గ్రేటర్‌ వాసులను బెంబేలెత్తించిన వాన... ధ్వంసమైన డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు

5 May, 2022 08:45 IST|Sakshi
విరిగిపడిన చెట్ట కొమ్మలు నేల కూలిన విద్యుత్‌ స్థంభాలు

సాక్షి, హైదరాబాద్‌: భారీ ఈదురుగాలులతో కురుస్తున్న వర్షాలు గ్రేటర్‌ వాసులను బెంబేలెత్తిస్తున్నాయి. బుధవారం తెల్లవారుజామున గాలివానతో అనేక చోట్ల చెట్ల కొమ్మలు, హోర్డింగ్‌లు విరిగి లైన్లపై పడ్డాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలో 400పైగా 11 కేవీ ఫీడర్లు, 80కిపైగా 33 కేవీ ఫీడర్లు ట్రిప్పవగా, 60పైగా విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి. మరో నాలుగు డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతినడంతో సరఫరాకు తీవ్ర అంత రాయం ఏర్పడింది.  విద్యుత్‌ సిబ్బంది అప్రమత్తమై కొన్ని చోట్ల సరఫరాను వెంటనే పునరుద్ధరించారు.

మరికొన్ని చోట్ల రాత్రి అంధకారం తప్పలేదు. ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి వరకు కరెంట్‌ లేకపోవడంతో ముఖ్యంగా బహుళ అంతస్తుల భవనాల్లోని లిఫ్ట్‌లు, మంచినీటి సరఫరా మోటార్లు పని చేయకపోవడంతో వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు. అత్యవసర సమయంలో 1912 కాల్‌ సెంటర్‌ మూగబోగా, కొంతమంది లైన్‌మెన్లు, ఇంజినీర్లు తమ ఫోన్లు స్విచ్‌ ఆఫ్‌ చేసుకోవడం గమనార్హం.  

850 మెగావాట్లకు పడిపోయిన విద్యుత్‌ డిమాండ్‌ 
గ్రేటర్‌ జిల్లాల్లో చాలా వరకు ఓవర్‌హెడ్‌ లైన్లే. ఈ లైన్ల కిందే చెట్టు నాటుతుండటం, అవిపెరిగి పెద్దవై ఈదురుగా లులకు విరిగి పడుతుండటంతో తెగిపడుతున్నాయి.  ప్రధాన వీధులు సహా శివారు ప్రాంతాల్లోనూ విచ్చలవిడిగా హోర్డింగ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో చాలా వరకు విద్యుత్‌ లైన్లను ఆనుకుంటున్నాయి. ఫ్లెక్సీలు, బ్యానర్లు చిరిగి గాలికి ఎగిరి లైన్ల మధ్య చిక్కుకుంటున్నాయి. ఒకదానికొకటి ఆనుకోవడంతో షార్ట్‌సర్క్యూట్‌ తలెత్తి ఫీడర్లు ట్రిప్పవుతున్నాయి. తెల్లవారుజామున అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షానికి కరెంట్‌ సరఫరా నిలిచిపోవడంతో ఇబ్బంది పడాల్సివ చ్చింది. వర్షం వెలియగానే కొన్ని చోట్ల సరఫరాను పునరుద్ధరించిన్పటికీ.. చెట్ల కొమ్మలు ఎక్కువగా ఉన్న సమస్యాత్మక ప్రాంతాల్లో ఆరేడు గంటలకుపైగా శ్రమించాల్సి వచ్చింది.   

 ఆ సర్కిళ్లలోనే ఎక్కువ నష్టం 
ఈదురు గాలితో కూడిన వర్షానికి సరూర్‌నగర్, మేడ్చల్, సికింద్రాబాద్, హబ్సీగూడ సర్కిళ్ల పరిధిలోనే ఎక్కువ నష్టం వాటిల్లినట్లు డిస్కం ఇంజినీర్లు గుర్తించారు. ఎల్బీనగర్, నాగోలు, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, ఇబ్రహీంపట్నం, యాచారం, బీఎన్‌రెడ్డి, పసుమాముల, తుర్కయాంజాల్‌ పరిసర ప్రాంతాల్లోనే 37 విద్యుత్‌ స్తంభాలు నేలకూలినట్లు అధికారులు గుర్తించారు. చెట్ల కొమ్మలు, హోర్డింగ్‌లు ఎక్కువ ఉన్న కంటోన్మెంట్, బోయిన్‌పల్లి, ప్యారడైజ్, సైఫాబాద్, మెహిదీపట్నం, చార్మినార్, కాచిగూడ, ఆస్మాన్‌గడ్, ఓల్డ్‌మలక్‌పేట్, రాజేంద్రనగర్, సికింద్రాబాద్, శంషాబాద్, మీర్‌పేట్, బాలానగర్, ఉప్పల్, బోడుప్పల్, చర్లపల్లి, మేడ్చల్‌ తదితర ప్రాంతాల్లో ఐదు 33 కేవీ, పదిహేను 11 కేవీ, 37 ఎల్టీ పోల్స్‌ నేలకూలాయి. అంతేకాదు సైబర్‌సిటీ సర్కిల్‌లో 11 ఫీడర్లు ట్రిప్పవగా, హబ్సీగూడలో 35 ఫీడర్లు, మేడ్చల్‌లో 35, రాజేంద్రనగర్‌లో 18, సరూర్‌నగర్‌లో 21, సికింద్రాబాద్‌లో 17, హైదరాబాద్‌ సౌత్‌లో 14, హైదరాబాద్‌ సెంట్రల్‌ సర్కిల్‌లో 12, బంజారాహిల్స్‌లో ఐదు ఫీడర్లు ట్రిప్పయ్యాయి. ఈదురు గాలులతో కూడిన వర్షం కారణంగా గ్రేటర్‌ జిల్లాల్లో సుమారు రూ.50 లక్షలకుపైగా ఆస్తినష్టం వాటిల్లినట్లు అంచనా.

మరిన్ని వార్తలు