో కలిపి నమోదయ్యాయి. పొంతనలేని జవాబులు చెప్పినవారిపై కేసు నమోదు చేసి ఫోన్‌ నంబరు, బండి వివరాలు తీసుకుని, వారిని కోర్టుకు వెళ్లాల్సిందిగా సూచిస్తున్నారు. ఒక్కొక్కరికి రూ.వెయ్యి జరిమానా కూడా విధిస్తున్నారు.   

మరిన్ని వార్తలు