ప్రభుత్వ వైద్యంపై భరోసా.. ఆచరణలో చూపుతున్న ఐఏఎస్, ఐపీఎస్‌లు

11 Nov, 2021 13:19 IST|Sakshi
ఖమ్మం అదనపు కలెక్టర్‌ స్నేహలత కుమార్తె.. పక్కన ఆమె భర్త, ఏఎస్పీ శబరీష్‌ (ఫైల్‌), కుమార్తెతో ఖమ్మం కలెక్టర్‌ గౌతమ్‌ దంపతులు

సాక్షి, భద్రాచలం(ఖమ్మం): నాటి ఐటీడీఏ పీఓ, నేటి ఖమ్మం జిల్లా కలెక్టర్‌ వీ.పీ.గౌతమ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్‌దత్, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌ దురిశెట్టి అనుదీప్‌ తదితర ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో భరోసా పెంచేలా చర్యలు తీసుకుంటున్నారు. చిన్నపాటి జ్వరమొస్తేనే కార్పొరేట్‌ ఆస్పత్రులకు పరుగులు తీస్తున్న ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ మెరుగైన వైద్యం అందుతుందని మాటల్లో చెప్పడమే కాదు చేతల్లోనూ నిరూపిస్తున్నారు. తమ సతీమణులకు వారు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవం చేయించడంపై అభినందలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాలు
ప్రభుత్వ ఆస్పత్రి అంటేనే ఇప్పటికీ చాలా మందిలో తెలియని అపనమ్మకం, రిస్క్‌ చేస్తున్నామా అనే ఆందోళన వెంటాడుతుంటాయి. అందుకే అప్పు చేసైనా సరే ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో వైద్యానికే ఎక్కువ మంది మొగ్గుచూపుతున్నారు. ఇదే సమయాన ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాలు జరిగేలా అధికారులు ప్రోత్సహిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ వైద్యంపై చిన్నచూపు చూస్తున్న ప్రజల్లో అపోహలు తొలగించేలా ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు కృషి చేస్తుండడం విశేషం.

గతంలో భద్రాచలం ఐటీడీఏ పీఓగా పనిచేసి ప్రస్తుతం ఖమ్మం కలెక్టర్‌గా వీ.పీ. గౌతమ్‌ 2019 అక్టోబర్‌ 28న భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో తన సతీమణికి ప్రసవం చేయించారు. అలాగే, 2020 ఆగస్టు 27న ఎస్పీ సునీ ల్‌దత్‌ కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రిలో తన భార్యకు ప్రసవం చేయించారు. తాజాగా భద్రాద్రి కలెక్టర్‌ అనుదీప్‌ సైతం తన సతీమణి మాధవికి బుధవారం భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో ప్రస వం చేయించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ప్రభు త్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు పొందాలంటూ చెబు తున్న మాటలను ఆచరణలో చూపించిన యువ అధికారులు ‘భేష్‌’ అనిపించుకున్నారు. 

ఖమ్మం అదనపు కలెక్టర్‌ కూడా..
ఖమ్మం అదనపు కలెక్టర్‌గా ఐఏఎస్‌ అధికారి స్నేహలత మొగిలి విధులు నిర్వర్తిస్తుండగా, ఆమె భర్త, ఐపీఎస్‌ అధికారి శబరీష్‌ భద్రాద్రి జిల్లా మణుగూరు ఏఎస్‌పీగా ఉన్నారు. ఈమేరకు స్నేహలత గతనెల 22న ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవించారు. ఆ మరుసటి రోజు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఆస్పత్రికి వెళ్లి స్నేహలత శబరీష్‌ దంపతులను అభినందించారు.

భద్రాచలం ఏరియా ఆస్పత్రి ప్రత్యేకం
ఏజెన్సీలో నిత్యం వందలాది మంది రోగులకు వైద్య సేవలను అందించే ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి జిల్లాకే తలమానికంగా ఉంది. భద్రాచలం చుట్టు పక్కల ఉన్న ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు సేవలందించటంలో ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ముందంజలోనే నిలుస్తోంది. అత్యధికంగా సాధారణ ప్రసవాలు చేస్తుండడంతో పాటు నవజాత శిశువులు, ఇతరత్రా సేవలను అందించడానికి ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి.

అదేవిధంగా నాలుగు మార్లు కాయకల్ప అవార్డు సొంతం చేసుకున్న ఘనత ఈ ఆస్పత్రి సొంతం. అలాంటి ఏరియా ఆస్పత్రిలో తమ కుటుంబీకులకు వైద్యం చేయించి ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో భరోసా కల్పించటానికి యువ ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు కృషి చేస్తున్నారు. గతంలో భద్రాచలం ఐటీడీఏ పీఓగా పనిచేసిన వీరపాండియన్‌ తల్లిదండ్రులు ఇదే ఆస్పత్రిలో వైద్య సేవలను పొందేవారు. ఇవన్నీ పక్కన పెడితే భద్రాద్రి రామయ్య సన్నిధిలో కుమార్తె లేదా కుమారుడు పుట్టాలనే ఆకాంక్ష కూడా పలువురు తల్లిదండ్రులను ఈ ఆస్పత్రికి నడిపిస్తోందని చెబుతారు.

కార్పొరేట్‌ సౌకర్యాలు ఉన్నాయ్‌..వినియోగించుకోండి
ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని భద్రా ద్రి జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ సూచించారు. తన సతీమణికి మంగళవారం అర్ధరాత్రి 12 గంటలకు పురిటి నొప్పులు రాగా, భద్రాచలం ఆస్పత్రికి తీసుకెళ్లామని చెప్పారు. అక్కడ జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి ముక్కంటేశ్వరరావు, ఆస్పత్రి పర్యవేక్షకులు రామకృష్ణ పర్యవేక్షణలో వైద్యులు భార్గవి, దేవిక, నర్సులు కళ్యాణి, రాజ్యలక్ష్మి ప్రసవం చేశారని తెలిపారు.

ప్రభుత్వ ఆస్పత్రిలో కార్పొరేట్‌ స్థాయిలో వసతులు, నిపుణులైన వైద్య సిబ్బంది ఉన్నారని పేర్కొన్నారు. దీంతో తన సతీమణికి భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ప్రసవం చేయించినట్లు కలెక్టర్‌ బుధవారం సాయంత్రం ఓ ప్రకటనలో వెల్లడించారు. 

మరిన్ని వార్తలు