ఒక్కరోజులో 1.75 లక్షల టీకాలే

24 Sep, 2021 04:32 IST|Sakshi

టీకాల ప్రత్యేక కార్యక్రమానికి వ్యాక్సిన్ల కొరత

తాజాగా 247 కరోనా కేసులు

సాక్షి, హైదరాబాద్‌: కరోనా టీకాల పంపిణీ ప్రత్యేక కార్యక్రమానికి ఆటంకాలు ఏర్పడ్డాయి. ఈ నెలాఖరునాటికి కోటి టీకాలు వేయాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని వ్యాక్సిన్ల కొరత కారణంగా వైద్య ఆరోగ్య శాఖ చేరుకునేలా కనిపించడంలేదు. రోజుకు ఆరు నుంచి ఏడు లక్షల టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్న వైద్య ఆరోగ్య శాఖ బుధవారం 1,75,864 టీకాలు మాత్రమే వేయగలిగింది. అందులో మొదటి డోస్‌ 1,37,656 కాగా, రెండో డోస్‌ టీకాలు 38,208 ఉన్నాయి.

దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 2.31 కోట్ల మందికి టీకాలు వేశారు. ఇక రాష్ట్రంలో గురువారం నిర్వహించిన 51,521 కరోనా నిర్ధారణ పరీక్షల్లో కొత్తగా 247 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,64,411కి చేరుకుందని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు విడుదల చేసిన బులెటిన్‌లో వెల్లడించారు. కరోనాతో ఒక్క రోజులో ఒకరు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 3,909కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,877 యాక్టివ్‌ కేసులున్నాయి.  

మరిన్ని వార్తలు