జిల్లా, ఏరియా ఆస్పత్రుల్లో..  ‘పది పడకల ఐసీయూ’లు 

6 Jun, 2021 04:22 IST|Sakshi
వర్చువల్‌గా ప్రారంభిస్తున్న కేటీఆర్‌

ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో కార్యక్రమం 

వర్చువల్‌ విధానంలో నారాయణపేట ఆస్పత్రిలో ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌  

సాక్షి, హైదరాబాద్‌:  తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఆరోగ్య రంగంలో మౌలిక వసతుల కల్పనకు సీఎం కేసీఆర్‌ అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. పలు స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘పది పడకల ఐసీయూ’ కార్యక్రమాన్ని శనివారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. వర్చువల్‌ విధానంలో నారాయణపేట ఆస్పత్రి వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో కేటీఆర్‌ మాట్లాడారు. గడిచిన ఏడేండ్లలో తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఐదు ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలతోపాటు 1,600 ఐసీయూ పడకలను ఏర్పాటు చేసిందని ఆయన చెప్పారు.

మరో ఏడు ప్రభుత్వ కాలేజీల ఏర్పాటుకు సన్నాహలు జరుగుతున్నాయని వివరించారు. పది పడకల ఐసీయూ కార్యక్రమం గ్రామీణ ప్రాం తాల్లో కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు దోహదం చేస్తుందని తెలిపారు. ప్రస్తుతం 600 ఐసీయూ పడకలతో గాంధీ ఆస్పత్రి దేశంలోనే అతిపెద్ద ఆస్పత్రిగా పేరుపొందిందని వివరించారు. కొత్తగా చేపట్టిన ‘పది పడకల ఐసీయూ’కార్యక్రమం రాష్ట్రంలోని 33 జిల్లా, ఏరియా ఆస్పత్రులకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా విస్తరించాలని కేటీఆర్‌ ఆకాంక్షించారు. కరోనా మూడో వేవ్‌ వస్తే ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ఏర్పాట్లపై దృష్టి సారించిందని పేర్కొన్నారు. 


దేశంలో వంద జిల్లా ఆస్పత్రులకు విస్తరిస్తాం 
తెలంగాణలో పది పడకల ఐసీయూ కార్యక్రమానికి చేయూత అందిస్తున్నామని.. దేశంలో వంద జిల్లా ఆస్పత్రులకు దీనిని విస్తరించే లక్ష్యంతో పనిచేస్తున్నామని ఖోస్లా వెంచర్స్‌ సంస్థ వ్యవస్థాపకుడు వినోద్‌ ఖోస్లా తెలిపారు. గ్రామీణ ప్రాంత ఆస్పత్రుల్లో వసతుల కోసం సామాజిక, సాంకేతిక వేదికలు ముందుకు రావాలని కోరారు. 

మరిన్ని వార్తలు